veeran review: రివ్యూ: వీరన్‌.. మనిషిపై పిడుగు పడితే ఎలాంటి శక్తులు వచ్చాయి!

Veeran Review: హిప్‌ హాప్‌ తమిళ కీలక పాత్రలో నటించిన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘వీరన్‌’ ఎలా ఉందంటే?

Updated : 01 Jul 2023 17:03 IST

veeran review; చిత్రం: వీరన్‌; నటీనటులు: హిప్‌హాప్‌ తమిళ, వినయ్‌ రాయ్‌, అథిరా రాజ్‌, ఆర్‌.బద్రీ, బోస్‌ వెంకట్‌ తదితరులు; సంగీతం: హిప్‌హాప్‌ తమిళ; సినిమాటోగ్రఫీ: దీపక్‌ డి.మేనన్‌; ఎడిటింగ్‌: ప్రసన్న జీకే; నిర్మాత: టి.జి.త్యాగరాజన్‌, సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌; రచన, దర్శకత్వం: ఏఆర్‌కే శరవణ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌వీడియో

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌ హీరో మూవీస్‌ తక్కువ. పురాణాలు, ఇతిహాసాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నా, వాటిలో ఒకట్రెండు మాత్రమే మన దర్శకులు అక్కున చేర్చుకున్నారు. ఈ క్రమంలో సరికొత్త కథలతో యువ దర్శకులు ప్రయోగాలు చేస్తున్నారు. అలా తమిళంలో తెరకెక్కిన చిత్రమే ‘వీరన్‌’ (Veeran Review). సంగీత దర్శకుడు హిప్‌హాప్ తమిళ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సూపర్ హీరో ఏం చేశాడు?

కథేంటంటే: కుమరన్‌ (హిప్‌హాప్‌ తమిళ) 15ఏళ్ల వయసులో పిడుగుపాటుకు గురవుతాడు. ఆ షాక్‌ నుంచి తేరుకున్న తర్వాత అతడికి కొన్ని శక్తులు వచ్చినట్లు గ్రహిస్తాడు. అయితే, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పడు. చదువుకుని ఉద్యోగం కోసం సింగపూర్‌ వెళ్లిపోతాడు. ఒకరోజు సడెన్‌గా ఊరికి తిరిగి వస్తాడు. ఆ సమయంలో ఆ ఊరి నుంచి అతి శక్తిమంతమైన ఆప్టిక్‌ కేబుల్‌ వెళ్లడం గమనిస్తాడు. దాని వల్ల భవిష్యత్‌లో తన ఊరికి ప్రమాదం ఉందని గ్రహిస్తాడు. ఇంతకీ ఆ కేబుల్‌ వల్ల వీరాపురం గ్రామానికి జరిగే నష్టం ఏంటి? దాన్ని అడ్డుకునేందుకు స్నేహితులతో కలిసి కుమరన్‌ ఏం చేశాడు? (Veeran Review in telugu) తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సాధారణ మానవుడు కొన్ని అసాధారణ పనులు చేయగలిగితే అతడినే సూపర్‌ హీరో అంటారు. హాలీవుడ్‌ సినిమాల్లో ఈ పాత్రలకు లెక్కలేదు. దర్శకుడు ఏఆర్‌కే శరవణ్‌ కూడా  అలాంటి సూపర్‌ హీరోనే ఎంచుకుని మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంలో పర్వాలేదనిపించాడు. బలమైన కథ కాకపోయినా, సూపర్‌ హీరో చేసే చిన్న మేజిక్‌లు, కొన్ని సాహసాలు అలరిస్తాయి. ముఖ్యంగా చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హీరో పాత్రకు ఆ ఎలిమెంట్స్‌ లేకపోయి ఉంటే ఒక సాధారణ మాస్‌ మసాలా మూవీ అయి ఉండేది. మెరుపుదాడికి గురైన కుమరన్‌ గురించి చిన్న ఫ్లాష్‌ బ్యాక్‌ చెప్పి, నేరుగా కథలోకి తీసుకొచ్చేశాడు దర్శకుడు. ఊరికి రాగానే శక్తిమంతమైన కేబుల్‌ను కుమరన్‌ చూడటం, దాని వల్ల భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అతడికి కలగా రావడం ఇలా వరస సన్నివేశాలతో ప్లాట్‌ పాయింట్‌కు తీసుకొచ్చాడు. చేతులతో మెరుపులు సృష్టించడం, చిటికె వేసి మనుషులను హిప్నటైజ్‌ చేయడంలాంటి కొన్ని శక్తులను కుమరన్‌ స్నేహితులకు చూపిస్తాడు. దీంతో మన హీరో దగ్గర ఉన్న సరకేంటో ప్రేక్షకుడికి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలోనే కేబుల్‌ వేయడానికి అడ్డంకిగా ఉన్న వీరుడి గుడిని పడగొట్టడానికి కార్పొరేట్‌ కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. దీంతో మన సూపర్‌ హీరో రంగంలోకి దిగి, తన శక్తులతో వారిని బెదరగొడతాడు. వీరుడి గెటప్‌లో ముసుగు ధరించి కుమరన్‌ వచ్చే ఆ సన్నివేశాలు కాస్త ఆసక్తిగా సాగుతాయి. గుడి ఉన్న ప్రాంతాన్ని కంపెనీ పేరు మీద రాసేందుకు అధికారి యత్నించే సీన్‌, దాన్ని పడగొట్టేందుకు వచ్చిన విలన్‌ తమ్ముడు తిరు (ఆర్‌.బద్రి)తో డ్యాన్స్‌ చేయించడం తదితర సన్నివేశాలు నవ్వులు పంచుతాయి.

‘వీరుడు’ గుడిని పడగొట్టడానికి వెళ్తున్న తమని అడ్డుకునేది దైవ శక్తి కాదని, ఊళ్లోనే ఎవరో ఇలా చేస్తున్నారని తిరుకు అనుమానం రావడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. అయితే ఎప్పట్లాగే కుమరన్‌ తన శక్తితో తిరు స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తమ్ముడు తిరు పరిస్థితి తెలుసుకున్న అసలు విలన్‌ శరత్‌ (వినయ్‌ రాయ్‌) అప్పుడు గానీ రంగంలోకి దిగడు. ఇక్కడి నుంచి కథ మరింత రసవత్తరంగా సాగుతుందనుకుంటే, దర్శకుడు సినిమాను త్వరగా చుట్టేసే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఒక రొటీన్‌ క్లైమాక్స్‌తో సినిమాను ముగిస్తాడు. అయితే, వీరుడి గుడి కింద ఉన్న విగ్రహ రూపం చూపించే సన్నివేశంతో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. ఇలాంటి సినిమాలకు భావోద్వేగాలు ఎంత పండితే సినిమాలో ప్రేక్షకుడు అంత లీనమవుతాడు. కానీ, నటులు మున్షికాంత్, కాళీ వెంకట్‌లతో దర్శకుడు ఎక్కువగా కామెడీ చేయించి, ఎమోషనల్‌ సీన్స్‌ ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం చేశాడు. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ చూడాలనుకుంటే ‘వీరన్‌’ ప్రయత్నించవచ్చు. (Veeran Review) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

ఎవరెలా చేశారంటే: ఈ సినిమాలో ఒకట్రెండు పాత్రలు మినహా తెలుగు వారికి ఎవరూ పరిచయం లేదు. కథానాయకుడు హిప్‌హాప్‌ తమిళ కూడా మనకు సంగీత దర్శకుడిగానే పరిచయం. వీరన్‌ పాత్రను బాగానే చేశాడు. మనుషులు దవ్రంలా మారిపోయే ఇంజెక్షన్స్‌ ఇస్తూ చంపేసే ఓ పెద్ద సైంటిస్ట్‌లా ప్రతినాయకుడు వినయ్‌రాయ్‌ని చూపించారు. ఆ పాత్ర అంత బలంగా ఏమీ లేదు. మొదట్లో ఓ ఐదు నిమిషాలు కనిపిస్తాడు. ఆ తర్వాత మధ్య మధ్యలో నేనున్నానంటూ పలకరిస్తుంటాడు. చివరి అరగంటలోనే ఆ పాత్ర పూర్తిగా తెరపైకి వస్తుంది. మిగిలిన నటీనటులు ఎవరూ పెద్దగా తెలియదు. సాంకేతికంగా సినిమా ఓకే. దర్శకుడు ఏఆర్‌కే శరవణ్‌ ఎంచుకున్న కథేమీ కొత్తది కాదు. ఒక ఊరి సమస్యను తీసుకుని, దాన్ని కాపాడే కథానాయకుడికి కొన్ని శక్తులు ఇవ్వడంతో ఓ కొత్త ట్రీట్‌మెంట్‌ ఇచ్చాడు. బలమైన కథ లేకపోయినా అందులోని పాత్రల ద్వారా నవ్వులు పంచడంలో మాత్రం విజయం సాధించాడు. అక్కడక్కడా మలయాళ చిత్రం ‘మిన్నల్‌ మురళి’ ఛాయలు కనిపిస్తాయి. ఇక ఇలాంటి సినిమాలకు లాజిక్‌లు వెతక్కుండా చూస్తే చక్కగా ఆస్వాదించవచ్చు.

  • బలాలు
  • + హీరో పాత్ర
  • + కామెడీ సీన్స్‌
  • బలహీనతలు
  • - బలమైన కథ లేకపోవడం
  • - ప్రతినాయకుడి పాత్రను తీర్చిదిద్దిన విధానం
  • చివరిగా: ‘వీరుడు’ ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతాడు!(Veeran Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని