Payal Rajput: దీని కోసమే మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. పాయల్ భావోద్వేగం

‘మంగళవారం’ (Mangalavaaram) సక్సెస్‌మీట్‌లో భావోద్వేగానికి గురయ్యారు నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput). తమ చిత్రానికి వస్తోన్న స్పందన పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Published : 18 Nov 2023 15:02 IST

హైదరాబాద్‌: నటి పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). అజయ్ భూపతి దర్శకుడు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ తర్వాత పాయల్‌ - అజయ్‌ భూపతి కాంబోలో వచ్చిన చిత్రమిది. శుక్రవారం విడుదలైన ఈసినిమా అంతటా పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న పాయల్‌ భావోద్వేగానికి గురయ్యారు. తమ చిత్రానికి వస్తోన్న స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

‘‘ఈరోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ‘మంగళవారం’ సినిమాపై మీరు చూపిస్తోన్న ఆదరణకు నేను ఆనందిస్తున్నా. సంతోషాన్ని తెలియజేయడానికి మాటలు రావడం లేదు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నన్ను మరోసారి లాంచ్‌ చేసిన అజయ్‌కు ధన్యవాదాలు. నా శ్రమ తగిన ఫలితం దక్కింది. గత మూడు, నాలుగేళ్లగా ఇలాంటి ఆదరణ కోసమే నేను ఎదురుచూస్తున్నా. ఈ సినిమాతో మళ్లీ నాకు అంతటా మంచి రెస్పాన్స్‌ వచ్చింది’’ అంటూ పాయల్ ఉద్వేగానికి గురయ్యారు.

రివ్యూ : మంగళవారం.. పాయల్‌ రాజ్‌పుత్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

కథేంటంటే: మ‌హాల‌క్ష్మీపురంలో మంగళవారం రోజున అనుకోని విధంగా ఓ జంట మృతిచెందుతుంది. వీరు అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఊరి గోడల‌పై రాసిన రాత‌ల వ‌ల్లే వాళ్లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డి ఉంటార‌ని గ్రామ‌స్తులంతా న‌మ్ముతారు. కానీ, ఆ ఊరికి కొత్త‌గా వ‌చ్చిన ఎస్సై మాయ (నందిత శ్వేత‌) మాత్రం అవి ఆత్మ‌హ‌త్య‌లు కావు హ‌త్య‌ల‌ని బ‌లంగా న‌మ్ముతుంది. అది నిరూపించేందుకు ఆ శ‌వాల‌కు పోస్ట్‌మార్టం చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఊరి జ‌మిందారు ప్ర‌కాశం బాబు (చైత‌న్య కృష్ణ‌) అడ్డు చెబుతాడు. అత‌ని మాట‌కు ఊరు కూడా వంత పాడ‌టంతో  త‌న ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంటుంది. ఈ క్రమంలో మరో జంట ఇలాగే చనిపోతుంది. ఎస్సై ఊరి వాళ్ల‌ను ఎదిరించి మ‌రీ పోస్టుమార్టం చేయిస్తుంది. మ‌రోవైపు ఊరి వాళ్లు గోడ‌ల‌పై రాత‌లు రాస్తున్న అజ్ఞాత వ్య‌క్తి ఎవ‌రో క‌నిపెట్టేందుకు రంగంలోకి దిగుతారు. మ‌రి ఊర్లో జ‌రిగిన‌వి ఆత్మ‌హ‌త్య‌లా? హ‌త్య‌లా? ఈ చావుల వెన‌కున్న ల‌క్ష్యం ఏంటి?వీటికి ఆ ఊరి నుంచి వెలికి గురైన శైల‌జ అలియాస్ శైలు (పాయ‌ల్ రాజ్‌పుత్‌)కు ఉన్న సంబంధం ఏంటి? అస‌లు ఆమె క‌థేంటి? ఊర్లో జ‌రిగే చావులకు  ఫొటోగ్రాఫ‌ర్ వాసు (శ్ర‌వ‌ణ్ రెడ్డి), డాక్ట‌ర్ (ర‌వీంద్ర విజ‌య్), జ‌మిందారుకు.. అత‌ని భార్య (దివ్యా పిళ్లై)కు ఏమైనా సంబంధం ఉందా? శైలు చిన్న‌నాటి ప్రియుడు ర‌వి క‌థేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని