Siddharth: రహస్యంగా నిశ్చితార్థం.. సిద్ధార్థ్‌ ఏమన్నారంటే..?

నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగింది.

Published : 06 Apr 2024 17:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి, తన స్నేహితురాలు అదితిరావు హైదరీతో నిశ్చితార్థంపై నటుడు సిద్ధార్థ్‌ తొలిసారి స్పందించారు. తాజాగా ఓ అవార్డుల వేడుకలో పాల్గొన్న ఆయన పెళ్లి, ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మేము రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది మాట్లాడుకుంటున్నారు. సీక్రెట్‌, ప్రైవేట్‌ అనే పదాలకు ఎంతో వ్యత్యాసం ఉంది. మా ఎంగేజ్‌మెంట్‌కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్‌ ఫంక్షన్‌గా భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే, మాది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్‌ ఫంక్షన్‌. (వెడ్డింగ్‌ డేట్‌ను ఉద్దేశించి) ఇదేమీ షూటింగ్‌ డేట్‌ కాదు నేను నిర్ణయించడానికి. ఇది లైఫ్‌టైమ్‌ డేట్‌. పెద్దల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. వాళ్లు ఎప్పుడు ఏం జరగాలనుకుంటే ఆ సమయంలో అది జరుగుతుంది’’ అని చెప్పారు.

‘‘మీ ప్రపోజల్‌ను అంగీకరించడానికి అదితి ఎన్ని రోజులు సమయం తీసుకున్నారు?’’ అని వ్యాఖ్యాత అడగ్గా.. ‘‘ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగవద్దు. ఎందుకంటే, ఎస్‌ లేదా నో అనే ఫైనల్‌ రిజల్ట్‌ మాత్రమే నాకు ముఖ్యం. ఆమె ఎస్‌ చెబుతుందా? లేదా? అని ఎంతో టెన్షన్‌ పడ్డా. ఆమె అంగీకారంతో నా పేరు పాస్‌ లిస్ట్‌లోకి చేరింది’’ అని బదులిచ్చారు.

‘మహా సముద్రం’ కోసం సిద్ధార్థ్‌, అదితి తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో మార్చి 27న వీరి నిశ్చితార్థం జరిగింది. ఉంగరాలతో దిగిన ఫొటో షేర్ చేస్తూ.. ‘‘ఆమె నాకు ఎస్‌ చెప్పింది’’ అని సిద్ధార్థ్‌ పోస్ట్‌ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని