HongKong: అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న గాయత్రి

హాంగ్‌కాంగ్‌లోని లాంటౌ ద్వీపం తుంగ్‌చుంగ్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజీవ్‌ ఈయుణ్ణి, అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది.

Published : 09 Jan 2024 19:02 IST

హాంగ్‌కాంగ్‌: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ‘ది హాంగ్‌ కాంగ్‌ తెలుగు సమాఖ్య’ జనవరి 6న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. హాంగ్‌కాంగ్‌లోని లాంటౌ ద్వీపం తుంగ్‌చుంగ్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాజీవ్‌ ఈయుణ్ణి, అపర్ణ కంద దంపతుల కుమార్తె గాయత్రి ఈయుణ్ణి సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. రాజేశ్వరి సాయినాథ్‌ శిష్యరికంలో గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో అరంగ్రేటం చేసిన గాయత్రి.. అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని.. ఇటీవల, వారధి ఫౌండేషన్ (హైదరాబాద్), శ్రుతిలయ కేంద్ర నటరాజలయ (హైదరాబాద్) వారి సహకారంతో హాంగ్ కాంగ్ లో ‘‘మార్గం’’ అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా శాస్త్రీయ నృత్యం భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతంలో రాణిస్తున్న యువ కళాకారిణి గాయత్రి సోలో రిసైటల్ ఏర్పాటు చేశారు. తాజాగా అందులోని కొన్ని సన్నివేశాలను ఆమె మరోసారి ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన హాంగ్‌కాంగ్‌, మకావూలోని భారత్‌ కాన్సులేట్‌ జనరల్‌...గాయత్రికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

దీప ప్రజ్వలన అనంతరం గాయత్రి కర్ణాటక సంగీతంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆమె తల్లి అపర్ణ, ప్రతి నాట్య అంశాన్నీ వివరిస్తూ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ తర్వాత  భరతనాట్య వేషధారణలో గాయత్రి సంప్రదాయ ఆవాహన, పుష్పాంజలి, అల్లారిపు, దేవీ స్తుతి, ముద్దుగారే యశోద, తిల్లానా, మంగళం తదితర అంశాలని అద్భుతంగా ప్రదర్శిస్తూ.. అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత విద్వాంసులు ఉస్తాద్ ఘులాం సిరాజ్, కథక్ గురువులు నీశ ఝవేరి, శ్వేత రాజ్ పుత్‌, భరతనాట్యం గురువు సంధ్య గోపాల్, మోహినియాట్టం గురు దివ్య అరుణ్, మృదంగం కళాకారుడు అరవింద్ జేగాన్ పాల్గొన్నారు. ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి స్పందిస్తూ.. గాయత్రి ప్రదర్శన తమ సమాఖ్య లక్ష్య నిజమైన ప్రతిబింబమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని