Tollywood: సినిమా షూటింగ్స్‌ బంద్‌.. ఈ సమస్యలకు పరిష్కారం లభించేనా?

చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Published : 01 Aug 2022 01:49 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి చిత్రీకరణలు నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్‌ జనరల్‌ బాడీ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. చిత్రీకరణలు నిలిపేస్తూ గిల్డ్‌ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్‌ మద్దతు తెలిపింది. కరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే గాడినపడుతున్న చిత్ర పరిశ్రమ సడెన్‌గా ఎందుకు బంద్‌కు పిలుపునిచ్చింది? చిత్ర పరిశ్రమను ఏయే సమస్యలు వేధిస్తున్నాయి? నిర్మాతల తాజా నిర్ణయంతో వాటికి పరిష్కారం లభిస్తుందా? చర్చల సందర్భంగా చిత్ర పరిశ్రమ అసలు ఏయే అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది? 

స్థిరత్వం లేని టికెట్‌ ధరలు

కరోనా పరిస్థితుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్‌ ధరలు భారీగా పెరిగిపోయాయి. పరిశ్రమను ఆదుకోండి అంటూ రాష్ట్ర ప్రభుత్వాలను నిర్మాతలు అడగడం.. వాళ్లు ఓకే అని జీవోలు విడుదల చేయడం మీకు తెలిసిందే. అయితే నిర్మాతల ఆలోచన బూమరాంగ్‌ అయ్యింది. టికెట్‌ ధర పెరగడంతో బాక్సాఫీసులో తెగడం తగ్గిపోయింది. కరోనా మహమ్మారి దెబ్బకు సామాన్యుడు సినిమా టికెట్‌ ధర చూసి వణికిపోయాడు. దీంతో కొందరు నిర్మాతలు తిరిగి సాధారణ ధరలు అంటూ.. తమ సినిమాలకు ప్రచారం చేసుకున్నారు. ‘థాంక్‌ యు’ సినిమాకు కొన్ని చోట్ల 1+1 ఆఫర్ ఇచ్చారని సమాచారం. ‘మేజర్’, ‘ఎఫ్ 3’ చిత్రాలకు టికెట్ ధరలు సాధారణమే అంటూ పోస్టర్ల మీద ప్రకటించారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

ఓటీటీ ఆదుకుందా? ఆడుకుంటోందా?

టికెట్‌ ధరలు చూసి థియేటర్‌కు దూరమైనవారు... ‘పద ఓటీటీలో చూసుకుందాం’ అనే నిర్ణయానికి వచ్చారు. ఓవైపు టికెట్‌ ధరలు సగటు ప్రేక్షకుడికి భారమవ్వడం, ఓటీటీ వార్షిక సభ్యత్వాలు కూడా తక్కువ ధరకు లభిస్తుండటం... ప్రేక్షకులు ఇటువైపు మళ్లేలా చేసింది. ఒక అంచనా ప్రకారం. రూ.5 వేలు పెట్టుకుంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఓటీటీలను ఏడాది పాటు చూడొచ్చు. కొన్ని సినిమాలు నాలుగు వారాలకు... ఫ్లాప్‌ అయినవి రెండు వారాలకే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 10 వారాల తర్వాతే సినిమా ఓటీటీలో రావాలని కొంతమంది నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారు. సినిమా హిట్టయితే ఎన్ని రోజుల తర్వాత వచ్చినా ఫర్వాలేదు. కానీ, ఫ్లాప్‌ అయితే పది వారాల తర్వాత ఓటీటీలో ఆ సినిమా వస్తే చూసే ఆసక్తి ప్రేక్షకుడికి ఉంటుందా? అంతేకాదు నిర్మాత అడిగినంత డబ్బు ఇచ్చి ఓటీటీ సంస్థలు ఆ సినిమాను కొంటాయా? నిర్మాతలూ ఈ కోణంలోనూ ఆలోచించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. 

దమ్మున్న కంటెంట్ ఏది?

ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించడం అతి పెద్ద సవాల్‌. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైవిధ్యమైన కంటెంట్‌ రుచి చూసిన సినిమా ప్రేక్షకుడిని మెప్పించడం అంత సులభం కాదు. అయితే గత కొన్ని నెలలుగా తెలుగులో వస్తున్న సినిమాల్లో ఇలాంటి కంటెంట్‌ సమస్య ఇబ్బంది పెడుతోంది అనే చర్చ కూడా నడుస్తోంది. సరైన కంటెంట్‌ లేకనే సినిమాలు వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోతున్నాయి. రీసెంట్‌ సినిమాల ఫలితాలు చూస్తే ఎవరైనా ఈ మాట చెప్పేయొచ్చు. అగ్ర హీరోలు/ దర్శకుల సినిమాలకు ఓపెనింగ్స్‌ బాగుంటాయి. కానీ, ఆ జోరు కొనసాగాలంటే కథా, కథనాల్లో దమ్ముండాలి. మధ్య స్థాయి హీరోల సినిమాల ఓపెనింగ్స్‌ రావాలన్నా, వచ్చిన వసూళ్లు నిలవాలన్నా కంటెంట్‌ పక్కాగా బలంగా ఉండాల్సిందే. ఈ విషయమ్మీదా చర్చ జరిగి, మార్పులు వస్తే టాలీవుడ్‌కి ఎదురు లేదు అని ఓ చర్చ సోషల్‌ మీడియాలో జోరుగా నడుస్తోంది.

నిర్మాణ వ్యయాలు.. కార్మికుల వేతనాలు..

చిత్ర నిర్మాణ వ్యయం గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరి సినిమాల్లోనూ బడ్జెట్‌ తేడా కనిపిస్తోంది. ఏ కథకు ఎంత బడ్జెట్‌ అనే అంచనా వేసుకున్నా.. ఆచరణలో మాత్రం లెక్క మారుతోంది అని టాలీవుడ్‌ సమాచారం. దీనికి తోడు హీరోల పారితోషికాలపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక్క సినిమా హిట్ అయితే చాలు రెట్టింపు పారితోషకాలు అడుగుతున్నారని కొందరు, నిర్మాతలే ఇస్తున్నారని మరికొందరు ఈ మధ్య జరిగిన ఓ చర్చలో ప్రస్తావించారట. హీరోల పారితోషికాలతో పాటు, సినిమా నిర్మాణ వ్యయంపై స్పష్టతమైన నిర్ణయానికే వస్తేనే సినిమా పరిశ్రమ సగం గట్టెక్కుతుందని చెప్పొచ్చు.

నటీనటులతో సహా వారి సహాయకుల వసతులకు నిర్మాత జేబులోనుంచే డబ్బు ఇవ్వాల్సి వస్తుండటమూ నిర్మాణ వ్యయం పెరగడానికి మరో కారణం. ఇటీవల ఓ అగ్ర కథానాయిక నుంచి నిర్మాణ సంస్థ డబ్బును రికవరీ చేయించింది అనే వార్త చదివే ఉంటారు. క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడుల వారీగా ధరలు నిర్ణయించినట్లు ఏ నటుడికి ఎంత? పారితోషికం ఇవ్వాలనే దానిపై ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందనే సూచన ఒకటి వినిపిస్తోంది. ఇదిలా ఉండగా వేతనాలు పెంచాలని కార్మికులు కూడా  చాలా రోజుల నుంచి పట్టుబడుతున్నారు. ఆ మధ్య షూటింగ్‌లకు హాజరు కాకుండా నిరసన కూడా తెలిపారు. 40 శాతం వేతనాలు పెంచే నిర్మాతల సినిమాలకే పనికి వస్తామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీనిపైనా ఈ చర్చల్లో ఓ నిర్ణయానికి రావచ్చు.

ఇలా చెప్పుకొంటూ పోతే... వీపీఎఫ్‌ ఛార్జీలు, ఫెడరేషన్‌ సమస్యలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్న నిర్మాతలు ఇప్పుడు మేల్కోకపోతే ఇండస్ట్రీ మనుగడ ప్రమాదంలో పడిపోతుందని గ్రహించారు. నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. అందుకోసం చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించారు.

ప్రస్తుతం బంద్‌కు పిలునివ్వడం వల్ల ముంబయిలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, హైదరాబాద్ లో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, ‘సలార్’, విజయ్ దేవరకొండ ‘ఖుషి’, తమిళ్ హీరో విజయ్ ‘వారసుడు’, రవితేజ ‘రావణాసుర’, నాని ‘దసరా’, రామ్ చరణ్ - శంకర్ సినిమా అఖిల్ ‘ఏజెంట్’... ఇలా దాదాపు 30 సినిమాలు షూటింగ్స్ ఆగిపోతున్నాయి. మరోవైపు చిత్ర పరిశ్రమలోని సమస్యలను వారం నుంచి రెండు వారాల్లో పరిష్కరిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. మరి ‘బంద్‌’ పాటించి చేపడుతున్న చర్చలు ఎలా సాగుతాయి, సమస్యల పరిష్కారానికి ఏం నిర్ణయాలు తీసుకుంటారు అనేది చూడాలి. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని