Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’.. తెరంగేట్రం చేస్తోన్న మోడల్‌

‘కన్నప్ప’ (Kannappa)కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ను నిర్మాణ సంస్థ పంచుకుంది. ఈ చిత్రంతో ప్రీతి ముకుందన్‌ అనే మోడల్‌ తెరంగేట్రం చేయనుంది.

Published : 13 Dec 2023 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రానున్న ఈ ఫాంటసీ డ్రామాతో ఓ మోడల్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటి వరకు మోడల్‌గా పలు ప్రకటనల్లో కనిపించిన ప్రీతి ముకుందన్‌ (preity mukhundhan) ‘కన్నప్ప’తో తెరంగేట్రం చేయనుంది.

మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా నుపుర్‌ సనన్‌ (Nupur Sanon)ని ఎంపిక చేశారు. అయితే డేట్స్‌ సర్దుబాటు చేయడంలో సమస్యలు తలెత్తడంతో ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగింది. తాజాగా ఈ సినిమాలో ప్రీతి ముకుందన్‌ను తీసుకుంటున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘‘కన్నప్ప’తో ప్రీతి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఎంతో ప్రతిభ కలిగిన ఈ భరతనాట్య నర్తకి సినిమాకు మరింత ప్రత్యేకం కానుంది’ అని మూవీ యూనిట్‌ పేర్కొంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఇందులో మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్‌ (Shiva Rajkumar)లు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మోహన్‌ బాబు, శరత్‌ కుమార్‌లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.

‘రానా నాయుడు’ రికార్డు.. భారత్‌ నుంచి ఇదొక్కటే..

ఇక ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం న్యూజిలాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాను మోహన్‌ బాబు (Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని