Revanth Reddy: సాగుకు 8 గంటల కరెంటు చాలు

వ్యవసాయానికి రోజూ 8 గంటలసేపు నాణ్యమైన విద్యుత్తు ఇస్తే చాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారం రేపాయి.

Updated : 12 Jul 2023 09:24 IST

పెనుదుమారం రేపిన రేవంత్‌ వ్యాఖ్యలు
విరుచుకుపడిన భారాస మంత్రులు, శ్రేణులు
భారాస వక్రీకరిస్తోందంటూ తిప్పికొట్టిన కాంగ్రెస్‌
విమర్శలు చెలరేగడంతో వివరణ ఇచ్చిన పీసీసీ అధ్యక్షుడు
ఉచిత విద్యుత్‌.. కాంగ్రెస్‌ పేటెంట్‌ స్కీం అని స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయానికి రోజూ 8 గంటలసేపు నాణ్యమైన విద్యుత్తు ఇస్తే చాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్తును తొలగిస్తుందని భారాస ఆరోపించింది. మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు కూడా దీటుగా ప్రతి విమర్శలు చేశారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను భారాస వక్రీకరిస్తోందని తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన సత్యాగ్రహదీక్షను నీరుగార్చేందుకే భారాస దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.ఉచిత విద్యుత్తుపై కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వివాదం చెలరేగిందిలా..

అమెరికాలోని తానా సభలకు హాజరైన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘తెలంగాణ ప్రభుత్వం రైతులకు నిరంతరాయంగా ఉచిత కరెంటు, రైతుబంధు ఇస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తారా, బంద్‌ చేస్తారా’ అని ఒక ప్రవాసుడు ప్రశ్నించగా.. రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. ‘ఎకరానికి నీరివ్వాలంటే వ్యవసాయ బోరుకు ఒక గంటసేపు కరెంటు ఇస్తే సరిపోతుంది. తెలంగాణలో 95 శాతం మంది రైతులకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్నందున అందులో పంటల సాగుకు 3 గంటలసేపు కరెంటు ఇస్తే నీరందించవచ్చు. మొత్తంగా వ్యవసాయానికి రోజూ 8 గంటల సేపు విద్యుత్తు చాలు’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘విద్యుత్‌ సంస్థల దగ్గర కమీషన్ల కోసం కేసీఆర్‌ ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఉచితం అనే పేరుతో అనుచితంగా వ్యవహరించవద్దు. దాన్ని మన స్వార్థానికి వాడుకోవద్దు. ఉచిత కరెంటు విషయంలో కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌లో తెలిపింది’ అని రేవంత్‌ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి తీవ్ర విమర్శలు చెలరేగడంతో రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో, విడిగా వివరణ విడుదల చేశారు. ‘ఉచిత కరెంటు అనేది కాంగ్రెస్‌ పేటెంట్‌ స్కీం. 24 గంటల ఉచిత విద్యుత్‌ ముసుగులో రైతులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను వేలెత్తి చూపించే అర్హత లేదు. భారాస, భాజపాకు బి టీం అని మరోసారి నిరూపితమైంది. రాహుల్‌గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం గాంధీభవన్‌లో సత్యాగ్రహదీక్ష చేపట్టాలని కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపును నీరుగార్చేందుకు ఉచిత విద్యుత్‌పైకి ప్రజల దృష్టిని మరల్చాలని భారాస ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదని ఏ సబ్‌స్టేషన్‌కు వెళ్లినా తెలుస్తుంది. ఈ మోసాలకు నిరసనగా కాంగ్రెస్‌ శ్రేణులు బుధవారం అన్ని మండల కేంద్రాల్లో, సబ్‌స్టేషన్ల ముందు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేయాలి’ అని తెలిపారు.

రేవంత్‌ స్థాయికి మించి మాట్లాడారు: కోమటిరెడ్డి

రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ.. మీడియాకు  వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘వ్యవసాయానికి ఉచిత కరెంటుపై రేవంత్‌ స్థాయికి మించి మాట్లాడారు. ఉచిత విద్యుత్‌ నిర్ణయం ఆయన పరిధిలోనిది కాదు. రైతులకు 3 గంటలు విద్యుత్‌ ఇవ్వాలనడం రేవంత్‌ తప్పే. అమెరికా వెళ్లి ఎందుకలా మాట్లాడారో తెలియదు. సీతక్క సీఎం అవుతారనేది పెద్ద జోక్‌. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతాం’ అని వెంకట్‌రెడ్డి తెలిపారు.

భారాస గోబెల్స్‌ ప్రచారాన్ని నమ్మవద్దు: భట్టి విక్రమార్క

‘ఉచిత విద్యుత్‌ పథకంపై పేటెంట్‌ హక్కు పూర్తిగా కాంగ్రెస్‌దే. మా పార్టీ అధికారంలోకి వస్తే.. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరాను ప్రాధాన్యాంశంగా అమలు చేస్తుంది. లేనిది ఉన్నట్లుగా భారాస నేతలు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు.

వరంగల్‌ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం: జీవన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి భారాస నాయకులు ఆందోళనకు దిగడం అనాలోచితమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో విలేకరులతో అన్నారు. తమ పార్టీ వరంగల్‌ డిక్లరేషన్‌కు కట్టుబడి 24 గంటలూ నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తుందన్నారు.

కేటీఆర్‌ రైతులను రెచ్చగొడుతున్నారు: మధుయాస్కీ

కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతులకు 24 గంటల కరెంట్‌ ఇవ్వటమే మా విధానం. రేవంత్‌ మాటలను భారాస వక్రీకరిస్తోంది. కేటీఆర్‌ రైతులను రెచ్చగొడుతున్నారు. విద్యుత్‌ కొనుగోలు అవినీతిలో కేసీఆర్‌ కుటుంబం పాత్ర ఉంది. అన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద, ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేసి కరెంట్‌ కోతలపై నిలదీయండి’ అన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు కాంగ్రెస్‌ విధాన నిర్ణయం కాదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని