kandikonda: సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత

హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు....

Published : 13 Mar 2022 01:36 IST

హైదరాబాద్‌: హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ(49)(kandikonda) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు. వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో కందికొండ తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఆ వ్యాధిని జయించినా, ఆ వ్యాధి ప్రభావం వెన్నెముకపై పడటంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, స్నేహితుల సహకారంతో ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నా, పూర్తి స్థాయిలో కోలుకోలేదు.

ఆయన పూర్తి పేరు కందికొండ యాదగిరి. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో కందికొండ (kandikonda)జన్మించారు. ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తి కారణంగా క్రమంగా సినీ రంగంవైపు అడుగులు చేశారు. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంలో ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. అలా ‘ఇడియట్‌’లో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’, ‘సత్యం’లో ‘మధురమే మధురమే’, ‘ఐయామ్‌ ఇన్‌ లవ్‌’, ‘పోకిరి’లో ‘గల గల పారుతున్న గోదారిలా’ ‘జగడమే’, ‘లవ్‌లీ’లో ‘లవ్‌లీ లవ్‌లీ’ తదితర పాటలు రాశారు. 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక శ్రీకాంత్‌ నటించిన ‘కోతలరాయుడు’లో ఒక పాట రాశారు. 

20ఏళ్ల సినీ ప్రస్థానంలో 1300లకు పైగా పాటలు రాశారు. మొదట్లో జానపద గీతాలను రాసిన కందికొండ(kandikonda), సినీ సంగీత దర్శకుడు చక్రి ప్రోత్సాహంతో సినిమా పాటలు రాశారు. సినిమా పాటలే కాకుండా బతుకమ్మ నేపథ్యంలో రాసి పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా జనం నోట మార్మోగాయి. పాటలే కాదు, కవిత్వం రాయడంలోనూ కందికొండ దిట్ట. తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత. మట్టి మనుషుల వెతలు, పల్లెబతుకు చిత్రాలను కథలుగా రచించి కథకుడిగానూ విశేష ఆదరణ పొందారు.

క్యాన్సర్‌ పోరాడి గెలిచిన తర్వాత కందికొండ(kandikonda)ను వెన్నెముక సమస్య ఇబ్బంది పెట్టింది. మళ్లీ ఆయన ఆస్పత్రి పాలవడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అదే సమయంలో కరోనా విజృంభించడంతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో కందికొండ కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. కొన్ని రోజులు ఆరోగ్యం నిలకడగా ఉన్నా, ఇటీవల క్షీణించడంతో శనివారం కందికొండ తుదిశ్వాస విడిచారు. కందికొండ మృతి పట్ల చిత్ర పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒక మంచి గేయ రచయితను కోల్పోయామని సినీ పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు.

కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు: సీఎం కేసీఆర్‌

కందికొండ యాదగిరి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ‘‘తన పాట ద్వారా తెలంగాణ సంస్కృతిని అజరామరంగా నిలిపారు. కందికొండ మరణం సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటు. పాటల రచయితగా తనదైన ముద్ర వేశారు. కందికొండను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు’’ అని సీఎం పేర్కొన్నారు.

* ‘‘రాష్ట్ర సంస్కృతిని తన సాహిత్యం ద్వారా ప్రజలకు దగ్గర చేశారు. కందికొండ మరణం రాష్ట్రానికి తీరనిలోటు. ఆయన పాటలు తెలంగాణ సాహిత్య చరిత్రలో నిలిచిపోతాయి. సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు’’ - కేటీఆర్‌

* ‘‘తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన రచయిత కందికొండ యాదగిరి మరణం తీరని లోటు. పలు సినిమాలకు పాటలు రాసిన కందికొండ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బతుకమ్మ పాటలతో మంచి ఖ్యాతిని గడించారు. కందికొండ మృతికి నా ప్రగాఢ సానుభూతి’’ - బండి సంజయ్‌ 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని