Rana Naidu: అప్పుడు ‘కలిసుందాం రా’.. ఇప్పుడు ‘విడిపోదాం రా’: వెంకటేశ్‌

ప్రముఖ హీరోలు వెంకటేశ్, రానా కలిసి నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’. మార్చి 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెంకటేశ్‌, రానా తదితరులు పాల్గొన్నారు.

Published : 07 Mar 2023 20:36 IST

హైదరాబాద్‌: తాను నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ని ప్రముఖ హీరో వెంకటేశ్‌ (Venkatesh Daggubati) ‘విడిపోదాం రా’ కాన్సెప్ట్‌గా అభివర్ణించారు. గతంలో తాను నటించిన కుటుంబ కథాచిత్రం ‘కలిసుందాం.. రా!’ని గుర్తుచేసుకుంటూ అలా వ్యాఖ్యానించారు. రానా (Rana Daggubati)తో కలిసి ఆయన నటించిన ‘రానా నాయుడు’ (Rana Naidu) ఈ నెల 10న ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో విడుదలకానుంది. ఈ సందర్భంగా సిరీస్‌ టీమ్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. వెంకటేశ్‌, రానా తదితరులు పలు విశేషాలు పంచుకున్నారు.

వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇప్పటి వరకూ మమ్మల్ని ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘రానా నాయుడు’ నాకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. దీని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. రానాతో కలిసి తెరను పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. రానా మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ప్రాజెక్ట్ నాకు, బాబాయ్‌కి కొత్త. ఆయనతో కలిసి నటించిన తొలి సన్నివేశం నాకు ఇంకా గుర్తుంది. అది మర్చిపోలేని అనుభూతి. ఈ సిరీస్‌లోని నా పాత్రలో మంచీ చెడూ రెండు షేడ్స్‌ ఉంటాయి’’ అని తెలిపారు. అనంతరం క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌లో పాల్గొన్నారు.

* తొలిసారి వెబ్‌సిరీస్‌లో నటించడం ఎలా అనిపిస్తోంది?

వెంకటేశ్‌: చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో నేనిప్పటి వరకూ పోషించని పాత్రను ఈ సిరీస్‌లో పోషించా. రానాతో కలిసి నటించాలనే నా కల ‘రానా నాయుడు’తో నెరవేరింది. కొన్ని సినిమాల్లోని పాత్రలు, వాటిలో నటించిన వారిని చూసి ‘ఇలాంటి క్యారెక్టర్‌ మనకెప్పుడు వస్తుంది’ అని అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ అవకాశాన్ని ఈ సిరీస్‌ ఇచ్చింది. ఇందులో రెగ్యులర్‌ రోల్స్‌కు భిన్నంగా సవాలు విసిరే పాత్రలో నటించా.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?

రానా: వెబ్‌సిరీస్‌ల్లో ఇప్పటి వరకూ రాని కంటెంట్‌ను ప్రేక్షకులను అందించాలనే ‘రానా నాయుడు’ను ఎంపిక చేసుకున్నా. ముంబయిలో ఉండే రాజకీయవేత్తలు, పెద్ద వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులకు సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వ్యక్తిగా నేను నటించా. ఎవరికీ అవసరం ఉన్నా నాకే కాల్‌ చేస్తారు.

* సిరీస్‌లోని మీ ఫ్యామిలీ గురించి చెబుతారా?

రానా: ఈ సిరీస్‌లో కనిపించే ఫ్యామిలీని బయట చూడడం కష్టం. భర్తకు భార్యతో, తండ్రికి కొడుకుతో.. ఇలా కుటుంబమంతా విభేదాలే. ఇలాంటి ఎమోషన్స్‌ ఉన్న కాన్సెప్ట్‌తో సినిమా చేయడం కష్టం.

వెంకటేశ్‌: అప్పుడు నేను చేసింది ‘కలిసుందాం.. రా!’. ఇప్పుడు ఇది ‘విడిపోదాం..రా!’ (నవ్వులు).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని