‘కొత్త కవిత’ అంతర్జాతీయ కవి సమ్మేళనం

అంతర్జాలం వేదికగా ఇటీవల నిర్వహించిన ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ

Published : 05 Aug 2021 19:41 IST

సింగపూర్‌: అంతర్జాలం వేదికగా ఇటీవల నిర్వహించిన ‘అంతర్జాతీయ కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్‌ల ఆధ్వర్యంలో డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి, అమెరికా సహకారంతో 12 గంటలపాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు కవయిత్రులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు.

అందరినీ అలరించిన ఈ కార్యక్రమానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, సాహితీవేత్త, కె.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేసి  ప్రారంభోపన్యాసం అందించారు.  గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుంచి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని, కార్యక్రమానికి శుభాభినందనలు తెలియజేశారు.

కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు మాట్లాడుతూ ‘వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న ‘కొత్త కథలు’ సంకలనంలాగానే, ఈ సంవత్సరం నుంచి ‘కొత్త కవిత’ అనే కవితా సంకలనం తీసుకురావాలనే సంకల్పంతో డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతిని పురస్కరించుకొని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చదివిన కవితలన్నీ, కవితా సంకలనంగా డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి సహకారంతో ముద్రిస్తామన్నారు.

భారతదేశం నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి కవితా నివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, ఉగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుంచి ఎంతో మంది కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషంగా అందరినీ ఆకర్షించింది. కార్యక్రమ సహ నిర్వాహకులు శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ సింగపూర్ నుంచి తొలిసారి ఈ కార్యక్రమంలో 14 మంది కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో ప్రారంభ సమావేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,తూర్పు ఆసియా దేశాల కవితా పఠనం కొనసాగగా,  ఆఫ్రికా ఐరోపా ఖండాల వారికి పీసపాటి జయ, మధ్య ఆసియా దేశాలవారికి కొండూరు కళ్యాణి, కెనడా వారికి రాయవరపు లక్ష్మి, అమెరికా వారికి నోరి రాధిక సహవ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఈ కార్యక్రమానికి మరింత వన్నె చేకూర్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు