upcoming telugu movies: ఈ వారం అగ్రహీరోల హంగామా..! థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

upcoming telugu movies: గత కొన్ని వారాలుగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తూ వచ్చాయి. కానీ, స్వాతంత్ర్యదినోత్సవం నేపథ్యంలో అగ్ర కథానాయకుల సినిమాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు వస్తున్నాయి. మరి చిత్రాలేంటి? వాటి విశేషాలు చూసేయండి.

Published : 07 Aug 2023 09:48 IST

పాత రజనీకాంత్‌ను చూస్తామా?

‘ఓ రేంజ్‌ తర్వాత మన దగ్గర మాటలుండవ్‌.. కోతలే..’ అంటున్నారు రజనీకాంత్‌. ఆయన కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). తమన్నా కథానాయిక. ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రజనీకాంత్‌ స్టైల్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చూస్తుంటే పాత రజనీని గుర్తు చేస్తున్నాయి. మరి ‘జైలర్‌’ కథేంటో తెలియాంటే సినిమా చూడాల్సిందే! అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రచార చిత్రాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసింది.


శత్రు వేటకు ‘భోళా శంకర్‌’

సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా వినోదాలు పంచిన చిరంజీవి.. ఇప్పుడు ‘భోళా శంకర్‌’గా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మెహర్‌ రమేష్‌ తెరకెక్కించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. తమన్నా కథానాయిక. కీర్తి సురేష్‌, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో చిరు స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయనకు సోదరిగా కీర్తి సురేష్‌ నటించనుంది.


‘ఉస్తాద్‌’ ఆకాశ ప్రయాణం!

శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’. రజనీ కొర్రపాటి, రాకేష్‌ రెడ్డి గడ్డం, హిమాంక్‌ రెడ్డి దువ్వూరు నిర్మించారు. కావ్యా కల్యాణ్‌రామ్‌ కథానాయిక. గౌతమ్‌ మేనన్‌, రవీంద్ర విజయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. ‘ఆకాశంలో ఎగరాలని కలలు కనే సూర్య అనే ఓ సాధారణ మధ్య తరగతి యువకుడి కథ ఇది. అతను ఆ కలను సాధిస్తాడు. అయితే ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అతని ప్రపంచం ఏంటి? తన బైక్‌తో ఉన్న అనుబంధం ఏంటి? తన ప్రేమకథ ఏమైంది? అన్నది ఆసక్తికరం. ఈ సినిమాలో శ్రీసింహా మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. జోసెఫ్‌ డిసౌజా అనే పైలట్‌ పాత్రలో గౌతమ్‌ మేనన్‌ నటించారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


దేశం కోసం తారా సింగ్‌ పోరాటం

తన కుటుంబం, దేశం కోసం పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ దేవోల్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గదర్‌ 2’. ఇందులో ఆయన తారా సింగ్‌ పాత్రలో నటిస్తున్నారు. సకీనాగా అమీషా పటేల్‌ నటిస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. చరణ్‌జీత్‌గా ఉత్కర్ష్‌ శర్మ కనిపించనున్నారు. జీ స్టూడియోస్‌తో అనిల్‌ శర్మ, కమల్‌ ముకుట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఈసారి మరో సమస్యతో..

అక్షయ్‌కుమార్‌ (Akshay Kumar) దేవుడి పాత్రలో నటించిన ‘ఓ మై గాడ్‌’ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఓ మై గాడ్‌ 2’ (OMG 2) రూపొందిన సంగతి తెలిసిందే. అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్‌, గోవింద నామ్‌దేవ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లివే!

  • నెట్‌ఫ్లిక్స్‌
  • గబ్బీస్‌ డాల్‌ హౌస్‌ (మూవీ) ఆగస్టు 07
  • జాంబీవెర్స్‌ (కొరియన్‌) ఆగస్టు 08

  • హార్ట్‌ ఆఫ్ స్టోన్‌ (మూవీ) ఆగస్టు 11
  • ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) ఆగస్టు 11
  • పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) ఆగస్టు 11
  • జీ5
  • ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌) ఆగస్టు 11
  • అబర్‌ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11
  • సోనీలివ్‌
  • ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌) ఆగస్టు 9

  • పొర్‌ తొళిల్ (తమిళ్‌/తెలుగు) ఆగస్టు 11
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • మేడ్‌ ఇన్‌ హెవెన్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 10
  • ఆహా
  • హిడింబ (తెలుగు) ఆగస్టు 10
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని