Martin Luther King: రివ్యూ: మార్టిన్‌ లూథర్‌ కింగ్‌.. సంపూర్ణేశ్‌ బాబు కొత్త సినిమా ఎలా ఉందంటే?

తమిళంలో విజయవంతమైన ‘మండేలా’ సినిమాకు తెలుగు రీమేక్‌గా రూపొందిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంపూర్ణేశ్‌ బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 27 Oct 2023 09:19 IST

Martin Luther King Movie Review; చిత్రం: మార్టిన్‌ లూథర్‌ కింగ్‌; నటీనటులు: సంపూర్ణేష్‌ బాబు, నరేశ్, వెంకటేశ్‌ మహా, శరణ్య ప్రదీప్‌ తదితరులు; కథ: మడోన్‌ అశ్విన్‌; స్క్రీన్‌ప్లే, సంభాషణలు: వెంకటేశ్‌ మహా; సంగీతం: స్మరణ్‌ సాయి; ఛాయాగ్రహణం: దీపక్‌ యరగెరా; దర్శకత్వం: పూజ కొల్లూరు; నిర్మాతలు: ఎస్‌. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర; విడుదల తేదీ: 27-10-2023.

దసరా సందర్భంగా గత వారమంతా థియేటర్లలో పెద్ద చిత్రాలు జోరు చూపించాయి. ఈ వారం చిన్న చిత్రాల వంతు వచ్చింది. బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన వాటిలో కాస్త అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’. తమిళంలో విజయవంతమైన ‘మండేలా’కు రీమేక్‌గా రూపొందిన సినిమా ఇది. మాతృకలో యోగిబాబు పోషించిన పాత్రను ఇక్కడ సంపూర్ణేశ్‌ బాబు చేశారు. ఈ అంశాలే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించింది? మార్టిన్‌ లూథర్‌ కింగ్‌గా సంపూర్ణేశ్‌ ఎలా అలరించారు?(Martin Luther King movie Review)

కథేంటంటే: స్మైల్‌ (సంపూర్ణేశ్‌ బాబు) ఓ అనాథ. పడమరపాడు గ్రామంలో చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తుంటాడు. ఆ ఊరిలో ఉన్న మర్రి చెట్టే తన ఆవాసం. ఊరి వాళ్లంతా తనని ఎడ్డోడు.. వెర్రిబాగులోడు.. అంటూ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇంట్లో ఎవరైనా పాచి పనులు చేయాలంటే తననే పిలుస్తుంటారు. వాళ్లిచ్చే చిల్లర డబ్బులతోనే పూట గడిపేస్తుంటాడు. ఎప్పటికైనా ఓ చిన్న చెప్పుల షాప్‌ పెట్టుకోవాలన్నది స్మైల్‌ కల. దాని కోసం రూపాయి రూపాయి పోగు చేసి కొంత డబ్బు దాచుకుంటాడు. అయితే ఓరోజు ఆ డబ్బుల్ని ఎవరో దోచుకుంటారు. దీంతో తన స్నేహితుడు బాటా సలహా మేరకు పోస్టాఫీసులో డబ్బు దాచుకోవాలని నిర్ణయించుకుంటాడు. దీనికోసం పోస్టాఫీస్‌లో పని చేసే వసంత (శరణ్య ప్రదీప్‌)ను సాయం కోరతాడు. అయితే పోస్టాఫీస్‌లో ఖాతా తెరవాలంటే స్మైల్‌కు ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు.. ఇలా ఏ గుర్తింపు కార్డు ఉండదు. స్మైల్‌ అసలు పేరేంటో కూడా తెలియదు. దీంతో వసంతే అతనికి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అనే కొత్త పేరు పెట్టి.. పోస్టాఫీస్‌లో అకౌంట్‌ తెరుస్తుంది. అలాగే తన పేరిట ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు.. ఇలా అన్నింటికీ అప్లై చేస్తుంది. మరోవైపు పడమరపాడులో సర్పంచ్‌ ఎన్నికల హడావుడి మొదలవుతుంది. దక్షిణం దిక్కుకు పెద్దగా వ్యవహరించే లోకి (వెంకటేశ్‌ మహా), ఉత్తరం దిక్కుకు నాయకుడిగా వ్యవహరించే జగ్గు (నరేశ్‌) సర్పంచ్‌ పదవి కోసం పోటీ పడతారు. వారి ప్రచారంలో భాగంగా చేసిన సర్వేలో ఇద్దరికీ సమాన ఓట్లు పడనున్నట్లు ముందే అర్థమవుతుంది. వీరిలో ఎవరికి మరొక్క ఓటు పడినా సర్పంచ్‌ పదవితో పాటు రూ.30కోట్ల ప్రాజెక్ట్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ఒక్క ఓటు కోసం జగ్గు, లోకి వేట మొదలు పెడతారు. అదే సమయంలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌కు ఓటు హక్కు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో లోకి, జగ్గు అతణ్ని తమవైపు తిప్పుకొనేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మరి మార్టిన్‌కు ఓటు హక్కు రావడంతో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? (Martin Luther King movie Review) జగ్గు, లోకిల వల్ల తనెలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? తన ఓటుతో ఊరిని ఎలా మార్చాడు? అన్నది మిగతా కథ .

ఎలా సాగిందంటే: ఇది ప్రధానంగా ఓటు విలువని తెలియజెప్పే చిత్రం. అంతర్లీనంగా సమాజంలో అసమానతల్ని ఎత్తి చూపుతూ ఆలోచింపజేస్తుంది. అలాగే వర్తమాన రాజకీయాలపై ఓ విమర్శనాస్త్రంగా ఉంటుంది. ఇది రీమేక్‌ చిత్రమైనా తెరపై చూస్తున్నప్పుడు ఆ అనుభూతి ఎక్కడా కలగదు. మాతృకలోని ఆత్మను దెబ్బ తీయకుండా వెంకటేశ్‌ మహా తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా కథను చక్కగా మార్పులు చేశారు. దాన్ని దర్శకురాలు పూజ కూడా అంతే నిజాయతీగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి సందేశాత్మక చిత్రాల్ని కాసిన్ని కమర్షియల్‌ హంగులు జోడించి తెరపై చూపించగలిగినప్పుడే ఆశించిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయంలో మార్టిన్‌ వెనకబడినట్లు అనిపిస్తుంది. పడమరపాడు గ్రామం.. అక్కడి ప్రజల వ్యక్తిత్వాల్ని పరిచయం చేస్తూ వచ్చే ఆరంభ సన్నివేశాలు బాగున్నాయి. ఈ క్రమంలో వచ్చే మరుగుదొడ్డి ఓపెనింగ్‌ ఎపిసోడ్‌.. అక్కడ ఉత్తరం దిక్కు, దక్షిణం దిక్కు వర్గాలు తలపడే తీరు నవ్వులు పూయిస్తాయి. ఆ వెంటనే స్మైల్‌ ప్రపంచాన్ని.. ఊరి ప్రజలు అతనితో వ్యవహరించే విధానాన్ని చూపిస్తూ నెమ్మదిగా అసలు కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. స్మైల్‌ డబ్బుల్ని ఎవరో దొంగలించడం.. దీంతో తను డబ్బులు దాచుకునేందుకు పోస్టాఫీస్‌లోకి అడుగు పెట్టడం.. అక్కడ వసంతతో పరిచయమవడం.. ఆమె అతనికి మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ అని పేరు పెట్టడం.. ఇలా కథ క్రమంగా ఓ చిన్న మలుపు తిరుగుతుంది. పడమరపాడులో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఊర్లోని ఓటర్లను ఆకర్షించేందుకు లోకి, జగ్గు డబ్బులతో ప్రలోభ పెట్టే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ విషయాల్లో నాయకులు ప్రజల్లోని సెంటిమెంట్‌ను ఎలా అడ్డం పెట్టుకుంటారన్నది ఆసక్తికరంగా చూపించారు. దీనికి తోడు జగ్గు, లోకి పాత్రలు ఏపీలోని రెండు ప్రధాన పార్టీ నాయకుల్ని గుర్తు చేసేలా ఉండటంతో వాటితో ప్రేక్షకులు వెంటనే కనెక్ట్‌ అయిపోతారు. విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తి కలిగించేలా చేస్తాయి (Martin Luther King movie Review).

మార్టిన్‌ ఓటు తమకు పడేలా చేసుకునేందుకు లోకి, జగ్గు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం మొదలవుతుంది. ఎప్పుడైతే మార్టిన్‌ ఓటు కీలకమని ఊరి ప్రజలకు అర్థమవుతుందో.. అక్కడ్నుంచి ఊరి వారంతా అతనితో వ్యవహరించే తీరు మారిపోతుంది. ఆయా సన్నివేశాలన్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి. మార్టిన్‌ను ఆకర్షించేందుకు జగ్గు, లోకి పోటీ పడి అతనికి కానుకలు ఇవ్వడం.. అతను మాత్రం ఎవరికి ఓటు వేయాలో తెల్చుకోలేకపోతున్నాని చెబుతూ పబ్బం గడుపుతూ పోవడం నవ్విస్తుంది. అయితే ఈ ఎపిసోడ్‌ను మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇక మార్టిన్‌ ఓటు కోసం లోకి, జగ్గు వేలానికి దిగడం.. ఈ క్రమంలో అతని ఓటు కోసం కోటి రూపాయలు గుమ్మరించేందుకు ఇద్దరూ సిద్ధపడటం కాస్త అతిగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో మార్టిన్‌ మిత్రుడు బాటా చుట్టూ అల్లుకున్న మెలో డ్రామా సహనానికి పరీక్షగా నిలుస్తుంది. ఓటు విలువ తెలుసుకొని మార్టిన్‌ తన ఆలోచనా విధానాన్ని మార్చుకునే తీరు.. ఊరి అభివృద్ధి కోసం దాన్ని వినియోగించిన విధానం ఆకట్టుకుంటాయి. సినిమాని ముగించిన తీరు అసంతృప్తిగా అనిపిస్తుంది (Martin Luther King movie Review ).

ఎవరెలా చేశారంటే: సంపూర్ణేశ్‌ బాబుకు నటుడిగా ఇదొక సరికొత్త ప్రయత్నం. ఇప్పటి వరకు స్పూఫ్‌ కామెడీ సినిమాలతో అలరించిన ఆయన ఇందులో కొత్త అవతారమెత్తారు. భావోద్వేగభరితమైన పాత్రతో అలరించారు. ఆద్యంతం ఓ సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నారు. మార్టిన్‌ పాత్రకు తగ్గట్లుగా చాలా సహజమైన నటనను కనబరిచారు. జగ్గు పాత్రకు నరేశ్‌ తనదైన నటనతో జీవం పోశారు. అలాగే లోకి పాత్రలో వెంకటేశ్‌ కూడా నరేశ్‌కు దీటైన నటనను కనబరిచారు. వసంత పాత్రలో శరణ్య సహజమైన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకురాలు తనకందించిన స్క్రిప్ట్‌నకు నిజాయతీగా న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ప్రథమార్ధం సరదాగా సాగిపోయినా.. ద్వితీయార్ధం అక్కడక్కడా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకోవు. స్మరణ్‌ నేపథ్య సంగీతం బాగుంది. కానీ, పాటలు ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. దీపక్‌ ఛాయాగ్రహణం బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగా తన కెమెరాలో బంధించాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి (Martin Luther King movie Review ).

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • సంపూర్ణేశ్‌ నటన
  • సందేశం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే ద్వితీయార్ధం
  • పతాక సన్నివేశాలు
  • చివరిగా: మార్టిన్‌.. ఓటు సందేశం (Martin Luther King movie Review )
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని