Eswar Rao: టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

Eswar Rao: సీనియర్‌ నటుడు ఈశ్వరరావు అనారోగ్యం తుది శ్వాస విడిచారు.

Published : 03 Nov 2023 16:07 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వరరావు (Eswar rao) కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్‌లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అక్టోబరు 31న అక్కడే తుది శ్వాస విడిచారు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈశ్వరరావు కన్నుమూసిన విషయం తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ విచారం వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

దివంగత దర్శక నటుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్గం నరకం’ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు ఈశ్వరరావు. ఇదే చిత్రంతో విలక్షణ నటుడు మోహన్‌బాబు కూడా నటుడిగా మారిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈశ్వరరావుకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ‘స్వర్గం నరకం’లో నటనకు గానూ ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ‘దేవతలారా దీవించండి’, ‘ప్రేమాభిషేకం’, ‘యుగపురుషుడు’ ‘దయామయుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రెసిడెంట్‌ గారి అబ్బాయి’, ‘జయం మనదే’, ‘శభాష్‌ గోపి’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన  చివరిసారిగా చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘ఘరానా మొగుడు’లో కనిపించారు. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించి అలరించారు. అనంతరం బుల్లితెరపైనా పలు ధారావాహికల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని