Rakshit Shetty: రక్షిత్‌ శెట్టి లేటెస్ట్‌ హిట్‌ ఫిల్మ్‌ తెలుగులో.. విడుదల ఎప్పుడంటే?

రక్షిత్‌ శెట్టి హీరోగా దర్శకుడు హేమంత్‌ ఎం. రావు తెరకెక్కించిన చిత్రం ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ’. ఈ సినిమా తెలుగులో త్వరలోనే విడుదల కానుంది. ఎప్పుడంటే?

Published : 15 Sep 2023 17:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty). ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆయన తాజా చిత్రాన్ని తెలుగులో విడుదల చేసేందుకు సిద్ధమైంది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. రక్షిత్‌ శెట్టి హీరోగా దర్శకుడు హేమంత్‌ ఎం. రావు తెరకెక్కించిన సినిమా ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ’ (Sapta Saagaradaache Ello- Side A). రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌. రక్షిత్‌ శెట్టినే నిర్మాతగా వ్యవహరించారు. సెప్టెంబరు 1న కన్నడనాట విడుదలైన ఈ రొమాంటిక్‌ డ్రామా ఫిల్మ్‌ అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. మను పాత్రలో రక్షిత్‌, ప్రియ పాత్రలో రుక్మిణి.. ప్రేమికులుగా నటించారు. ఈ లవ్‌స్టోరీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రం ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) పేరుతో ఈ నెల 22న విడుదలకానుందని తెలిపింది.

సినిమాలు చేస్తున్నంతకాలం.. ఏటా ఏదో సాయం చేస్తా: విజయ్‌ దేవరకొండ

మరోవైపు, రక్షిత్‌ తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి పోస్ట్‌ పెట్టారు. ‘‘సప్త సాగరదాచె ఎల్లో’ సినిమా కర్ణాటక వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఇప్పుడు మరికొన్ని హృదయాల్లో స్థానం సంపాందిచుకునేందుకు సిద్ధమైంది. డియర్‌ తెలుగు ఆడియన్స్‌ మా ప్రేమను స్వీకరిస్తారని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ ఏ’కి సీక్వెల్‌గా ‘సప్త సాగరదాచె ఎల్లో: సైడ్‌ బీ’ (Sapta Saagaradaache Ello – Side B) రానుంది. ప్రస్తుతం ఆ పనులతోనే బిజీగా ఉన్నారు దర్శక, నిర్మాతలు. రక్షిత్‌ ఎప్పుడూ విభిన్న కథలను ఎంపిక చేసుకుంటారు. దాంతో, ఆయన నటించిన చిత్రాల కోసం ఇతర భాషల వారు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన నటించిన ‘777 చార్లి’ (777 Charlie) ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఇన్‌ కన్నడ’ విభాగంలో జాతీయ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని