Tamannaah: డైరెక్టర్‌పై తమన్నా ప్రశంసలు.. 19 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ..

తన కెరీర్‌లో దర్శకుడు సంపత్‌ నందిలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు తమన్నా. ఎందుకంటే?

Published : 10 Mar 2024 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నా 19 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి వ్యక్తిని చూడలేదు’ అంటూ దర్శకుడు సంపత్‌ నంది (Sampath Nandi)పై ప్రముఖ హీరోయిన్‌ తమన్నా (Tamannaah) ప్రశంసలు కురించారు. టీమ్‌లోని ప్రతి ఒక్కరి ప్రతిభను గుర్తించి, మెచ్చుకోవడం ఆయనకే చెల్లిందన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో డి. మధుతో కలిసి సంపత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఓదెల 2’ (Odela 2). అశోక్‌ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంలోని తమన్నా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆమె నాగ సాధువుగా కనిపించారు. ఆ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందంటూ సంపత్‌ నంది సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తమన్నా లుక్‌ అద్భుతంగా రావడం వెనుక ఎవరెవరి కృషి దాగి ఉందో తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీతా లుల్లా నుంచి తమన్నా పర్సనల్‌ స్టాఫ్‌ వరకు అందరికీ థ్యాంక్స్‌ చెప్పారు.

దీనిపై తమన్నా స్పందిస్తూ.. ‘‘సినిమా ఒకరి ఆలోచనతో ప్రారంభం కావొచ్చు. కానీ, సమష్టి కృషి వల్లే అది రూపొందుతుంది. ప్రతి విభాగానికి చెందిన వారిని సంపత్‌ ప్రశంసించడం విశేషం. ఆయన చెప్పినట్లు నా లుక్‌ వెనుక ఎంతోమంది శ్రమ ఉంది. ‘ఓదెల 2’లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

2022లో నేరుగా ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ (Odela Railway Station) చిత్రానికి సీక్వెల్‌ ‘ఓదెల 2’. పార్ట్‌ 1లో ప్రధాన పాత్ర పోషించిన హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌. సింహ పార్ట్‌ 2లోనూ నటిస్తున్నారు. ఓదెల మల్లన్న స్వామి ఆ గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనే అంశంతో.. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం కాశీలో ప్రారంభమైంది. సంపత్‌ నంది దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన ‘రచ్చ’ (రామ్‌ చరణ్‌), ‘బెంగాల్‌ టైగర్‌’ (రవితేజ), ‘సీటీమార్‌’ (గోపీచంద్‌)లో తమన్నా హీరోయిన్‌గా నటించి, అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని