Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్‌ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్‌ కల్యాణ్‌

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’లో పవన్‌ కల్యాణ్‌ సందడి చేశారు. ఎన్నో విశేషాలు పంచుకున్నారు.

Published : 03 Feb 2023 02:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒకప్పుడు తనకు నటన అంటే ఇష్టం ఉండేదికాదని, తన వదిన- అత్తయ్యల ప్రోత్సహంతోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చినట్టు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable 2)లో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత, వృత్తిపరమైన పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

‘‘నటన అంటే నాకు ఆసక్తి ఉండేదికాదు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ (సీజీ) నేర్చుకుని అటుగా వెళ్దామనుకున్నా. రచయితనో, దర్శకుడినో అవుదామనుకున్నా. మా వదిన, అత్తయ్యగారి ప్రోద్బలం వల్ల సినిమాల్లోకి వచ్చా. నన్ను లాంచ్‌ చేయడం అరవింద్‌గారికి తప్పలేదు (నవ్వులు). ‘సుస్వాగతం’లోని ఓ పాటను బస్సుపై చిత్రీకరించారు. అది చేసేందుకు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. వదినకు ఫోన్‌ చేసి నా వల్ల కాదు ‘ఇదే నా చివరి సినిమా’ అని చెప్పేశా. పదిమంది ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడే నేను.. అక్కడ చాలామందిని చూడడంతో నాకు సంబంధంలేని పనిని చేస్తున్నాననిపించింది. ఇంకా నాలుగైదు సినిమాలు చేసి రిటైర్డ్‌ అయిపోదామని ‘ఖుషి’ తర్వాత అనుకున్నా.’’

‘‘రాజకీయపరంగా ప్రోత్సహించేవారు నా పక్కన ఎవరూ లేరు. పాలిటిక్స్‌ విషయంలో అంతర్మథనం సాగాలి. జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని, బ్రహ్మచారిగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నా. కానీ, ఆ ప్రయాణాన్ని తలచుకుంటే ‘నాకేనా ఇన్ని వివాహాలు జరిగాయి’ అని అనిపిస్తుంటుంది. ఏదీ నేను ప్లాన్‌ చేయలేదు. ఫస్ట్‌ మ్యారేజ్‌ ఇంట్లో వాళ్లు చూసి సంబంధం. రిలేషన్‌షిప్‌లో కొన్ని కుదరవు కాబట్టి విడిపోవాల్సి వస్తుంది. రెండోసారీ అభిప్రాయభేదాలు వచ్చాయి. నేను వ్యామోహంతో అన్నిపెళ్లిళ్లు చేసుకోలేదు. ‘మూడు పెళ్లిళ్లు’ అని నన్ను ప్రశ్నిస్తుంటే ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదని చెప్పాలనిపిస్తుంటుంది. పాలిటిక్స్‌లో ఉన్నా కాబట్టి విమర్శించేందుకు అది ఆయుధంలా మారింది’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. ఈ షోలో సాయిధరమ్‌ తేజ్‌ తళుక్కున మెరిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని