Oscar: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను నామినేట్‌ చేయకపోవటం బాధాకరం: ఎన్‌. శంకర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఆస్కార్‌కు నామినేట్‌ చేయకపోవటం ఆశ్చర్యానికి గురిచేసిందని దర్శకుడు ఎన్‌. శంకర్‌ అన్నారు. దేశభక్తి నిండిన ఆ చిత్రాన్ని ఎంపిక చేయకపోవటం బాధాకరమన్నారు

Published : 21 Sep 2022 22:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రాన్ని ఆస్కార్‌కు నామినేట్‌ చేయకపోవటం ఆశ్చర్యానికి గురిచేసిందంటూ ‘ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’పై దర్శకుడు ఎన్‌. శంకర్‌ (N Shankar) అసహనం వ్యక్తం చేశారు. దేశభక్తి నిండిన ఆ చిత్రాన్ని ఎంపిక చేయకపోవటం బాధాకరమన్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఆయన ఓ లేఖను పంచుకున్నారు. ‘‘ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’.. గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ (Chhello Show)ని ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ చేసిందనే విషయం తెలియగానే ఆ సినిమా టీజర్‌ చూశా. అలాంటి కంటెంట్‌ ఉన్న చిత్రాలు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో చాలా ఉన్నాయి.  ఇండియన్‌ ఆస్కార్‌ నామినేట్‌ కమిటీకి జ్యూరీ సభ్యుడిగా, గోవా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డ్‌ కమిటీకి జ్యూరీ మెంబర్‌గా, నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌ కమిటీకి వైస్‌ ఛైర్మన్‌గా నేను పనిచేశా. ఉమ్మడి రాష్ట్రంలో ఆరుసార్లు జ్యూరీ మెంబర్‌గా, నంది అవార్డ్స్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశా. ఆ అనుభవంతోనే చెబుతున్నా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను జ్యూరీకి పంపకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో దేశభక్తితోపాటు గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయి. గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ని ఏ కోణంలో నామినేట్‌ చేశారో తెలియదు కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ను పంపకపోవటం బాధాకరం’’ అని శంకర్‌ లేఖలో రాశారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌-2023లో పోటీ చేస్తుందని చాలా మంది భావించారు. హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మ్యాగజైన్‌ సైతం పలు విభాగాల్లో ఈ సినిమా నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. కానీ, ఆ అంచనాలు తప్పాయి. ‘ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా’.. ‘ఛెల్లో షో’ను ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్ విభాగానికి భారత్‌ తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. దాంతో, తెలుగు సినీ ప్రియులు, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు నిరాశ చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని