Vinukonda: వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత.. గాల్లోకి సీఐ కాల్పులు

పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా-తెదేపా వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది.

Updated : 27 Jul 2023 14:09 IST

వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా-తెదేపా వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు.

వివరాల్లోకి వెళితే.. తెదేపా సీనియర్‌ నేత, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు రాగానే వారికి వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎదురుపడ్డారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్ధమంటూ తన వాహనం దిగి మరీ తెదేపా నేతలకు ఆయన సవాల్‌ విసిరారు. గనుల అక్రమ తవ్వకాలు చేపట్టారంటూ బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. 

తెదేపా శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. అక్కడి నుంచి వెళ్లాలని వారికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసుల తెదేపా కార్యకర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు. తమ నేతపై తప్పుడు కేసులు పెట్టారని.. దీన్ని నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేపడితే అడ్డుకుంటారా? అని తెదేపా కార్యకర్తలు నిలదీస్తున్నారు. సమాచారం అందుకున్న జీవీ ఆంజనేయులు బస్టాండ్‌ వద్దకు చేరుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని