Connect Review: రివ్యూ: కనెక్ట్
నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కనెక్ట్’ ఎలా ఉందంటే..?
Connect Review.. చిత్రం: కనెక్ట్; నటీనటులు: నయనతార, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫిసా, తదితరులు; సంగీతం: పృథ్వీ చంద్రశేఖర్; సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్; కథ: అశ్విన్ శరవణన్, కావ్యా రామ్ కుమార్; కూర్పు: రిచర్డ్ కెవిన్; ఛాయాగ్రహణం: మణికంఠన్ కృష్ణమాచారి; నిర్మాత: విఘ్నేష్ శివన్; తెలుగులో విడుదల: యూవీ క్రియేషన్స్; దర్శకత్వం: అశ్విన్ శరవణన్; విడుదల తేదీ: 22-12-2022
ఒకప్పుడు దక్షిణాదిన హారర్ సినిమాల ట్రెండ్ నడిచింది. ఏ భాషలో చూసినా భయపెట్టే సినిమాలదే హవా. ఆ సమయంలో నయనతార కూడా ఆ నేపథ్యంలో కథల్ని ఎంపిక చేసుకుని విజయాన్ని అందుకున్నవారే. క్రమంగా వాటి జోరు తగ్గింది. అయితే అప్పుడప్పుడు మాత్రం ఎవరో ఒకరు హారర్, థ్రిల్లర్ కథలతో ప్రేక్షకుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఆ జోనర్‌ని ఇష్టపడే ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. ఇటీవల ‘మసూద’ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన మరో హారర్ చిత్రం ‘కనెక్ట్’. నయనతార నటించడం, ఆమె భర్త విఘ్నేష్‌శివన్ నిర్మించడం, ఇదివరకు పలు హారర్ చిత్రాలు తీసిన అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకి మంచి ప్రచారం లభించింది. మరి అందుకు తగ్గట్టుగా సినిమా భయపెట్టిందా? లేదా? తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్), సుసాన్ (నయనతార) భార్యాభర్తలు. ఆ ఇద్దరి ముద్దుల కూతురు అమ్ము (హనియా నసీఫా). చిన్నప్పట్నుంచి సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. ఆ ప్రతిభతో లండన్ హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్‌లో సీటు సాధిస్తుంది. ఆ ఆనందంలో ఉండగానే వృత్తిరీత్యా వైద్యుడైన జోసెఫ్.. కొవిడ్ బాధితులకి చికిత్స అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి మరణంతో కుంగిపోతుంది అమ్ము. మరణించిన తండ్రితో మాట్లాడాలని ఆన్‌లైన్‌లో వుయిజా బోర్డ్‌ని ఆశ్రయిస్తుంది. అది వికటించి ఆమెను దుష్టశక్తి ఆవహిస్తుంది. మరి తన కుమార్తె శరీరంలో ఓ ఆత్మ ఉందనే విషయం సుసాన్‌కి ఎప్పుడు తెలిసింది? తెలిశాక ఆ దుష్టశక్తి నుంచి అమ్ముని కాపాడేందుకు తన తండ్రి ఆర్ధర్ (సత్యరాజ్)తో కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అమ్మును కాపాడటం కోసం భూత వైద్యుడైన ఫాదర్ అగస్టీన్ (అనుపమ్ ఖేర్) ఏం చేశారు? అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే: ఆత్మ, భూతవైద్యం.. ఈ నేపథ్యంలో హారర్ కథలు మనకు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా తెరపై చూస్తున్నవే. ఇందులో కొత్తదనం ఏదైనా ఉందంటే అది కొవిడ్ నేపథ్యమే. దర్శకుడు పాత కథకి కొవిడ్ నేపథ్యం, ఆధునిక సాంకేతికతని మేళవించి కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అది అక్కడక్కడా ఫలితాన్నిచ్చినా మొత్తంగా అనుభవం మాత్రం అంతంతమాత్రమే. ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నా.. ఆ తర్వాత పాత కథే అనే విషయం అర్థమవుతున్నకొద్దీ సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. కరోనా లాక్‌డౌన్ కాలాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాకి కీలకం. ఒకరినొకరు కలిసే వీలు లేకపోవడం, అందరూ సెల్‌ఫోన్లలో పలకరించుకోవడానికే పరిమితమైన పరిస్థితుల్ని ఈ కథకి బాగా కనెక్ట్ చేశాడు దర్శకుడు. సినిమా అంతా వీడియోకాల్‌లో సాగుతున్నట్టే ఉంటుంది. కథ సాగే పరిధి నాలుగు గోడలకే పరిమితమైనా అందులో నుంచే భయం పుట్టించేందుకు ప్రయత్నించారు. అది అక్కడక్కడా సఫలమైంది కూడా. భావోద్వేగాలతో ఎక్కువగా ముడిపడిన ఈ కథ అర్ధంతరంగా ముగిసినట్టు అనిపించడం.. ఇందులో అమ్ముని ఆవహించిన ఆత్మకి బ్యాక్ స్టోరీ అంటూ లేకపోవడం వంటివి ప్రేక్షకుడికి పరిపూర్ణమైన అనుభూతిని ఇవ్వవు. ఒకట్రెండు భయపెట్టే సన్నివేశాలు మినహా కథలో కొత్తదనం లేదు.
ఎవరెలా చేశారంటే: నటీనటులు ఈ సినిమాకి బలం. నయనతార ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిగా కనిపించి మెప్పించింది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు కానీ, నటించేందుకు పెద్దగా ఆస్కారం దక్కలేదు. అమ్ముగా నటించిన హనియా నఫీసా నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వినయ్ రాయ్ తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా తండ్రిగా భావోద్వేగాలతో కట్టిపడేశాడు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ తదితర నటులు అత్యుత్తమ నటన ప్రదర్శించారు. సినిమాకి సాంకేతిక అంశాలు ప్రధానబలం. ముఖ్యంగా సౌండ్ డిజైన్, కెమెరా పనితనం ప్రాణం పోశాయి. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఎంచుకున్న నేపథ్యం, ఆయన చిత్రాన్ని సహజంగా నడిపిన విధానం మెప్పించినప్పటికీ.. కథ, కథనాల్లోనే బలం లేదు. తను నమ్మిన కథ కోసం తన బృందాన్ని మాత్రం బాగా నడిపించారు.
బలాలు
1.కొవిడ్ నేపథ్యం 2. భయపెట్టే సన్నివేశాలు 3. నటీనటులు.. సాంకేతికత
బలహీనతలు
1.కొత్తదనం లేని కథ, 2.ప్రాధాన్యం లేని నయనతార పాత్ర
చివరిగా: పాత కథకి కొత్త హంగులతో ‘కనెక్ట్’
గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
కోటి మంది మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ.. సాధినేని యామిని శర్మ
-
India News
India Summons UK Official: లండన్‌లో ఖలిస్థాన్ అనుకూలవాదుల దుశ్చర్య.. బ్రిటన్ దౌత్యవేత్తకు సమన్లు
-
India News
ఒక్క రోజే 1,071 కొవిడ్ కేసులు.. దేశంలో మళ్లీ పెరుగుదల
-
World News
28 ఏళ్లకే 9 మందికి జన్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
-
Ts-top-news News
వరి పొలంలో భారీ మొసలి
-
Movies News
రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి