Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2

రాఘవా లారెన్స్‌ (raghava lawrence), కంగనా రనౌత్‌ (Kangana Ranaut) నటించిన ‘చంద్రముఖి-2’ (Chandramukhi 2) చిత్రం ఎలా ఉందంటే..?

Updated : 28 Sep 2023 18:18 IST

Chandramukhi 2 Review; చిత్రం: చంద్రముఖి -2; నటీనటులు: రాఘవా లారెన్స్‌, కంగనా రనౌత్‌, మహిమా నంబియార్‌, రాధిక, రావు రమేశ్‌, వడివేలు, లక్ష్మీ మేనన్‌, సుబిక్షా, తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; ఎడిటింగ్‌: అంథోనీ; సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌; నిర్మాణ సంస్థ: లైకా ప్రొడెక్షన్స్‌; నిర్మాత: సుభాస్కరన్‌ అలీరాజ్‌; రచన, దర్శకత్వం: పి.వాసు; విడుదల తేదీ: 28-09-2023

Chandramukhi 2 Movie Review | రజనీకాంత్‌ - పి.వాసు కాంబోలో వచ్చిన ‘చంద్రముఖి’ అప్పట్లో తమిళ, తెలుగు భాషల్లో ఘన విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2 Movie Review) రూపొందింది. అయితే ఈసారి ప్రధాన తారాగణం మారింది. రజనీ స్థానంలో రాఘవ లారెన్స్‌ హీరోగా నటించారు. చంద్రముఖి పాత్రను కంగనా రనౌత్‌ పోషించింది. మరి ఈ నయా చంద్రముఖి కథేంటి? ఇది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచిచ్చింది? అనేది తెలుసుకుందాం.

కథేంటంటే: రంగనాయకి (రాధిక శరత్‌ కుమార్‌)ది పెద్ద కుటుంబం. అయితే ఆ కుటుంబాన్ని అనేక సమస్యలు వేధిస్తుంటాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే వేటయ్యపాలెంలో ఉన్న వారి కుల దైవం దుర్గమ్మ గుడిలో పూజ జరిపించాలని స్వామీజీ (రావు రమేష్‌) సలహా ఇస్తారు. దీంతో రంగనాయకి కుటుంబ సమేతంగా వేటయ్యపాలెంకు పయనమవుతుంది. ఆ కుటుంబానికే చెందిన మరో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మదన్‌ (రాఘవ లారెన్స్‌) కూడా ఆ ఊరు వస్తాడు. వారంతా కలిసి అక్కడే గుడికి సమీపంలో ఉన్న చంద్రముఖి ప్యాలెస్‌ (తొలి చంద్రముఖి సినిమా కథ జరిగిన ప్యాలెస్‌)లోకి అద్దెకు దిగుతారు. అయితే ఆ ఇంట్లోకి అడుగు పెట్టి.. దుర్గ గుడిలో పూజలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి రంగనాయకి కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. 17ఏళ్ల క్రితం బయటకి వెళ్లిపోయిన చంద్రముఖి ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మళ్లీ తిరిగొచ్చిన చంద్రముఖి (Chandramukhi 2 Movie Review) 200ఏళ్ల క్రితం చనిపోయిన వేటయ్య రాజు అలియాస్‌ సెంగోటయ్య (లారెన్స్‌) మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంది. వీళ్లిద్దరి కథేంటి? వీరి కథ ఎలా కంచికి చేరింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: చంద్రముఖి (Chandramukhi 2 Movie Review) ఫ్రాంచైజీలో రూపొందిన రెండో చిత్రమిది. ఈ కథకు తొలి చంద్రముఖికి సంబంధం ఉంటుందని.. దీంట్లో ఒరిజినల్‌ చంద్రముఖి కథను చూపిస్తున్నామని దర్శకుడు పి.వాసు ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. నిజానికి ఈ కథకు తొలి భాగానికి ఏ సంబంధం ఉండదు. తొలి ‘చంద్రముఖి’ కథ జరిగిన ఇంట్లోనే ఈ కథ సాగడం.. చంద్రముఖి పాత్ర.. ఈ రెండే దానికి దీనికి మధ్య ఉన్న లింక్‌. వీటి వెనకున్న అసలు కథలో మాత్రం మార్పులు కనిపిస్తాయి. కానీ, అవేమీ ఆసక్తిరేకెత్తించేలా ఉండవు. తొలి ‘చంద్రముఖి’లో లాగే ఓ ఇంట్రడక్షన్‌ ఫైట్, పాటలతో సినిమా చాలా రొటీన్‌గా మొదలవుతుంది. రంగనాయకి కుటుంబం చంద్రముఖి ప్యాలెస్‌లోకి అడుగు పెట్టడం.. అక్కడుండే దక్షిణం గది.. వద్దని వారించినా ఆ గదిలోకి ఆ ఇంటి ఆడపిల్లలు అడుగు పెట్టడం.. అప్పటి నుంచి రకరకాల కొత్త సమస్యలు మొదలవడం.. ఇలా ప్రతి సీన్‌ మొదటి ‘చంద్రముఖి’ చిత్రంలాగే సాగుతుంది. అయితే మొదటి భాగంలో కనిపించిన థ్రిల్, వినోదం ఇక్కడ పండలేదు. దర్శకుడు ఒకే తరహా స్క్రీన్‌ప్లేతో ముందుకెళ్లడం.. కథనంలో పెద్దగా సంఘర్షణ లేకపోవడం ఇందులో ఉన్న ప్రధాన లోపం. ఇక హీరో పాత్రను కూడా దర్శకుడు చాలా సామాన్యుడిలాగే చూపించాడు. తొలి భాగంలో గంగ (జ్యోతిక)ను చంద్రముఖి ఆవహించినట్లు రజనీ కనిపెట్టే తీరు.. దాన్ని బయటపెట్టే విధానం చాలా ఆసక్తిరేకెత్తిస్తుంది. ఇందులో హీరో పాత్ర అలాంటి ప్రయత్నాలేమీ చేయదు. అలాగే, చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహిస్తుంది, దాని వల్ల పీడించబోయే యువతి ఎవరన్నది సినిమా ఆరంభంలోనే అర్థమైపోతుంది. విరామ సన్నివేశాలు మరీ కొత్తగా లేకున్నా ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచేలా చేస్తాయి.

(Chandramukhi 2 Movie Review) ద్వితీయార్ధాన్ని ఆరంభించిన తీరు చప్పగా ఉన్నా.. చంద్రముఖి - వేటయ్య రాజు ఫ్లాష్‌బ్యాక్‌ మొదలయ్యాక కథ వేగం పుంజుకుంటుంది. తొలి భాగంలో చంద్రముఖి ఆత్మ వల్ల కథానాయిక మాత్రమే బాధపడితే.. ఈ రెండో భాగంలో రాజు ఆత్మ వల్ల హీరో కూడా సమస్యల్లో చిక్కుకోవడం కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన గతంలోనూ బలమైన సంఘర్షణ కనిపించదు. చంద్రముఖి పాత్ర వేటయ్యపై పగ పెంచుకోవడానికి వెనకున్న కారణం తొలి చంద్రముఖిలాగే ఉంటుంది. అయితే దీంట్లో కాస్త రిలీఫ్‌ అనిపించిన విషయమేంటంటే ఆ చంద్రముఖి పాత్రలో కొత్తగా కంగనా రనౌత్‌ కనిపించడమే. చంద్రముఖిని అంతమొందించేందుకు వేసే ప్రణాళిక కూడా పాత చింతకాయ పచ్చడిలాగే ఉంటుంది. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్లుగానే ఉన్నా.. కంగనా-లారెన్స్‌ల మధ్య వచ్చే పోరాటం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే: లారెన్స్‌ ఈ చిత్రంలో మదన్, వేటయ్యరాజుగా రెండు కోణాల్లో కనిపిస్తారు. ఆ రెండు పాత్రల్నీ ఆయన చాలా అవలీలగా చేసేశారు. వేటయ్య పాత్రలో ఆయన లుక్‌ కొత్తగా ఉంటుంది. చంద్రముఖి పాత్రలో కంగనా చాలా అందంగా కనిపించింది. అయితే నటనా పరంగా తొలి చంద్రముఖి (జ్యోతిక)ని మరిపించలేకపోయింది. నాయిక మధు నంబియార్‌ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఆమెకు.. లారెన్స్‌కు మధ్య లవ్‌ట్రాక్‌లో బలం లేదు. వడివేలు పాత్ర నవ్వించలేకపోయింది. రాధిక శరత్‌ కుమార్, రావు రమేష్‌ తదితరుల పాత్రలన్నీ పరిధి మేరకే ఉన్నాయి. పి.వాసు ఎంచుకున్న కథలోనూ.. తెరకెక్కించడంలోనూ ఏమాత్రం కొత్తదనం లేదు. (Chandramukhi 2 Movie Review)

  • బలాలు:
  • కంగనా, లారెన్స్‌ నటన
  • చంద్రముఖి, వేటయ్యరాజుల ఫ్లాష్‌బ్యాక్‌
  • పతాక సన్నివేశాలు
  • బలహీనతలు:
  • నెమ్మదిగా సాగే ప్రధమార్ధం
  • కొత్తదనం లేని స్క్రీన్‌ప్లే
  • ఊహలకు తగ్గట్లుగా సాగే కథనం
  • చివరిగా: ఈ చంద్రముఖి భయపెట్టదు.. థ్రిల్‌ పంచదు.. సహనాన్ని పరీక్షిస్తుందంతే! (Chandramukhi 2 Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని