Vaarasudu: వారసుడు ‘రిలీజ్‌’ వాయిదా.. దిల్‌రాజు అధికారిక ప్రకటన

విజయ్‌ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి (vamsi paidipally) దర్శకత్వం వహించిన ‘వారసుడు’ (Vaarasudu) విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు (DilRaju) ప్రకటించారు.

Updated : 09 Jan 2023 12:28 IST

హైదరాబాద్‌: విజయ్ (Vijay) హీరోగా నటించిన ‘వారసుడు’ (Vaarasudu) విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ప్రకటించారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈమేరకు జనవరి 14న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన పలు విషయాలపై మాట్లాడారు.

‘‘వారసుడు’ రిలీజ్‌ డేట్‌పై గత కొన్నిరోజులుగా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తమిళ వెర్షన్‌ జనవరి 11న విడుదల చేస్తున్నాం. తెలుగులో మాత్రమే 14న విడుదల చేయనున్నాం. పరిశ్రమలో ఉన్న పెద్దలందరితో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. సినిమాపైన నాకు ఉన్న నమ్మకం, మన స్టార్‌హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ రిలీజ్‌లను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నా. ఆ రెండు చిత్రాలకూ నా సినిమా పోటీ కాదు. ఎందుకంటే, ఈ సినిమా పూర్తి స్థాయి కుటుంబకథా చిత్రం. గతంలో మా బ్యానర్‌ నుంచి వచ్చిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శతమానం భవతి’ వంటి కుటుంబకథా చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే విధంగా ప్రేక్షకుల్ని అలరించనుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని సంక్రాంతి వారసుడిని చేయాలనే నా ప్రయత్నం. నా నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారు. నేనొక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదు. అందరూ ఎప్పుడూ నన్నే విమర్శిస్తుంటారు. ‘పండ్లున్న చెట్టుకేగా రాళ్ల దెబ్బలు’’

‘‘తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్‌ కానుంది. సినిమా కథ బాగుంటే ఏ భాషలోనైనా ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. ‘కాంతార’, ‘లవ్‌టుడే’ చిత్రాలు అందుకు నిదర్శనం. సినిమా చూశాక.. మంచి చిత్రాన్ని చూశామనే భావనతో తెలుగు ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. ఇది దిల్‌రాజు బ్రాండ్‌. పూర్తి నమ్మకంతో చెప్పగలను. ఈ సినిమాతో ఒక కొత్త పాయింట్‌ను చెప్పనున్నాం. సినిమా చూసి వచ్చేటప్పుడు ఆ పాయింట్‌ మాత్రమే ప్రేక్షకులకు గుర్తు ఉంటుంది’’ అని దిల్‌ రాజు తెలిపారు.

తెలుగు పరిశ్రమలో దిల్‌రాజును కార్నర్‌ చేస్తున్నారని బయట టాక్‌?

దిల్‌ రాజు: నన్నెవరు కార్నర్‌ చేస్తారు? అందులో నిజం లేదు. నా దృష్టిలో అన్నింటికంటే గొప్పది సినిమా. నా బిజినెస్‌ను నేను చేసుకుంటున్నా. దీనిని తెలుగు వరకూ పెద్ద స్టార్‌ సినిమాగా చూడను. విజయ్‌ సినిమాగానే చూస్తా.

తెలుగు వెర్షన్‌ కాపీ ఇంకా పూర్తి కాలేదని వార్తలు వస్తున్నాయి?

దిల్‌ రాజు: అందులో ఏమాత్రం నిజం లేదు. తెలుగు వెర్షన్‌ కాపీ ఎప్పుడో పూర్తైంది. ఈరోజు సెన్సార్‌కు వెళ్తే.. రేపు ఉదయానికే నా చేతిలో సర్టిఫికేట్‌ ఉంటుంది. కాకపోతే నేను విడుదల చేయకూడదనుకుంటున్నా. చిరంజీవి, బాలకృష్ణ నా హీరోలు. వాళ్లకు నా వల్ల ఒక్కశాతం కూడా ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు.

చివరి నిమిషంలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?

దిల్‌ రాజు: చివరి నిమిషంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. బాలయ్య, చిరు సినిమాలకు నా సినిమా పోటీ కాదు అని ఎప్పుడో చెప్పాను. నేను ఎప్పటికీ పాజిటివ్ నిర్ణయాలే తీసుకుంటా. నా వల్ల ఎదుటివాళ్లకు ఇబ్బంది కలగకూడదనే అనుకుంటా.

ఈ నిర్ణయం ముందే తీసుకోవచ్చు కదా?

దిల్‌ రాజు: ఇలాంటి నిర్ణయం అప్పుడే తీసుకుంటే దిల్‌రాజు ముందే తగ్గిపోతాడు కదా. ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో వంటి డైలాగ్స్‌ పవన్‌కల్యాణ్‌ ఊరికే చెప్పలేదు.

ఫిబ్రవరి 17న కూడా మీ ‘శాకుంతలం’ వస్తోంది. అదే రోజు వేరే సినిమాలు కూడా ఉన్నాయి. మరి, అక్కడ కూడా ఏదైనా మార్పులు చేస్తారా?

దిల్‌ రాజు:100 శాతం. ఆరోజు గీతాఆర్ట్స్‌, సితార సినిమాలు ఉన్నాయి. మా మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి వివాదాలు లేకుండా మేము సమస్యను పరిష్కరించుకుంటాం.

దిల్‌రాజు అనేది ఒక బ్రాండ్‌ అని అందరూ అనుకోవచ్చు. కానీ నా దృష్టిలో అన్నింటికంటే, అందరికంటే సినిమా గొప్పది. మనం తీసిన సినిమా ఆడినప్పుడే మనం పెద్దవాళ్లం. సినిమా ఆడకపోతే మీరు ఎన్నో మాటలు అంటారు. నేను ఏదైనా ప్రాక్టికల్‌గా మాట్లాడతా. అప్పుడే ముందుకు వెళ్తాను.

తమిళంలో విజయ్‌, అజిత్‌ ఇద్దరూ స్టార్‌ హీరోలే. అలాంటప్పుడు ఈ రెండు సినిమాలు తమిళంలో ఒకేరోజు విడుదలైతే కలెక్షన్స్‌లో ఇబ్బందులు ఉండవా?

దిల్‌ రాజు: ‘తునివు’ నిర్మాత, నేనూ మాట్లాడుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. వస్తే రెండూ 11న రావాలి. లేదా 12న రావాలి. అక్కడ 800 థియేటర్లు మాత్రమే ఉన్నాయి. వాటికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నాం.

డబ్బింగ్ సినిమా కదా.. కొన్నిరోజులు ఆగి విడుదల చేసుకోవచ్చు కదా అని టాక్‌..?

దిల్‌ రాజు: అలా ఎవరైనా మాట్లాడతారా. మన సినిమాలను కూడా అలాగే చేద్దామా? తర్వాత రామ్‌చరణ్‌తో నా సినిమా ఉంది. ఈ చిత్రాన్ని వేరే రాష్ట్రాల్లో విడుదల చేయవద్దా? నిర్మాతల ఛాంబర్‌ నిర్ణయం ఏమిటంటే.. మొదట తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నేను కూడా ఇప్పుడు అదే కదా చేస్తున్నది. నేను ఎంతో రిస్క్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా. నా జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అయితే పర్వాలేదు. ఒకవేళ నా జడ్జిమెంట్‌ తప్పితే నా పరిస్థితి ఏమిటి.

విజయ్‌ను ప్రమోషన్స్‌ కోసం ఇక్కడికి తీసుకువస్తారా?

దిల్‌ రాజు: విజయ్‌ను అడిగాను. తప్పకుండా ఆయన్ని తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తా. ప్రమోట్‌ చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని