Sobhita Dhulipala: ఆమె గొప్ప నటి.. శోభిత ధూళిపాళపై హాలీవుడ్‌ హీరో ప్రశంసలు

‘మంకీ మ్యాన్‌’తో శోభిత ధూళిపాళ హాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఆ సినిమా హీరో శోభితపై ప్రశంసలు కురిపించారు.

Published : 06 Apr 2024 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో అలరించిన శోభిత ధూళిపాళ ‘మంకీ మ్యాన్‌’తో (Monkey Man) హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దేవ్‌ పటేల్ స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. తాజాగా దీని ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడుతూ శోభితపై ప్రశంసలు కురిపించారు.

‘శోభిత అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అందగత్తె మాత్రమే కాదు ఆమె గొప్ప నటి. ‘మంకీ మ్యాన్‌’లో తన పాత్రకు వందశాతం న్యాయం చేసింది. ఇది ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. మనసులో బాధ ఉన్నా.. తన వారిని కాపాడడం కోసం పోరాడే మహిళగా అద్భుతంగా నటించింది. నా జీవితంలో ఇలాంటి సంపూర్ణమైన నటిని చూడలేదు’ అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ చిత్రం గురించి చెబుతూ.. ‘ఈ ప్రాజెక్ట్‌ను కొవిడ్‌కు ముందు మొదలుపెట్టాం. షూటింగ్‌ ప్రారంభించిన కొన్ని రోజులకే లాక్‌డౌన్‌ విధించారు. కరోనా బారినపడి సినిమాటోగ్రాఫర్‌ మరణించారు. దీన్ని కొనసాగించడం చాలా కష్టమని భావించా. ఆ తర్వాత ఇండోనేషియా వెళ్లి అక్కడ 500 మంది సిబ్బందితో భారీ సెట్‌ వేసి చిత్రీకరణ పూర్తి చేశాం. తొమ్మిది నెలలు దీని కోసం ఎంతో కష్టపడ్డాం. అవుట్‌పుట్‌ చూశాక ఆ కష్టమంతా మర్చిపోయాం’ అన్నారు.

ఇక అమెరికాలో ఏప్రిల్‌ 5న దీన్ని విడుదల చేశారు. అక్కడ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారత్‌లో ఏప్రిల్‌ 19న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా కాస్త ఆలస్యంగా ఏప్రిల్‌ 26న రిలీజ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పురాణ పురుషుడు హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకున్న హీరో.. బలహీనుల్ని దోచుకునే బలవంతుల ఆట కట్టించేందుకు ఏం చేశాడనే కథాంశంతో దీన్ని రూపొందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని