Pawan Kalyan: తెదేపా, జనసేన పొత్తు సూపర్‌ హిట్‌

‘తెలుగుదేశం, జనసేన పొత్తుతో ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. జగన్‌ చెర నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నా.

Updated : 17 Sep 2023 08:58 IST

ప్రజల హృదయాలు గెలుచుకున్నాం
జగన్‌ను సాగనంపాలి.. ఆ తర్వాతే అధికార పంపిణీ
మిత్రపక్షాలతో సమన్వయ బాధ్యతలు మనోహర్‌కు అప్పగిస్తాం
తెదేపా ఒక మాట అన్నా నొచ్చుకోవద్దు.. మాట జారొద్దు
పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్బోధ

ఈనాడు, అమరావతి: ‘తెలుగుదేశం, జనసేన పొత్తుతో ప్రజల హృదయాలు గెలుచుకున్నాం. జగన్‌ చెర నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. జనసేన నాయకులు, శ్రేణులే కాదు- ముక్కు, ముఖం తెలియని ఎందరో ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని మోదీ మద్దతుతో, తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు హర్షించారు. అనేకమంది నుంచి సందేశాలు అందుతూనే ఉన్నాయి. ఎన్నికల సరళిని ప్రభావితం చేసే తటస్థ ఓటర్లు 15-18 శాతం ఉంటారు. వారు జనసేన, తెదేపా పొత్తును స్వాగతించారు’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. రాజకీయాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలనే ఈ నిర్ణయానికి మద్దతిస్తున్నామంటున్నారని, జనసేన స్వార్థంతో కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నామని చెబుతున్నారన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో శనివారం రాత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.

‘‘వైకాపా ఒక పీడ, చీడ. జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ నుంచి బయటకు పంపాల్సిన కీలక తరుణం ఆసన్నమయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. తెదేపా, జనసేన పొత్తుకు తూట్లు పడేలా ఎవరూ వ్యవహరించవద్దు. అధికారంలో వాటా, రాజు ఎవరు మంత్రి ఎవరనేది వైకాపాను ఓడించిన తర్వాత, జగన్‌ను పంపిన తర్వాత ఆలోచిద్దాం. మిత్రపక్షాలతో సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్‌కు అప్పగిస్తాం. భాజపా, తెదేపా నాయకులతో ఆయన సమన్వయం చేసుకుంటారు. ఎవరినీ తక్కువ చేయొద్దు. ఎవరైనా బలహీనంగా ఉన్నారని, జైల్లో ఉన్నారని తక్కువ అంచనా వేయొద్దు.

ఎక్కడా తెలుగుదేశం నాయకులను కించపరచవద్దు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడినంత మాత్రాన మనకు కొమ్ములు రాలేదు. తెదేపా బలమైన పార్టీ. జనసేనకు పోరాటపటిమ గల నాయకత్వం, మహిళలు, సైనికులు ఉన్నారు. ఇవన్నీ సమష్టిగా కలిసి పని చేస్తేనే నియంతను ఎదుర్కోగలం. లోకేశ్‌, బాలకృష్ణ మధ్యలో నిలుచుని మాట్లాడినంత మాత్రాన మనం పెరిగిపోయామని అనుకోకూడదు. మన మద్దతుదారులను కించపరిచేలా, తగ్గించేలా మాట్లాడకండి. పొత్తుకు ప్రజలు సిద్ధమైపోయారు. నాయకులు వ్యక్తిగత ఈగోలకు వెళ్లవద్దు. 40 ఏళ్ల అనుభవం ఉన్న తెదేపా ఒక మాట అన్నా నొచ్చుకోవద్దు. అందరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. వైకాపా నాయకులు రెచ్చగొడుతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఇంకా వైకాపాకు అడ్డగోలుగా కొమ్ముకాస్తే మీ భవిష్యత్తు బాగుండదని గుర్తుపెట్టుకోండి’’ అన్నారు.

ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయొద్దు

‘‘జనసేన- తెదేపా కలిసి పోటీచేస్తున్నాయని వైకాపాను తక్కువ అంచనా వేయొద్దు. ప్రత్యర్థి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తే వారికి బలం, పౌరుషం ఇచ్చినవాళ్లం అవుతాం. విధానాలపైనే మాట్లాడండి. ఈ పొత్తు ఎంత బలంగా, సమష్టిగా ఉండి భాజపాతో కూడా కలిసి ఎంత బలంగా వెళ్తే అంతగా భవిష్యత్తులో వైకాపా అనేది లేకుండా చేయొచ్చు. మనందరి అంతిమ లక్ష్యం అధికారం కాదు.. ప్రజలకు సేవ చేయడమే’’ అని చెప్పారు.

జగన్‌ను సైకియాట్రిస్టుకు చూపించండయ్యా

‘‘జగన్‌ మానసిక స్థితి సరిగా ఉందో లేదో నిర్ధారించుకోవాలి. ఊరికే, సరదాగా చెప్పడం లేదు. చంద్రబాబుకు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్నా ఆయన బయట రోడ్లపై హాయిగా తిరిగేవారు. జైలులో ఖైదీల మధ్య ఉంటే ఆయన భద్రతకు ఇబ్బంది. అయినా బాగానే ఉన్నారు. ఈయనకు ఏం భద్రత సమస్య వచ్చిందని బయటకు వెళ్తే పరదాలు కట్టిస్తారు? చెట్లు కొట్టిస్తారు? జపాన్‌ రాయబారి కెంజీ హిరోమత్‌సోన్‌ 2019లో ఏం చెప్పారో గమనించండి. చట్టబద్ధమైన విద్యుత్తు ఒప్పందాలను వైకాపా ప్రభుత్వం గౌరవించకపోవడంతో అది ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల పరిస్థితులను దెబ్బతీస్తుందని చెప్పారు. జపాన్‌ సహా విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను పరిశీలిస్తున్నారని, వెనకడుగు వేస్తున్నారని అన్నారు. ఆఖరికి జపాన్‌ ప్రభుత్వాన్ని సైతం చికాకుపరిచిన మహానుభావుడు జగన్‌. చూసి కూడా సరిగా చదవలేడు, నన్ను తిట్టాలనుకున్నా చదవలేక ఇబ్బందిపడతాడు. మానసిక ఆరోగ్యం సరిగా లేని మనిషి చేతిలో ఆంధ్రప్రదేశ్‌ భవితవ్యం పెట్టగలమా? ఆయనేదో చేసేస్తాడని వైకాపా నాయకులు అనుకుంటున్నారు. ఆయనది మానసిక బలం కాదు... పిచ్చి అంటారు. వైకాపా నాయకులు ఆయనను సైకియాట్రిస్టుకు చూపిస్తే మేలు. దిల్లీ ఎయిమ్స్‌ నుంచి ఎవరైనా వైద్యుల బృందాన్ని పంపి జగన్‌ మానసిక స్థితిని పరీక్షించేలా చూడాలని నరేంద్ర మోదీని అడగాలనుకుంటున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు.

‘‘2024 ఎన్నికల్లో జనసేన తగినన్ని స్థానాలతో ఏపీ శాసనసభలో అడుగుపెడుతుంది. తెదేపాతో అధికారం ఎలా పంచుకోవాలి? ముఖ్యమంత్రి స్థానమా? మరొకటా అన్నది తర్వాత ఆలోచిద్దాం. పొత్తు కుదిరిపోయిందని పగటి కలలు కనొద్దు. ముందు వైకాపాను ఓడించాలి. ఆ తర్వాతే మిగిలిన చర్చలన్నీ. అంతవరకూ దారి మళ్లొద్దు. జనసేన ఆంధ్రప్రదేశ్‌ దశ, దిశ మార్చేస్తుంది. రాష్ట్ర రాజకీయ స్థిరత్వం, పెట్టుబడులు సంపాదించడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం, శాంతిభద్రతలు మన ప్రాధాన్యాలు. జనసేన పార్లమెంటుకు వెళ్లాలి. విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టివ్‌ మైన్‌ తీసుకువచ్చేందుకు మన గొంతు వినిపించాలి. వలసలు ఆపాలి, మత్స్యకారులకు ఉపాధి చూపాలి. ఉద్యోగులకు భద్రత ఇవ్వాలి. కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలి. మద్యాన్ని నిషేధించం కానీ నియంత్రించేలా, ఆరోగ్యాలు పాడుచేయకుండా ఉండేలా కొత్త విధానం తీసుకువద్దాం’’ అని ఆయన అన్నారు.

ఎన్డీయే నుంచి బయటకు రావడం లేదు

‘మనం ఎన్డీయేలోనే ఉన్నాం. బీజేపీతోనే ఉన్నాం. నరేంద్ర మోదీతోనే ఉన్నాం. జనసేన ఎప్పుడూ ఎన్డీయేలో భాగమే. మనం ఎన్డీయే నుంచి బయటకు రావడం లేదు. మరోసారి మోదీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గెలిచిన మన ఎంపీలు ఎన్డీయేకే మద్దతు ఇస్తారని మాట ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌కు మీ ఆశీస్సులు ఇవ్వండి. ప్రపంచస్థాయి అమరావతి అనే రాజధానిని ఇచ్చారు. ఇక్కడ అభివృద్ధి లేదు, శాంతి లేకుండా అయిపోయింది. ఈసారి మా వైపు చూడండి. రాజమహేంద్రవరంలో ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో దిల్లీ వెళ్లి భాజపా నాయకులు అమిత్‌ షా, నడ్డాలకు చెబుతాను. అది నా బాధ్యత’’ అన్నారు.

‘‘తెలంగాణలోనూ పోటీ చేస్తాం. అక్కడ తెదేపాతో వెళ్లాలా, భాజపాతో వెళ్లాలా అన్నది భవిష్యత్తులో నిర్ణయిస్తాం’’ అని వివరించారు.

‘జగన్‌... నువ్వెంత? నీ బతుకెంత? నువ్వేమైనా దిగొచ్చాననుకుంటున్నావా? ఓడలు బండ్లు కావటం ఎంతసేపు? ప్యాలెస్‌లో కూర్చున్న నిన్ను రోడ్లపైకి లాగటం ఎంతసేపు? నువ్వు క్రిమినల్స్‌ను, అధికారులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని నియంత్రించాలనుకుంటున్నట్లు ఉన్నావ్‌.. నాకు భయం లేదు. జగన్‌కు వత్తాసు పలికే అధికారులను ఒకటే అడుగుతున్నా. మీరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ చదువుకున్నారు కదా! మీరు చేస్తున్న పని మీకు సబబే అనిపిస్తోందా?’ అంటూ నిలదీశారు.

ప్రజలకు కోపమొస్తే కొట్టి చంపేస్తారు జగన్‌

‘జగన్‌... ప్రజలకు కోపమొస్తే నిన్ను కొట్టి చంపేస్తారు. అప్పుడు ఎవరి చేతుల్లోనూ ఏమీ ఉండదు. హైదరాబాద్‌ నుంచి నేను వస్తుంటే ఏపీ సరిహద్దుల్లో ఆపేసి.. ముందుకు రానివ్వలేదు సరికదా.. వెనక్కి వెళ్లిపోమన్నారు. ఎందుకు వెళ్లాలని అడిగితే ప్లీజ్‌ సార్‌ అర్థం చేసుకోండి అన్నారు. అసలు మీరేం అధికారులయ్యా? అమెరికా రాజ్యాంగం వారి అధ్యక్షుడ్ని సైతం శిక్షించగలదు. జగన్‌ సీఎం అయితే కొమ్ములు వచ్చేస్తాయా?’ అని మండిపడ్డారు.

ఏపీకి రావాలంటే పాస్‌పోర్టు, వీసా కావాలా?

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వీసా, పాస్‌పోర్టు తీసుకుని వెళ్లాలని 2009 ఎన్నికల సమయంలో రాజశేఖరరెడ్డి చెప్పారు. తెలంగాణ వచ్చినా అక్కడి నాయకులు మనల్ని ఏమీ అనట్లేదు. కానీ ఆయన కుమారుడు జగన్‌ మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే ఇక్కడి ప్రజలకే పాస్‌పోర్టు, వీసా తీసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు’ అన్నారు.

రాష్ట్ర క్షేమం కోసమే ఆలోచిస్తాను

‘నేను రాష్ట్ర క్షేమం కోసం ఆలోచిస్తానే తప్ప... పొత్తుల కోసం ఆరాటపడను. జగన్‌ సరిగ్గా ఉండుంటే.. పొత్తు గురించి లోకేశ్‌, బాలకృష్ణను పక్కన పెట్టుకుని కూర్చుని మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. నా పొత్తు నిర్ణయాన్ని మీరంతాఆమోదించినందుకు ధన్యవాదాలు. చంద్రబాబు నా బంధువో, స్నేహితుడో కాదు.  ఆయన అనుభవాన్ని అంగీకరిస్తాను. నేను ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా.. భాజపాతో 70 శాతమే ఏకీభవిస్తా. 30 శాతం అంశాల్లో ఏకీభవించాల్సిన అవసరం లేదు’’ అని పవన్‌ స్పష్టం చేశారు.

ప్రజల కోసమే పొత్తు:మనోహర్‌

కష్టాల్లో ఉన్న ప్రజల కోసం నిలబడేందుకు జనసేన పొత్తుల నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ విషయంలో అనుమానాలు సృష్టించుకోవద్దన్నారు.


భాజపా కలసి వస్తుందని ఆశిస్తున్నాం
జనసేన తీర్మానం

ఈనాడు, అమరావతి: వైకాపా విముక్త ఏపీ కోసం జనసేన-తెదేపా చేస్తున్న పోరాటంలో భాజపా కలుస్తుందని ఆశిస్తున్నట్లు జనసేన విస్తృతస్థాయి సమావేశం అభిప్రాయపడింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో రెండు తీర్మానాల్ని నేతలు ఆమోదించారు. ‘రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, యువతకు మేలు చేయాలనే సంకల్పంతోనే... అరాచక వైకాపాను నిలువరించేందుకు, తెదేపాతో కలసి పనిచేయాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారని ఈ సమావేశం భావిస్తోంది. రాష్ట్ర ప్రయోజనం కోసం ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సానుకూల దృక్పథంతో స్వీకరిస్తాం. భాజపా కూడా కలసి వస్తుందని ఆశిస్తున్నాం’ అని మొదటి తీర్మానంలో పేర్కొన్నారు. ‘జి20 సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోదీని సమావేశం అభినందిస్తోంది. భారతీయ సంస్కృతిని చాటుతూ.. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేలా సదస్సు నిర్వహించారు’ అని రెండో తీర్మానంలో కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని