Manickam Narayanan: అజిత్‌ జెంటిల్‌మ్యాన్‌ కాదు.. నన్ను మోసం చేశాడు: నిర్మాత వ్యాఖ్యలు

ప్రముఖ నటుడు అజిత్‌ తనని మోసం చేశాడని నిర్మాత మాణికం నారాయణన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.

Updated : 11 Jul 2023 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు అజిత్‌ (Ajith) జెంటిల్‌మ్యాన్‌ కాదని, తనని మోసం చేశాడని నిర్మాత మాణికం నారాయణన్‌ (Manickam Narayanan) ఆరోపించారు. తన దగ్గర తీసుకున్న డబ్బులు సంవత్సరాలు గడిచినా ఇవ్వలేదని మండిపడ్డారు. చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ తమిళ చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారాయి. మాణికం నారాయణన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తన తల్లిదండ్రుల్ని విహార యాత్రకు మలేషియా పంపేందుకు అజిత్‌ నా దగ్గర కొన్నాళ్ల క్రితం డబ్బులు తీసుకున్నాడు. అదే సమయంలో నాతో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. నేనిచ్చిన మొత్తాన్ని పారితోషికంగా సర్దుబాటు చేసుకోవాలని అనుకున్నాం. కానీ, ఇప్పటి వరకు ఆయన నాకు డబ్బు తిరిగి ఇవ్వలేదు. నాతో సినిమా కూడా చేయలేదు. ఇన్నేళ్లలో ఆయన అసలు ఈ విషయంపై ఎన్నడూ మాట్లాడలేదు. తనని తాను జెంటిల్‌మ్యాన్‌ అనుకుంటాడు కానీ కాదు.’’

‘‘అతడిది మంచి కుటుంబం. తాను నటించే ప్రతి సినిమాకీ రూ. 50 కోట్లకుపైగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటాడు. మరి ఇతరుల్ని మోసం చేయాల్సిన అవసరం ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. కోలీవుడ్‌లో ‘కూలీ’, ‘మాన్‌బూమిగు మానవన్‌’, ‘శీను’, ‘వెట్టైయాడు విలైయాడు’ తదితర చిత్రాలను నిర్మించిన మాణికం నారాయణన్‌ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కుతోన్న ‘జవాన్‌’ (Jawan).. తమిళ సినిమా ‘పెరారసు’ కాపీ అని కొన్ని నెలల క్రితం ఆరోపించారు. ఈ మేరకు తమిళ్ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (TFPC)లో ఫిర్యాదు చేశారు.

అజిత్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ‘తెగింపు’ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు. తదుపరి తిరుమేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సినిమా పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో రూపొందనుంది. ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష కథానాయికగా నటించే అవకాశాలున్నాయని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని