Naveen Polishetty: ఆ రోజు బాధపడ్డా.. ఇప్పుడు గెస్ట్‌గా వచ్చా: నవీన్ పొలిశెట్టి

‘స్వాతిముత్యం’ ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. యువ నటులు నవీన్‌ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందాన్ని అభినందించారు.

Published : 03 Oct 2022 11:50 IST

హైదరాబాద్‌: ‘‘తెలుగు చిత్రపరిశ్రమలో పనిచేయడమనేది ఒక వరం’’ అంటున్నారు నటుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty). బెల్లంకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ‘స్వాతిముత్యం’ (Swathimuthyam) ప్రీ రిలీజ్‌ వేడుకలో నవీన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘‘కొన్నేళ్ల క్రితం ఇదే శిల్పకళావేదికలో ఎన్నో ఈవెంట్స్‌కి ఫ్యాన్‌ పాసులు దొరక్క బాధపడుతూ తిరిగి వెళ్లిపోయిన రోజులు ఉన్నాయి. ఆరోజు నిరాశతో తిరిగివెళ్లిపోయిన ఆ అభిమానే ఈరోజు ఇదే వేదికపై అతిథిగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉంది. తెలుగు చిత్రపరిశ్రమలో పనిచేయడం ఒక వరం. ఎందుకంటే, కరోనా వేళ ప్రతి పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, థియేటర్లలో పూర్వవైభవం కనిపిస్తుందా? లేదా? అని అందరూ ఆలోచనలో పడ్డ వేళ నటీనటులపై ప్రేమాభిమానాలతో సినిమాలను బ్లాక్‌బస్టర్‌ చేసిన వారే మన తెలుగు ప్రేక్షకులు. వారి అభిమానాన్ని పొందుతున్నందుకు ఆనందిస్తున్నా. మళ్లీ మిమ్మల్ని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమవుతున్నా’’ అని నవీన్‌ అన్నారు. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ, సుమతో కలిసి ‘చిట్టి నీ నవ్వంటే’ పాటకు స్టేజ్‌పై స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది.

‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. ఈ బ్యానర్‌ నుంచి ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’, ఆ తర్వాత ‘భీమ్లానాయక్‌’ వచ్చి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. ‘స్వాతిముత్యం’ కూడా అదే స్థాయిలో మిమ్మల్ని అలరించనుంది. టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’’ - సిద్ధు జొన్నలగడ్డ

కుటుంబకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ‘స్వాతిముత్యం’ చిత్రంతో బెల్లంకొండ గణేశ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. లక్ష్మణ్‌ దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఇది విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని