Niharika: ఆ వార్తలు నా వరకూ రాలేదు: నిహారిక

‘సైరా’ తర్వాత సుమారు నాలుగేళ్లపాటు కెమెరాకు దూరంగా ఉన్నారు నటి నిహారిక కొణిదెల (Niharika). తాజాగా ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ (Dead Pixels). ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో ఆమె ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

Updated : 13 May 2023 15:27 IST

హైదరాబాద్‌: దాదాపు నాలుగేళ్ల తర్వాత నటిగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నిహారిక (Niharika). గాయత్రి అనే గేమర్‌ పాత్రలో ఆమె నటించిన కొత్త వెబ్‌ సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ (Dead Pixels). ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో తన కెరీర్‌, ఆన్‌లైన్‌ నెగెటివిటీ, పలు రూమర్స్‌ గురించి స్పందించారు.

‘‘నటన.. ఇదొక ఛాలెంజింగ్‌ కెరీర్‌. ఆసక్తితోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. వెండితెర, ఓటీటీ.. మాధ్యమం ఏదైనా సరే వందశాతం కష్టపడే వర్క్‌ చేస్తున్నాను. భవిష్యత్తులో సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ లేకపోతే చేయనని ఇప్పటివరకూ నేనెవరికీ చెప్పలేదు. వాళ్లకు వాళ్లే ఊహించుకుని నా వరకూ కొన్ని ప్రాజెక్ట్‌లు తీసుకురాలేదు. ఆయా ప్రాజెక్ట్‌లు విడుదలయ్యాక నన్ను కలిసి.. ‘‘మీరు చేయరనుకున్నాం. అందుకే ఆ రోల్‌ మీకు చెప్పలేకపోయాం’’ అని చెప్పారు. అలాంటి సందర్భాల్లో కాస్త బాధపడ్డాను’’

‘‘డెడ్‌ పిక్సెల్స్‌’ అంగీకరించడానికి కారణం గాయత్రి పాత్ర. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే పాత్ర ఇది. ఈ పాత్ర పోషించడానికి కష్టపడ్డాను. ఎందుకంటే, సాధారణంగా నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. కోపంలో నా హావభావాలు క్యూట్‌గా ఉంటాయి. కానీ, గాయత్రి కొంచెం సీరియస్‌గా ఉంటుంది. కోపం వస్తే ఆమె హావభావాలు వేరేలా ఉంటాయి. దానివల్ల షూట్‌లో కొంచెం ఇబ్బందిపడ్డా. లాక్‌డౌన్‌లో పబ్‌జీ గేమ్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాను. ఎంతలా అంటే నన్నెవరో చంపేస్తున్నట్లు కలలు కూడా వచ్చేవి. అందుకే రెండుసార్లు ఫోన్‌ నుంచి దాన్ని తొలగించేశాను’’

‘‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్‌ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు. అందుకే రాను రాను ఆన్‌లైన్‌లో వచ్చే కామెంట్స్‌ను పట్టించుకోవడం మానేశా. ముఖ్యంగా యూట్యూబ్‌లో వచ్చే కామెంట్స్‌ను చూడను. ‘సైరా’ సమయంలో నాపై వచ్చిన మీమ్స్‌ చూసి బాగా నవ్వుకున్నాను. ‘పుష్ప’లో నేను నటిస్తున్నాననే వార్తల్లో నిజం లేదు’’ అని ఆమె వివరించారు. అనంతరం తన సోదరుడు రామ్‌చరణ్‌ ఐపీఎల్‌లో ఒక టీమ్‌ను కొనుగోలు చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘అవునా.. ఏ టీమ్‌ కొంటున్నారు? హైదరాబాద్‌ టీమ్‌ కొంటున్నారా? ఏమో మరి నా వరకూ ఈ వార్త రాలేదు. ఈ ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడుగుతా’’ అని బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని