Mission Raniganj: అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు అక్షయ్‌.. బొగ్గుగని నేపథ్యంలో ‘మిషన్‌ రాణిగంజ్‌’

Mission Raniganj: అక్షయ్‌ కొత్త చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ సినిమాను బాలకృష్ణ నటించిన ‘నిప్పురవ్వ’తో పోలుస్తున్నారు.

Updated : 07 Sep 2023 19:07 IST

హైదరాబాద్‌: ఈ మధ్య కథలన్నీ గోల్డ్‌ మైన్స్‌, బొగ్గు గనుల చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పరంపరలో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar). అంతేకాదు, బయోపిక్‌లలో నటించడంలోనూ ముందుంటారు. ఇటీవల ‘ఓఎంజీ2’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టిను సురేష్‌ దేశాయ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ నటించిన తాజా చిత్రం ‘మిషన్‌ రాణిగంజ్‌’ (Mission Raniganj). బొగ్గుగని నేపథ్యంలో సాగే రెస్క్యూ ఆపరేషన్‌ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, నెటిజన్లు అందరూ గతంలో నటించిన బాలకృష్ణ మూవీకి లింక్‌ పెడుతున్నారు.

1993లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో  బాలకృష్ణ నటించిన చిత్రం ‘నిప్పురవ్వ’(Nippu ravva).  విజయశాంతి కథానాయిక మాత్రమే కాదు, నిర్మాత భాగస్వామిగానూ వ్యవహరించారు. రాణి గంజ్ బొగ్గు గనుల్లో జరిగిన ప్రమాద సంఘటన ఆధారంగా కథను సింగరేణి మైన్స్ బ్యాక్ డ్రాప్‌నకు మార్చి ‘నిప్పురవ్వ’ను తెరకెక్కించారు.  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అయితే, బాలకృష్ణ నటన, రెస్క్యూ ఆపరేషన్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాయి. ఇప్పుడు అక్షయ్‌ దాన్నే పూర్తి స్థాయి మూవీగా వాస్తవికతకు మరింత దగ్గరగా తీశారు. కథ పరంగా కొన్ని మార్పులు ఉన్నా, కొన్ని సారుప్యతలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు. ఇక అక్షయ్‌ మూవీ అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1989లో ‘రాణిగంజ్‌’ బొగ్గు గనుల్లో మైనింగ్‌ వర్క్‌ జరుగుతుండగా, ఒక్కసారిగా నీళ్లు వచ్చేశాయి. మైనింగ్‌ ఇంజినీర్‌ అయిన జస్వంత్‌సింగ్‌ గిల్‌ (అక్షయ్‌కుమార్‌), పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అమర్‌ జోషిలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, కార్మికులను ఎలా కాపాడారన్న ఇతివృత్తంతో ఈ సినిమా సాగుతుంది. ‘రాణిగంజ్‌’ బొగ్గు గని ప్రమాద సమయంలో 220 మంది కార్మికులు రాత్రి విధుల్లో ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే 149 మంది మైనింగ్‌ నుంచి బయటకు రాగా, మరో 64 మంది రెస్క్యూ సిబ్బంది కాపాడింది. ఆరుగురు చనిపోయారు. ఒక వ్యక్తి దాదాపు 36 గంటల తర్వాత ఈదుకుంటూ బయటకు వచ్చాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని