Virupaksha: ‘విరూపాక్ష-2’ తప్పకుండా తీస్తా.. కానీ..: కార్తిక్‌

‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు కార్తిక్‌ వర్మ దండు. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘విరూపాక్ష-2’ ఉండనుందని చెప్పారు. 

Updated : 30 Apr 2023 16:09 IST

హైదరాబాద్‌: సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej), సంయుక్త (Samyuktha) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). ఇటీవల తెలుగులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి.. సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ఆదివారం ‘విరూపాక్ష’ టీమ్‌ థ్యాంక్యూ మీట్‌ ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా ‘విరూపాక్ష-2’ (Virupaksha 2) గురించి దర్శకుడు కార్తిక్‌ వర్మ దండు (Karthik Dandu) క్లారిటీ ఇచ్చారు. పార్ట్‌-2 తప్పకుండా ఉంటుందని చెప్పారు. ‘‘మా చిత్రానికి మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుందంటే.. అందుకు ప్రధాన కారణం కథ. ఈ కథ రాసిన రోజుల్లో ముగ్గురు స్నేహితులు అండగా నిలిచారు. వాళ్లకు థ్యాంక్యూ. అక్కడి నుంచి మొదలైన ఈ సినిమా ప్రయాణం సుకుమార్‌ వద్దకు చేరుకుంది. ఆయనే స్క్రీన్‌ప్లే రాశారు. ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాం. నిర్మాతలు, హీరో సాయితేజ్‌.. అందరూ నన్ను నమ్మి ఈ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చారు. కమల్‌ కామరాజుకు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పాలి. పరిచయ సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సమయంలో ఏదో మిస్‌ అవుతున్న ఫీల్‌ వచ్చింది. కమల్‌ను గుండులో చూపిస్తే.. అని నేనూ మా సినిమాటోగ్రాఫర్‌ మాట్లాడుకున్నాం. కమల్‌ ఆ మాటలు విని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయి క్లీన్‌ షేవ్‌ చేసుకుని వచ్చాడు. చూసి నేను షాక్‌ అయ్యాను. అందుకు ఆయనకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. కంటెంట్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ చేయడానికి అంగీకరించిన తేజు.. మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన సంయుక్తకు ధన్యవాదాలు. పార్ట్‌ 2 ఉంటుంది. ‘విరూపాక్ష’ ప్రభావం నుంచి ప్రేక్షకులు బయటకొచ్చే సమయానికి పార్ట్‌-2 తీస్తాను. ఇక, మా చిత్రాన్ని త్వరలో వేరే భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. మే 5న తమిళం, మలయాళం, హిందీలో రిలీజ్‌ కానుంది. మే12న కన్నడలో విడుదల చేస్తాం’’ అని కార్తిక్‌ వివరించారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దిల్‌రాజు (Dilraju) మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి నేను నైజాం, వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌గా రాలేదు. ‘విరూపాక్ష’ను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన చిత్రబృందాన్ని మెచ్చుకోవాలని వచ్చాను. ట్రైలర్‌ విడుదల రోజే చెప్పాను.. ఇది తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందని. అప్పట్లో వెంకీ.. ఇప్పుడు కార్తిక్‌.. ఇలా కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోన్న నిర్మాతలకు ధన్యవాదాలు చెప్పాలి. తేజుతో నేను మూడు సినిమాలు చేశాను. ‘విరూపాక్ష’తో ఈ నిర్మాతలు నాకొక ఛాలెంజ్‌ విసిరారు. ‘తేజు కెరీర్‌లోనే ఇది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. దీని తర్వాత నేను తేజుతో సినిమా చేస్తే దీన్ని మించే విధంగా చేయాలనే పరిస్థితి తెచ్చారు’’అని దిల్‌రాజు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని