Tiger Nageswara Rao: షూటింగ్‌కు 20 రోజులు.. గ్రాఫిక్స్‌కు ఏడాది: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సంగతులివీ

రవితేజ హీరోగా దర్శకుడు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. అక్టోబరు 20న విడుదల కానున్న ఈ సినిమా విశేషాలేంటో చూసేయండి..

Published : 19 Oct 2023 12:11 IST

ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ తారల బయోపిక్స్‌ తెరకెక్కడం సాధారణం. ఓ దొంగ జీవితాధారంగా సినిమాలు రూపొందడం విశేషం. ఈ రెండో కోవకు చెందిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..

  • 1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించారట దర్శకుడు వంశీ. కానీ, ఈ కాంబో సెట్‌ కాలేదు. చిరంజీవితో తెరకెక్కించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో, వంశీ.. రవితేజ (Ravi Teja)ను కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఓకే చేశారు. ఈ దర్శకుడి గత చిత్రం (దొంగాట) చోరీ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే (Tiger Nageswara Rao Release on October 20th).
  • రవితేజకు ఇది ఫస్ట్‌ పాన్‌ ఇండియా ఫిల్మ్‌. యాక్టింగ్‌, లుక్‌.. ఇలా అన్ని అంశాల్లో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు.
  • హీరోయిన్లు నుపుర్‌ సనన్‌ (Nupur Sanon), గాయత్రీ భరద్వాజ్‌ (Gayatri Bhardwaj), అనుక్రీతి వాస్‌ (Anukreethy Vas) ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు.
  • దాదాపు 20 ఏళ్ల తర్వాత నటి రేణూ దేశాయ్‌ (Renu Desai) ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె హేమలత లవణం పాత్రను ఆమె పోషించారు. ప్రముఖ నటులు అనుపమ్‌ ఖేర్‌, నాజర్‌, మురళీ శర్మ, జిషుసేన్‌ గుప్త, హరీశ్‌ పేరడి, సుదేవ్‌ నాయర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
  • 2019లోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడింది. ఈ సినిమా కథ కోసం దర్శకుడు దాదాపు రెండేళ్లు రీసెర్చ్‌ చేశారు. టైగర్‌ నాగేశ్వరరావు గురించి అప్పట్లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుకునేవారు. ఆయన చేసిన సాహసాల గురించి ఎన్నో కథలున్నాయిగానీ తగిన ఆధారాల్లేవు. అందుకే ‘ఇన్‌స్పైర్డ్‌ ఫ్రమ్‌ ట్రూ రూమర్స్‌’ అని ఈ సినిమాకి క్యాప్షన్‌ పెట్టారు.

  • టైగర్‌ నాగేశ్వరరావు పైకి భయంకరంగా కనిపించినా ఆయన మనసున్న మనిషి అని, ఈ రెండో కోణాన్నే సినిమాలో చూపించాలనిపించిందని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
  • నాటి పరిస్థితులకు కళ్లకు కట్టినట్లు చూపించేందుకు సాంకేతిక బృందం ఎంతో శ్రమించింది. సినిమాకు కీలకంగా నిలిచే ట్రైన్‌ సీక్వెన్స్‌ కోసం గోదావరి బ్రిడ్జ్‌ (రాజమహేంద్రవరం)ని రీ క్రియేట్‌ చేశారు. సంబంధిత సన్నివేశాలు చిత్రీకరించేందుకు 20 రోజుల సమయం పట్టగా గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసం ఏడాది పట్టిందట. స్టూవర్టుపురం గ్రామాన్ని తలపించేలా రూ.7 కోట్లతో ఓ సెట్‌ను శంషాబాద్‌ సమీపంలో సుమారు 5 ఎకరాల స్థలంలో తీర్చిదిద్ది అక్కడే అధిక భాగం చిత్రీకరణ చేశారు.
  • బధిరుల కోసం సంజ్ఞ భాష (సైన్‌ లాంగ్వేజ్‌)లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సైన్‌ లాంగ్వేజ్‌లో రిలీజ్‌ అయ్యే తొలి భారతీయ చిత్రమిదేనని చిత్రబృందం పేర్కొంది.
  • U/A సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా రన్‌టైమ్‌: 3 గంటల 2 నిమిషాలు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని