Kantara: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ - 2’ను బీట్‌ చేసిన ‘కాంతార’

‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ - 2’ చిత్రాలను ‘కాంతార’ బీట్‌ చేసింది. ఐఎండీబీ రేటింగ్‌లో ఈ సినిమా అత్యధిక రేటింగ్‌ సొంతం చేసుకుంది.

Published : 16 Oct 2022 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి (Rishab Shetty) నటించిన ‘కాంతార’ (Kantara) సరికొత్త రికార్డు సృష్టించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీయఫ్‌ - 2’ రికార్డులను ఇది బ్రేక్‌ చేసింది. ఐఎండీబీలో 8.4 రేటింగ్‌తో ‘కేజీయఫ్‌ -2’, 8 రేటింగ్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉండగా.. ఇప్పుడు ‘కాంతార’ 9.5 రేటింగ్‌తో అదరగొట్టింది. దీంతో అత్యధిక రేటింగ్‌ పొందిన భారతీయ చిత్రంగా  పేరు సొంతం చేసుకుంది. ‘కాంతార’కు అసాధారణమైన రేటింగ్‌ రావడంపై కన్నడ సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంస్కృతి, సంప్రదాయాల  నేపథ్యంలో రూపుదిద్దుకున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కాంతార’. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో, హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరాంగదుర్‌ దీన్ని నిర్మించారు. సెప్టెంబర్‌ 30న ఒక సాధారణ చిత్రంగా విడుదలైన ఈ సినిమా కన్నడలో రికార్డులు సృష్టించింది. దీంతో ఈ చిత్రాన్ని వివిధ భాషల్లో ప్రేక్షకులకు చేరువచేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే హిందీ ప్రేక్షకులను అలరిస్తోన్న ఈసినిమా శుక్రవారం తెలుగులోనూ విడుదలైంది.

ప్రభాస్‌ ప్రశంసల వర్షం..!

ప్రముఖులు సైతం ‘కాంతార’పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని, రిషబ్‌ నటన తనకెంతో నచ్చిందని ఇప్పటికే ధనుష్‌ మెచ్చుకోగా.. ఇప్పుడా జాబితాలోకి ప్రభాస్‌ చేరారు. ‘‘కాంతార’ని రెండోసారి వీక్షించాను. అత్యద్భుతమైన అనుభూతిని అందించింది. గొప్ప అంశాన్ని.. థ్రిల్లింగ్‌ క్లైమాక్స్‌తో కట్టిపడేశారు. థియేటర్లలో ప్రతిఒక్కరూ తప్పకుండా వీక్షించాల్సిన చిత్రమిది’’ అని ప్రభాస్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని