Nithiin: ఓటీటీలోకి ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

నితిన్‌ హీరోగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. 

Published : 13 Jan 2024 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. టీజర్, ట్రైలర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ యాక్షన్‌ కామెడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. ‘ఈ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో ఉన్న భిన్నమైన కోణాలను చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అని సంస్థ పేర్కొంది. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా.. రాజశేఖర్‌ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.

కథేంటంటే: అభి అలియాస్‌ అభయ్‌ (నితిన్‌)కు చిన్నప్పటి నుంచి మరో వ్యక్తిలా ఉండటమంటే ఇష్టం. ఆ వ్యక్తిత్వమే అతన్ని జూనియర్‌ ఆర్టిస్ట్‌గా మారుస్తుంది. కానీ, తనకెంత ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కవు. షూటింగ్స్‌లో దర్శకులెప్పుడూ అతన్ని కెమెరా లెన్స్‌కు దొరకనంత వెనక నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అలా సాదాసీదాగా సాగిపోతున్న అతని జీవితంలోకి లిఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది. ఆమె ఓ పెద్ద కంపెనీకి సీఈఓ. ఆమెతో అభి ప్రేమలో పడ్డాక.. అతని జీవితం మారిపోతుంది. లిఖిత వాళ్ల కంపెనీలో సీఈవో స్థాయికి చేరుకుంటాడు అభి. అదే సమయంలో అతనికి హీరోగా చేసే అవకాశమొస్తుంది. అలాగే ఓ చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. తను విన్న కథలో ఉన్న ప్రతినాయకుడు నీరోతో నిజంగా తలపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం తను దొంగ పోలీస్‌గా కొటియా గ్రామంలోకి అడుగుపెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? కొటియా గ్రామాన్ని.. అక్కడి ప్రజల్ని నీరో బారి నుంచి రక్షించేందుకు అభి ఎలాంటి సాహసాలు చేశాడు? అతను నిజమైన పోలీస్‌ కాదని తెలుసుకున్న ఐజీ విజయ్‌ చక్రవర్తి (రాజశేఖర్‌) ఏం చేశాడు? ఒక జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు? అన్నది ఆసక్తికరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని