Updated : 26 Aug 2021 09:15 IST

అమెరికాలో చదువుకు.. విద్యార్థుల్లో పెరిగిన ఆసక్తి

గతేడాది 2 లక్షల మంది చేరిక
ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ రికార్డు స్థాయిలో వీసాలు జారీ
విద్యాసంస్థల్లో కరోనా నివారణకు  ప్రత్యేక ఏర్పాట్లు
‘ఈనాడు’తో అమెరికా కాన్సులేట్‌ అధికార ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్‌
ఐ.ఆర్‌.శ్రీనివాసరావు ఈనాడు, హైదరాబాద్‌

అమెరికాలో ఉన్నత విద్య చదివేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగిందని ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ అధికార ప్రతినిధి ఫ్రాంకీ స్టర్మ్‌ వెల్లడించారు. కరోనా పరిస్థితులున్నా విద్యార్థుల సంఖ్య తగ్గలేదన్నారు. గతేడాది భారత్‌ నుంచి సుమారు 2 లక్షల మంది వరకు విద్యార్థులు విద్యాసంస్థల్లో చేరారని, గతంలో ఎన్నడూ లేనంత భారీ సంఖ్యలో ప్రస్తుతం విద్యార్థి వీసాలు జారీ చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం శుక్రవారం (27న), ఆ తరవాతి శుక్రవారం (సెప్టెంబరు 3న) వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..

ప్రస్తుతం నెలకొన్న కరోనా సవాళ్ల మధ్య అమెరికాలో ఉన్నత విద్య   చదువుకునే విద్యార్థుల స్పందన   ఎలా ఉంది?
జ: కరోనా సృష్టించిన సవాళ్లను అధిగమించడం ప్రజలకే కాదు.. ప్రభుత్వాలకూ తలకు మించిన భారంగా మారింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. యూఎస్‌ఏలో చదువుకోవాలన్న ఆసక్తి విద్యార్థుల్లో ఎక్కువగానే ఉంది. 2019-20 సంవత్సరంలో 10,75,496 మంది విదేశీ విద్యార్థులు చదువుల కోసం యూఎస్‌ఏ వచ్చారు. వారిలో 2 లక్షల మంది వరకు భారతీయులే. ప్రస్తుత విద్యా సంవత్సరంలోని ఫాల్‌ సీజన్‌ (ఆగస్టు-సెప్టెంబరు)లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపే విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో వీసాలు జారీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 55 వేల మంది వీసాలు పొందారు. కరోనా పరిస్థితుల్లోనూ అమెరికాలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని ఈ గణాంకాలే చెబుతున్నాయి.

అమెరికాలో మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలను కల్పిస్తున్నారు?
జ: కొన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పటికే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాయి. మరికొన్ని వర్సిటీలు హైబ్రీడ్‌ విధానంలో తరగతులను నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రతి ప్రాంగణంలో కరోనా పరీక్షల కేంద్రాలు, అత్యవసరమైతే క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. వ్యాక్సిన్‌ వేసేందుకూ సదుపాయాలను కల్పించాయి. విద్యార్థులు
https:// www.cdc.gov  ద్వారా కొవిడ్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రస్తుత సీజనులో అమెరికా వెళుతున్న విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ ఫేస్‌బుక్‌, ఆన్‌లైన్‌ సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నాం.

గత విద్యాసంవత్సరంలో చేరిన విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులే వినాలా? అమెరికాకు వెళ్లి ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే అవకాశం ఉందా?
జ: గత సంవత్సరం చేరిన విద్యార్థులు ఇప్పుడు నిస్సందేహంగా అమెరికా వెళ్లొచ్చు. గత విద్యాసంవత్సర ప్రారంభ సమయంలో కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేదు. ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమయ్యాయి. మిగిలిన సెమిస్టర్ల పూర్తి కోసం యూఎస్‌ఏ వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం వీసాలు జారీ చేస్తోంది.

వర్చువల్‌ ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ద్వారా విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
జ: వర్చువల్‌ ఫెయిర్‌ను రెండు దశల్లో నిర్వహిస్తున్నాం. మాస్టర్స్‌, పీహెచ్‌డీ చేయాలనుకునే వారికి శుక్రవారం (27న) భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఉంటుంది. డిగ్రీ తదితర కోర్సులు చదువుకునే వారి కోసం సెప్టెంబరు 3వ తేదీన నిర్వహిస్తున్నాం. సుమారు వంద విశ్వవిద్యాలయాలు ఇందులో పాల్గొంటాయి. ఏయే సబ్జెక్టులకు డిమాండు ఉంది, ఆ తరవాత ఉపాధి అవకాశాలు ఎలా ఉండనున్నాయి, ఫీజులు ఎలా ఉంటాయి, ఉపకార వేతనాలు పొందటం ఎలా, వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. తదితర అంశాలను వివరిస్తారు. భవిష్యత్తులో అమెరికాలో పిల్లలను చదివించాలనుకునే తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. కన్సల్టెంట్లను ఆశ్రయించే పరిస్థితి లేకుండా దీని ద్వారా పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. వర్చువల్‌ ఫెయిర్‌లో పాల్గొనేవారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. రిజిస్ట్రేషన్‌ మాత్రం చేసుకోవాలి. మాస్టర్స్‌, పీహెచ్‌డీ విద్యార్థులు
 https://bit.ly/EdUSAFair21EmbWeb ,  డిగ్రీ తదితరాలు చదువాలనుకునే వారు https://bit.ly/UGEdUSAFair21EmbWeb ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పేర్లు నమోదు చేసుకున్న వారి ఈ మెయిల్‌కు వర్చువల్‌ ఫెయిర్‌లో పాల్గొనేందుకు అవసరమైన సమాచారం వస్తుంది.
మంచి విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోవడం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జ: అమెరికాలో 4,700 వరకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఉన్నాయి. అక్రిడిటేషన్‌ ఉన్న సంస్థలను ఎంచుకోవాలి. కన్సల్టెంట్లను ఆశ్రయించే బదులు ‌
www.petersons.com, www.edupass.org, http://ncs.ed.gov/collegenavigator, https://educartionusa.state.gov/your-5-stemps-us-study/research-your-options వెబ్‌సైట్లు పరిశీలించి అర్హతల వివరాలు తెలుసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా విద్యార్థులు usiefhyderabad@usief.org.in లేదా  hyderabad@educationusa.org  మెయిల్‌ అడ్రస్‌కు ఈ-మెయిల్‌ పంపి తమ అనుమానాలను నివృత్తి  చేసుకోవచ్చు.

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని