Theme Songs: కథను చెప్పే పాట.. ఎక్కడైనా హిట్టే.. మీరు విన్నారా!

ఇటీవల విడుదలై, విశేష ఆదరణ పొందిన థీమ్ సాంగ్స్‌పై కథనం. ఏ పాట ఏ సినిమా కథను తెలియజేస్తుందంటే..?

Published : 25 Oct 2022 11:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథలో భాగంగా వినిపించే పాటలు వేరు. కథను వివరించే పాటలు వేరు. రెండో రకానికి చెందిన వాటిలో ఉన్న మర్మమేంటో సినిమా చూసేంత వరకూ అర్థంకాదు. ఆయా పాటలను తెరపై చూడగానే ‘అదరహో’ అని అనుకుంటుంటాం. అక్కడితో వదిలేయకుండా ఇతర పాటల్లానే వాటినీ యూట్యూబ్‌లోనో, ఇతర మ్యూజిక్‌ యాప్స్‌లోనో ప్లే చేసుకొని పదే పదే వింటుంటాం. అలా ఇటీవల ప్రేక్షకులను మెప్పించిన కొన్ని ‘థీమ్‌ సాంగ్స్‌’ చూద్దాం..

కన్నడ నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘కాంతార’ (Kantara) ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. తెలుగు ప్రేక్షకులనూ ఈ చిత్రం మంత్రముగ్దుల్ని చేస్తోంది. ఓ గూడెం నేపథ్యంలో సాగే ఈ కథలో హీరో విష్ణుమూర్తిగా (వరాహ రూపంలో) కనిపించే సన్నివేశం, ‘వరాహ రూపం దైవ వరిష్ఠం’ (Varaha Roopam) పాట సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఆ పాట లిరికల్‌ వీడియోను చిత్ర బృందం ఈ నెల 19న యూట్యూబ్‌లో విడుదల చేయగా ఇప్పటి వరకూ సుమారు 8 మిలియన్ల మంది వీక్షించారు. ఈ సినిమా థీమ్‌.. కర్ణాటక తుళునాడులోని భూతకోల సంస్కృతి గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.


కృష్ణతత్వం కథాంశంతో నిఖిల్‌ హీరోగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’ (Karthikeya 2). ఇందులో డాక్టర్‌ అయిన హీరో తన తల్లితో కలిసి ద్వారక వెళతాడు. శ్రీకృష్ణుడికి సంబంధించిన ఓ రహస్యాన్ని చేధించే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటాడు. ఆయా సన్నివేశాల నేపథ్యంలో సాగే ‘హే మాధవ.. హే కేశవ’ (Krishna Trance) అనే పాట అటు కృష్ణుడి గురించి చెబుతూనే ‘ప్రశ్నకు సమాధానం లభించే వరకూ హీరో పోరాడతానే ఉంటాడు’ అనే అంశాన్ని స్పృశిస్తుంది. 


నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నూతన దర్శకుడు వశిష్ఠ తీసుకొచ్చిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో కల్యాణ్‌రామ్‌.. బింబిసారుడు, దేవదత్తుడుగా నటించారు. వర్తమాన పాత్ర దేవదత్తుడు పరిచయ సన్నివేశాన్ని ఓ ర్యాప్‌ సాంగ్‌తో తీర్చిదిద్దారు. ఇందులో బింబిసారుడి వీరత్వం గురించీ ఉంటుంది.


కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనగరాజ్‌ సృష్టించిన సినిమాటిక్‌ యూనివర్స్‌ ‘విక్రమ్‌’ (Vikram). ఇందులో కమల్‌.. కర్ణన్‌ అనే పాత్ర పోషించారు. చనిపోయిందనుకున్న ఆ పాత్ర తిరిగివచ్చే సన్నివేశం సినిమాకే కీలకం. ఆ కథాంశానికి తగ్గట్టే టైటిల్‌ ట్రాక్‌ ఉంటుంది. ‘కాలమే కంపించినా మళ్లీ వచ్చెను నాయకుడు.. ఒక్కడే ఇద్దరు కదా రాముడూ రాక్షసుడు’ అనే ఈ పాటకు థియేటర్లలోనే కాదు యూట్యూబ్‌లోనూ మంచి ఆదరణ దక్కింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని