TANA: తానా 23వ మహాసభల నిర్వహణ, సమన్వయ కమిటీల ఏర్పాటు

జులై 7 నుంచి 9వరకు ఫిలడెల్ఫియా జరిగే తానా మహాసభలకు కమిటీలను ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో తెలుగు ప్రవాసీయులు తరలివచ్చి తన పేర్లు నమోదు చేశారు.

Published : 25 Jan 2023 17:35 IST

అమెరికా: ప్రవాస తెలుగు సంఘాల్లో ప్రథమ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వైవార్షిక మహాసభల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు జాతి ఖ్యాతి, సంస్కృతి, సంప్రదాయాలను ఉత్తర అమెరికా తెలుగు ప్రజల ముంగిటకు తీసుకొచ్చే ప్రవాస తెలుగువారి సంబరాలు తానా మహాసభలు. ప్రతి రెండేళ్లకొకసారి అంగరంగ వైభవంగా జరిగే తానా మహాసభలకు కరోనా కారణంగా 2021లో అంతరాయం ఏర్పడింది.దీంతో  ఏడాది జులై 7 నుంచి 9వరకు ఫిలడెల్ఫియా నగరంలో నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మహాసభల కోసం అటు ఉత్తర అమెరికాలో, ఇటు భారతదేశంలోని తెలుగువారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

23వ తానా మహాసభల కోసం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం కాలేజీవిల్ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ ఆడిటోరియంలో  జనవరి 22న ఆదివారం తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి శంఖం పూరించగా.. మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి సారథ్యంలో మహాసభల సమన్వయ కమిటీల నియామకాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తెలుగు భాష, సంస్కృతి, మాతృభూమిపై మక్కువ కలిగిన 300 మందికి పైగా తానా సభ్యులు ‘మేము సైతం’ అంటూ అమ్మలాంటి తానా కోసం అంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మహాసభల్ని విజయవంతం చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 23వ తానా మహాసభలను విజయవంతంగా నిర్వహించడానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, సమన్వయకర్త రవి పొట్లూరి మహాసభల ముఖ్య కమిటీల గురించి వివరించి, బాధ్యులను ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారి వివరాలు నమోదు చేసుకుని వారికి కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు.

మహాసభల కార్యదర్శిగా సతీష్ తుమ్మల, కోశాధికారిగా భరత్ మద్దినేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్‌గా వంశీ కోట, జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్లకు భాద్యతలు ఇచ్చారు. తానా మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముప్పైకు పైగా కమిటీలను ప్రకటించారు. ఈ సందర్బంగా అక్కడకి విచ్చేసిన తెలుగువారిలో కొందరు ఫిలడెల్ఫియాలో 2001లో జరిగిన 13వ తానా మహాసభల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కోగంటి, వంశీ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని