Chiranjeevi: మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌

సెప్టెంబరు 22.. అగ్ర కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో అరుదైన, ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.

Published : 23 Sep 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సెప్టెంబరు 22.. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఆయన కీలక పాత్రలో నటించిన ‘ప్రాణం ఖరీదు’ (Pranam Khareedu) విడుదలై నేటికి 44 ఏళ్లు. ఈ సందర్భంగా తనని ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్విటర్‌ వేదికగా చిరు ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు ఈ రోజు (సెప్టెంబరు 22, 1978). ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ప్రాణం పోసి, నా గుండె చప్పుడై, అన్నీ మీరే అయి 44 ఏళ్లు నన్ను నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తోన్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను’’ అని చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’. అయితే, ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలై, శివశంకర వరప్రసాద్‌ను చిరంజీవిగా ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమాగా నిలిచింది. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు.. నరసింహ అనే పాత్రను పోషించారు. రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మన ఊరి పాండవులు’, ‘తాయారమ్మ.. బంగారయ్య’, ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘కొత్త అల్లుడు’, ‘ఐ లవ్‌ యూ’, చిత్రాల తర్వాత ‘పునాది రాళ్లు’ విడుదలైంది. చిరంజీవి నటించిన 153వ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’ అక్టోబరు 5న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు, మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరు ‘భోళాశంకర్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. దానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు ఆయన ఖాతాలో ఉన్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని