Most Eligible Bachelor: ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఓటీటీలోకి వస్తున్నాడు.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Updated : 30 Aug 2022 15:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. ఈ రొమాంటిక్‌ కామెడీ అక్టోబరు 15న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. మరికొన్ని రోజుల్లోనే డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించనుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. పెళ్లి జీవితం బాగుండాలంటే కెరీర్‌ బాగుండాలని నమ్మే వ్యక్తి (హర్ష)గా అఖిల్‌, స్టాండప్‌ కమెడియన్‌ (విభావరి)గా పూజా హెగ్డే కనిపించి ఆకట్టుకున్నారు.

బ్యాచ్‌లర్‌ కథేంటంటే..

హ‌ర్ష అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ.. మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్నీ ప‌క్కాగా సెట్ చేసుకుంటాడు. తనపై తనకున్న నమ్మకంతో పెళ్లికి ముందే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని, అనుకున్న తేదీన ఓ మంచి అమ్మాయిని వెతికి ప‌ట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. 20మంది అమ్మాయిల్ని పెళ్లిచూపులు చూసి.. వాళ్ల‌లో మ‌న‌సుకు న‌చ్చిన ఆమెతో ఏడ‌డుగులు వేయాల‌న్న‌ది త‌న ప్ర‌ణాళిక‌. త‌ను పెళ్లిచూపులు చూడాల‌నుకున్న అమ్మాయిల్లో స్టాండ‌ప్ క‌మెడియ‌న్ విభా అలియాస్ విభావ‌రి ఉంటుంది. హ‌ర్షలాగే ఆమే పెళ్లి విష‌యంలో క్లారిటీతో ఉంటుంది. రాబోయే జీవిత భాగ‌స్వామి విష‌యంలో ఆమెకు కొన్ని అంచ‌నాలుంటాయి. అయితే ఆమెను పెళ్లి చూపులు చూడ‌క‌ముందే జాత‌కాలు క‌ల‌వ‌లేద‌న్న ఉద్దేశంతో హ‌ర్ష కుటుంబం.. ఆ సంబంధం కాద‌నుకుంటుంది. కానీ, హ‌ర్ష మాత్రం విభాను చూసి తొలిచూపులోనే మ‌న‌సు పారేసుకుంటాడు. ఆమెతోనే పెళ్లి పీట‌లెక్కాల‌ని క‌ల‌లు కంటాడు. విభా మాత్రం హ‌ర్ష ప్రేమ‌కు నో చెబుతుంది. ఈ క్ర‌మంలో పెళ్లి విష‌యంలో ఆమె అడిగిన కొన్ని ప్ర‌శ్న‌లు.. హ‌ర్ష జీవితంలో పెను మార్పుల‌కు కార‌ణ‌మ‌వుతాయి. మ‌రి ఆ ప్ర‌శ్న‌లేంటి? వాటికి స‌మాధానం క‌నుక్కునే క్ర‌మంలో హ‌ర్ష తెలుసుకున్న జీవిత‌ స‌త్య‌మేంటి? చివ‌రికి తాను అనుకున్న‌ట్లుగా విభా ప్రేమ‌ని ద‌క్కించుకున్నాడా? ఆమెతో పెళ్లి పీట‌లెక్కాడా? లేదా? అన్న‌ది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని