Nani - Dasara: ఆ మాట వద్దు.. ‘పఠాన్‌’ మాది.. ‘దసరా’ మీది: నాని

నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని ముంబయి వెళ్లారు. అక్కడి యువతతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

Updated : 07 Mar 2023 19:10 IST

ముంబయి: ప్రాంతాల పేరుతో కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కటే అనే భావన కలిగేలా కలిసుందామని హీరో నాని (Nani) పిలుపునిచ్చారు. ఉత్తరాది, దక్షిణాది సినిమా అనే మాట వద్దని ప్రేక్షకులకు హితవు పలికారు. తన తాజా చిత్రం ‘దసరా’ (dasara) ప్రచారంలో భాగంగా ముంబయి వెళ్లిన నాని జుహులో స్థానికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి యువతతో రంగులు పూయించుకుంటూ, సెల్ఫీ తీసుకుంటూ ప్రచార జోరు చూపించారు. హిందీలో ‘దసరా’లోని సంభాషణలు చెప్పి ఉత్సాహాన్ని నింపారు.

అనంతరం మాట్లాడుతూ.. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పఠాన్’ లాంటి చిత్రాలతో ఇప్పుడంతా భారతీయ సినిమాగా మారిందని గుర్తుచేశారు. ఇక్కడ రూపొందిన ‘పఠాన్‌’ మాది.. అక్కడ తెరకెక్కిన ‘దసరా’ మీది అంటూ  సందడి చేశారు. ‘అంటే.. సుందరానికీ!’ తర్వాత నాని హీరోగా నటించిన చిత్రమిది. పాన్‌ ఇండియా స్థాయిలో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకురానుంది.

సినిమా విడుదల నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఒక్కో పాటను విడుదల చేస్తూ, పలు ప్రాంతాల్లో ఈవెంట్స్‌ నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో నాని.. ధరణి అనే పాత్రలో పక్కా మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ‘నేను లోకల్‌’ తర్వాత నాని- కీర్తి సురేశ్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రంకావడం, నాని కెరీర్‌లో తొలి పాన్‌ ఇండియా సినిమాకావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని