Trisha: త్రిషపై మన్సూర్‌ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కోలీవుడ్‌ ప్రముఖుల ఆగ్రహం

నటి త్రిషను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు నటుడు మన్సూర్‌ అలీఖాన్‌. దీనిపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Published : 19 Nov 2023 12:10 IST

చెన్నై: నటి త్రిష (Trisha)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ (Mansoor Ali Khan). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘లియో’లో త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ

కాగా, ఈ వ్యాఖ్యలపై త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనందుకు ఆనందంగా ఉందన్నారు. ‘‘మన్సూర్ అలీ ఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అతడి లాంటి క్రూరమైన వ్యక్తితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనందుకు సంతోషంగా ఉంది. నా ఫిల్మ్‌కెరీర్‌లో ఇలాంటి వారితో నటించకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది’’ అని త్రిష ట్వీట్‌ చేశారు. ‘లియో’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌, నటి మాళవికా మోహనన్‌, గాయని చిన్మయి వంటి సెలబ్రిటీలు సైతం మన్సూర్‌ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు తమని ఆగ్రహానికి గురి చేశాయన్నారు. తోటి కళాకారులు, మహిళలను గౌరవించకపోవడం బాధాకరంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

మరోవైపు, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో మన్సూర్‌ స్పందించారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందన్నారు. ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు. తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు