Review Calling Sahasra: రివ్యూ: కాలింగ్‌ సహస్ర.. సుధీర్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..?

Review Calling Sahasra: సుధీర్‌ నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..?

Published : 01 Dec 2023 18:11 IST

Review Calling Sahasra చిత్రం: కాలింగ్‌ సహస్ర; నటీనటులు: సుడిగాలి సుధీర్, డాలీషా, శివ బాలాజీ, స్పందన, మనోహరన్, రవితేజ నన్నిమాల, తదితరులు; కూర్పు: గ్యారీ బి.హెచ్‌; సంగీతం: మోహిత్‌ రెహమానియక్‌; ఛాయాగ్రహణం: సన్ని.డి; రచన, దర్శకత్వం: అరుణ్‌ విక్కీరాల; నిర్మాతలు: వెంకటేశ్వర్లు కాటూరి, విజేష్‌ తయల్, చిరంజీవి పమిడి; విడుదల తేదీ: 01-12-2023

‘జబర్దస్త్‌’ కార్యక్రమంతో బుల్లితెర వేదికగా ప్రేక్షకులకు చేరువయ్యారు సుడిగాలి సుధీర్‌ (Sudigali Sudheer). ప్రస్తుతం హీరోగానూ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారాయన. గతేడాది ‘గాలోడు’ చిత్రంతో బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటిన ఆయన ఇప్పుడు ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ సినిమా కథేంటి? సినీప్రియులకు ఎలాంటి అనుభూతి అందించింది?

కథేంటంటే: అజయ్‌ శ్రీవాత్సవ (సుడిగాలి సుధీర్‌) సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌. హైదరాబాద్‌లోని తన మిత్రుడి కంపెనీలో కొత్తగా ఉద్యోగంలో చేరతాడు. తన అక్క హత్య తాలూకూ జ్ఞాపకాలు అతడిని వెంటాడుతుంటాయి. ఆమెలా మరే అమ్మాయికీ అన్యాయం జరగకూడదని రెస్క్యూ అనే అప్లికేషన్‌ను కనిపెడతాడు. ఇదిలా ఉండగా, అజయ్‌ ఓరోజు కొత్తగా ఒక సిమ్‌ కొనుగోలు చేస్తాడు. అది తన సెల్‌లో వేసుకున్నప్పటి నుంచి వరుస ఫోన్లు వస్తుంటాయి. ఆ చేసిన వాళ్లంతా సహస్ర కోసమే ఆరా తీస్తుండటంతో అజయ్‌ అయోమయానికి గురవుతాడు. దీంతో అసలు ఆ సహస్ర ఎవరు? ఆమెకు ఏమైంది? అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ సహస్ర ఎవరు? అజయ్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? సారా పేరుతో అజయ్‌కు లేఖలు రాస్తున్న అజ్ఞాత ప్రేమికురాలు ఆమేనా? అజయ్‌ అక్క చావుకు.. సహస్ర కనిపించకుండా పోవడానికి ఏమైనా లింక్‌ ఉందా? ఈ మొత్తం కథకు, లూసీఫర్‌ అనే డార్క్‌ వెబ్‌సైట్‌ క్రైమ్‌ ముఠాకూ ఉన్న సంబంధం ఏంటి? ఇందులో శివ (శివ బాలాజీ) పాత్రకున్న ప్రాముఖ్యత ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: ఇది రెగ్యులర్‌గా చూసే ఓ సగటు సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమే. డార్క్‌ వెబ్‌ మాటున జరిగే ఓ క్రైమ్‌ ఎలిమెంట్‌ను దీనికి జోడించి కొత్తదనం అద్దే ప్రయత్నం చేశారు. అలాగే ఈ పాయింట్‌ను రెండు ప్రేమకథల మధ్య ఇరికించి కాస్త భిన్నంగా చూపించాలనుకున్నారు. అయితే, ఈ రెండు ప్రయత్నాల్లో ఏ ఒక్కటీ తెరపై సరైన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. ప్రేమకథల్లో కొత్తదనం లేకపోగా.. క్రైమ్‌ను చూపించిన తీరు మరీ చప్పగా సాగింది. ఈ సినిమాలో సైబర్‌ క్రైమ్‌ ఎలిమెంట్‌ ఉన్నప్పుడు.. హీరో సైబర్‌ ఎక్స్‌పర్ట్‌ అయినప్పుడు.. క్రైమ్‌ను కనిపెట్టడానికి హీరో వేసే ఎత్తుగడలు.. వాటిని అతను చేధించే తీరు ఆసక్తిరేకెత్తించేలా ఉండాలి. కానీ, దీంట్లో ఆ తరహా ప్రయత్నాలు ఒక్కటీ కనిపించవు. పైగా ఈ కథకు అక్కడక్కడా హారర్‌ టచ్‌ ఇచ్చి ప్రేక్షకుల్ని మరింత గందరగోళానికి గురి చేశారు. ఇక ఆద్యంతం సీరియల్‌ను తలపిస్తూ నత్తనడకన సాగే కథనం ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్షే.

డార్క్‌ వెబ్‌లో లూసీఫర్‌ అనే ముఠా చేస్తున్న ఓ క్రైమ్‌ ఎలిమెంట్‌ను చూపిస్తూ సినిమా కాస్త ఆసక్తికరంగానే మొదలవుతుంది. ఆ వెంటనే ఓ రెగ్యులర్‌ ఫైట్‌తో సుధీర్‌ పాత్రను పరిచయం చేశారు. ఆ వెంటనే ఓ లవ్‌ ట్రాక్‌ను పట్టాలెక్కించి విరామం వరకు దానితోనే కాలక్షేపం చేశాడు దర్శకుడు. విరామానికి ముందు హీరో, అతని ఫ్రెండ్స్‌ ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో కథలో కాస్త కదలిక వస్తుంది. ద్వితీయార్ధంలో సహస్ర ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయమేంటి? అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది. కానీ, ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఏమాత్రం ఆసక్తి కలిగించదు. ప్రీక్లైమాక్స్‌ మరీ సాగతీత వ్యవహారమైంది. లూసీఫర్‌ పేరుతో నేరాలు చేస్తున్న వ్యక్తి ఎవరన్నది సినిమా ఆరంభంలోనే ప్రేక్షకులకు అర్థమైపోతుంది. దీంతో ముగింపు ఏమాత్రం ఆసక్తిరేకెత్తించదు.

ఎవరెలా చేశారంటే: అజయ్‌ శ్రీవాత్సవ అనే పాత్రలో సుధీర్‌ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే నటన పరంగా ఆ పాత్ర తనకేమీ సవాలు విసిరేది కాదు. కథానాయికలుగా స్పందన, డాలీషా సినిమాలో అందంగా కనిపించారు. ఈ ఇద్దరి పాత్రలకు కథలో మంచి ప్రాధాన్యతే ఉంది. ఈ చిత్రంలో శివ బాలాజీ పాత్ర కాస్త సర్‌ప్రైజింగ్‌గానే ఉంటుంది. కాకపోతే దాన్ని ప్రేక్షకులు ముందే పసిగట్టేస్తారు. ఇక, మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకే ఉంటాయి. దర్శకుడు రాసుకున్న కథలోని క్రైమ్‌ ఎలిమెంట్‌ కొత్తగా ఉన్నా.. దాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ప్రథమార్ధం పూర్తిగా నిరుత్సాహ పరిచింది. దీంట్లో రెండు పాటలున్నాయి. కానీ, ఏదీ గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రాహణం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

  • బలాలు:
  • + సుధీర్‌ నటన
  • + కథలోని కొన్ని ట్విస్టులు
  • బలహీనతలు: 
  • - కథా నేపథ్యం
  • - సాగతీత సన్నివేశాలు
  • - ముగింపు
  • చివరిగా: ‘కాలింగ్‌ సహస్ర’.. సహస్ర ఉంది కానీ థ్రిల్‌ లేదు..!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని