Leo: ‘లియో’ తెలుగు వెర్షన్‌.. విడుదల తేదీలో మార్పు ఉండదు: నాగవంశీ

విజయ్‌ నటించిన ‘లియో’ తెలుగులోనూ ఈ నెల 19నే విడుదల అవుతుందని నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌పై కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.

Updated : 17 Oct 2023 17:20 IST

హైదరాబాద్‌: తమిళ నటుడు విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ( Lokesh Kanagaraj) తెరకెక్కించిన తాజా చిత్రం ‘లియో’ (Leo). త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబరు 19న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, తెలుగు వెర్షన్‌ విడుదలపై  సందిగ్ధత నెలకొంది. టైటిల్‌ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్‌ వేయగా వాదనల అనంతరం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు విడుదలపై స్టే విధించింది. తెలుగులో ఈ సినిమాని అక్టోబరు 20 వరకు విడుదల చేయకూడదని ఆదేశించింది. దీనిపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పందించారు. తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఆయన ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చారు.

విడుదలకు ముందే ‘జైలర్‌’ రికార్డు బ్రేక్‌ చేసిన ‘లియో’.. ‘ఆర్‌ఆర్‌ఆర్’తోనూ పోటీ..

నాగవంశీ మాట్లాడుతూ..‘‘లియో’ సినిమా టైటిల్‌ విషయంలో కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చింది. అదే పేరుతో తెలుగులో వేరేవరో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారట. వారు మాకు సమాచారం ఇవ్వకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారు. మేం ఇరువురు చర్చించుకుని ఈ సినిమాని 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. విడుదల తేదీలో మార్పు ఉండదు. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆయనకు, మాకూ నష్టం జరగకుండా చూసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్లు థియేటర్ల సమస్య ఏం లేదు. ‘లియో’, బాలకృష్ణ ‘భగవంత్‌ కేసరి’, రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’.. ఇలా ఏ చిత్రానికి ఎన్ని థియేటర్లుకావాలో అన్ని ఉన్నాయి’’ అని అన్నారు.

దసరా పండగకు ముందే త్రిష, లోకేశ్‌ కనగరాజ్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ హైదరాబాద్‌లో ప్రమోషన్స్‌లో పాల్గొంటారని తెలిపారు. ‘గుంటూరు కారం’ (మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం)లోని తొలి గీతం విడుదల తేదీని దసరాకు ప్రకటిస్తామన్నారు. నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ కలెక్షన్లపై ఇటీవల జరిగిన చర్చపై స్పందిస్తూ.. ‘‘మా వ్యాపారాన్ని మేమెందుకు రోడ్డుపై పెట్టుకుంటాం. వసూళ్ల విషయంలో మీడియాకు అధికారిక సమాచారం ఉండదు. ‘జెర్సీ’ విషయంలో నేను అన్నిరకాలుగా ఆనందంగా ఉన్నా’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని