
Vijay Deverakonda: ఆ మనిషి నేనే..! ఆ గొంతు నాది కాదు..!
తొలిసారి వైరల్ అయిన వీడియోపై స్పందించిన విజయ్ దేవరకొండ
ఇంటర్నెట్ డెస్క్: పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’తో ప్రేక్షకులను పలకరించనున్న హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ నిజాన్ని బయటపెట్టాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంలో ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. షోలో విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియోని బాలకృష్ణ ప్లే చేశారు. గతంలో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ‘‘మేం చూసేది విజయ్‌నేనా..?’’ అంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దీని గురించి మాట్లాడుతూ.. ‘‘అందులో కనిపించే మనిషిని నేనే.. కానీ గొంతు నాది కాదు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు పుట్టపర్తి ఆశ్రమంలో పెరిగా. అక్కడి స్వామి గురించి ‘పుట్టపర్తి సాయి దివ్య కథ’ పేరుతో టీవీ సీరియల్ తీశారు. కొందరు పిల్లల్ని సీరియల్ షూటింగ్‌కి తీసుకెళ్లారు. డైలాగ్ చెప్పే సామర్థ్యం ఉన్న వారికి ఆ అవకాశమిచ్చారు’’ అంటూ దాని వెనుకున్న అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఇక ఈ వీడియో ప్రదర్శించడానికి ముందు.. బాలకృష్ణ ఈ బాలనటుడికి అవకాశమిస్తానని చమత్కరించారు. అనంతరం.. ఈ బాలుడు అవతల వాళ్లకి డైలాగ్స్ లేకుండా చేస్తాడన్న విషయం తెలియదేమోనంటూ విజయ్‌ని ఆటపట్టించారు. మరో పక్క దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో గురించి తెలియదంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.