Michael: నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్‌

‘‘తెలుగు పరిశ్రమ కాలర్‌ ఎగరేసుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో ‘మైఖేల్‌’తో ఓ కొత్త ప్రయత్నం చేశాం. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు సందీప్‌ కిషన్‌. ఆయన కథానాయకుడిగా రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘మైఖేల్‌’.

Updated : 21 Oct 2022 12:29 IST

‘‘తెలుగు పరిశ్రమ కాలర్‌ ఎగరేసుకునే సమయం ఇది. ఇలాంటి సమయంలో ‘మైఖేల్‌’తో (Michael) ఓ కొత్త ప్రయత్నం చేశాం. దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan). ఆయన కథానాయకుడిగా రంజిత్‌ జయకోడి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘మైఖేల్‌’. భరత్‌ చౌదరి, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. దివ్యాంశ కౌశిక్‌ (Divyanka Kaushik) కథానాయిక. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వరుణ్‌ సందేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర తెలుగు టీజర్‌ను నాని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘నాకు నేనుగా పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష ఈ ‘మైఖేల్‌’. మూడేళ్ల క్రితం నుంచి ఈ చిత్రం కోసం పనిచేయడం ప్రారంభించాం. ఈ సినిమా కోసం 24కిలోల బరువు తగ్గాను. దర్శకుడు రంజిత్‌.. ఈ ప్రపంచం నాకిచ్చిన పెద్ద గిఫ్ట్‌. అద్భుతమైన ఫిల్మ్‌మేకర్‌ తను. షూటింగ్‌లో నాకంటే ఎక్కువ రిస్క్‌లు చేసింది తనే. టీజర్‌ చూసి ప్రేక్షకులు చాలా మంచి సినిమా తీశామనే ధైర్యాన్ని ఇచ్చారు. ఈ చిత్రంతో విజయ్‌ సేతుపతి అన్నతో పని చేసే అవకాశం దొరికింది. చాలా గొప్పగా అనిపించింది’’ అన్నారు. ‘‘చాలా కష్టపడి ఈ చిత్రం చేశాం. టీజర్‌లో కనిపించింది పది శాతమే. సినిమాలో ఇంకా చాలా ఉంది. దాన్ని తప్పకుండా తెరపై చూడాలని కోరుకుంటున్నా’’ అంది నాయిక దివ్యాంశ. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మంచి కథతో.. అద్భుతమైన నిర్మాణ విలువలతో తీసిన చిత్రమిది. దీనికోసం సందీప్‌ కిషన్‌ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌.సిఎస్‌, ఛాయాగ్రహణం: కిరణ్‌ కౌశిక్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని