Ram charan: తల్లిదండ్రులు కాబోతున్న రామ్‌చరణ్‌ దంపతులు

రామ్‌చరణ్‌ (Ram Charan) -ఉపాసన (Upasana) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Updated : 12 Dec 2022 15:42 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులకు శుభవార్త. సినీ నటుడు రామ్‌చరణ్‌ (Ram charan) దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని అగ్ర కథానాయకుడు, చరణ్ తండ్రి చిరంజీవి (Chiranjeevi) స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదిక ట్వీట్ చేశారు. ‘హనుమాన్‌ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్‌లు తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో..  మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్‌ కామినేని’’ అని పేర్కొన్నారు.

ఉపాసన- రామ్‌చరణ్‌లకు 2012 జూన్‌ 14న వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, చెన్నైలో ఉండగా, తొమ్మిదో తరగతి వరకూ చరణ్‌, ఉపాసన ఒకే స్కూల్‌లో చదివారు. పెళ్లై పదేళ్లు అవుతున్నా.. చరణ్‌ దంపతులు ఎలాంటి  శుభవార్తా చెప్పకపోవడంతో ‘పిల్లలెప్పుడు’ అంటూ అనేక సందర్భాల్లో ఉపాసనకు ప్రశ్నలు ఎదురయ్యేవి.

ఇదే విషయమై ఇటీవల ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్‌ కార్యక్రమంలో తాను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించారు. ‘‘మా పెళ్లై పదేళ్లయింది. నా వైవాహిక జీవితం చాలా చాలా ఆనందంగా ఉంది. నా జీవితం, నా కుటుంబాన్ని నేనెంతో ప్రేమిస్తున్నా. ఇదిలా ఉంటే కొంతమంది అదే పనిగా నా RRR (రిలేషన్‌షిప్‌, రీప్రొడ్యూస్‌, రోల్‌ ఇన్‌ మై లైఫ్‌) గురించి ప్రశ్నిస్తుంటారు ఎందుకు?. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు ఎందరో మహిళలకు ఎదురవుతోంది’’ అని ఉపాసన అడగ్గా, జగ్గీవాస్‌ దేవ్‌ తనదైన శైలిలో  సమాధానం ఇచ్చారు.

కాగా, ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi) ప్రకటన మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

వివిధ సందర్భాల్లో వివాహబంధం-రామ్‌చరణ్‌ గురించి ఉపాసన చెప్పిన కబుర్లివే!

నేనూ చరణ్‌ పెళ్లి చేసుకుని పదేళ్లు అయ్యింది. వివాహ బంధంలో ఆరోగ్యానికి ముఖ్యస్థానం ఉంది. కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి.

ప్రియమైన వారితో కొద్ది సమయాన్ని గడపటం రొటీన్‌గా మార్చుకోవాలి. ఏ కాస్త ఖాళీ దొరికినా డిన్నర్‌ డేట్‌, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. ఇలా చేయడం వల్ల మీ జీవితం మరింత అందంగా మారుతుంది.

ప్రతిఒక్కరూ పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. కానీ, అది నిజం కాదు. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై అమితమైన ప్రేమ, గౌరవం చూపించాలి’’

‘వివాహబంధంలో విభేదాలు రావడం సహజం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలోపేతమవుతుంది. ఇదే విధంగా మా ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. మనస్పర్థలు వస్తుంటాయి. కానీ వాటిని మేమిద్దరం కలిసి ఎదుర్కొంటాం.

‘బహుమతులకన్నా అపురూప క్షణాలకే మేము ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటాం. ఎంత ఖరీదైన బహుమతులిచ్చామన్నది కాదు.. మన జీవిత భాగస్వామిని ఎంత ఆనందంగా చూసుకున్నామనే విషయానికి మేమిద్దరం ఓటేస్తాం. అలాంటి ఎన్నో మధురక్షణాలను చరణ్‌ నాకు అందించాడు.

వివాహమైన తర్వాత మొదటి వాలంటైన్స్‌డేని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే, సినిమా షూట్‌లో బిజీగా ఉన్నప్పటికీ చరణ్‌ ఎంతో శ్రమించి హృదయాకారంలో ఉన్న చెవి రింగులను తయారు చేయించి ఇచ్చాడు’ అంటూ రామ్‌చరణతో బంధం గురించి ఉపాసన పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు