National Film Awards: అలా చేస్తే అన్ని జాతీయ అవార్డులు మాకే వచ్చేవి..: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ నిర్మాత

వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. దీనిపై వస్తున్న విమర్శలపై ఈ చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ స్పందించారు.

Published : 25 Aug 2023 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు (The Kashmir Files) రెండు అవార్డులు వరించాయి. జాతీయ సమగ్రతా చిత్రంగా ఈ సినిమా ఎంపికవ్వగా.. ఇందులో నటించిన పల్లవి జోషికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు వచ్చింది. దీనిపై పలు విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) మీడియా సమావేశంలో వాటిపై మాట్లాడారు.

‘‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ ప్రజల సినిమా. ఎంతో మందికి నచ్చిన చిత్రం కాబట్టే దీనికి జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ఈ పురస్కారం దక్కినట్లు భావిస్తున్నా. ఇక ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. చిత్రబృందం మీద కేసులు పెట్టారు. మేము ప్రజల కోసం సినిమా తీయాలనుకున్నాం కాబట్టే దీన్ని ఎవరూ ఆపలేకపోయారు. జనాలకు వాస్తవాలను చూపడం కోసమే ఈ చిత్రాన్ని రూపొందించాం. దీనికి అవార్డు రావడంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శలు చేస్తున్నారు. దేశంలో ధర్మాన్ని కాపాడాలన్నదే మా లక్ష్యం. దేశ సమగ్రతా చిత్రంగా మా సినిమాకు అవార్డు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తే.. దేశాన్ని ప్రశ్నించినట్లే. ప్రభుత్వం ఈ అవార్డును ప్రజలకు ఇచ్చిందని మేము భావిస్తున్నాం. ఈ సినిమాకు అవార్డులు రావడం వెనక ఎలాంటి లాబీయింగ్‌ లేదు. అలా చేసి ఉంటే అన్ని అవార్డులు మా సినిమాకే వచ్చేవి. అలాంటివి చేయడం నాకు తెలీదు’’ అని చెప్పారు. ఇక తెలుగు సినిమాకు అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉందన్న అభిషేక్ అగర్వాల్‌.. ప్రపంచంలో టాలీవుడ్‌ నంబర్‌ వన్‌లో ఉందన్నారు. తెలుగు సినిమాను రాజమౌళి అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వకారణమన్నారు. బయట నుంచి వచ్చిన నిర్మాతలను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరెన్నో మంచి చిత్రాలు వచ్చే అవకాశముంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ విజయం మీదే.. జాతీయ అవార్డుపై అలియా భట్‌ స్పందన..

ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డులపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (MK Stalin) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమాలు రాజకీయ రహితంగా ఉండాలని.. అవార్డులను రాజకీయాలు, నాయకులు ప్రభావితం చేయకూడదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాటి పరువు తీయకూడదని విమర్శించారు. ఎంతోమంది ప్రేక్షకులు వ్యతిరేకించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు అవార్డులు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కావాలనే కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించి వీటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్టాలిన్‌ వ్యాఖ్యలు ఇటు సినీ రంగంలో పాటు అటు రాజకీయంగానూ చర్చనీయాంశమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని