కాంగ్రెస్‌కు కాలం చెల్లింది.. రాజ్యసభలో ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందని, వారంటీ అయిపోయిందని, ఆలోచించే శక్తిని కూడా కోల్పోయి ఆ పనిని వేరెవరికో అప్పగిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు.

Updated : 08 Feb 2024 06:11 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి కాలం చెల్లిందని, వారంటీ అయిపోయిందని, ఆలోచించే శక్తిని కూడా కోల్పోయి ఆ పనిని వేరెవరికో అప్పగిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. ‘ప్రజాస్వామ్య గొంతును నులిమిన పార్టీ, ప్రజా ప్రభుత్వాలను రాత్రికి రాత్రి కొన్ని డజన్లసార్లు కూల్చిన పార్టీ, అన్నివిధాలా దేశాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ ఇప్పుడు భారత్‌ను రెండు ముక్కలు చేయాలని చూస్తోంద’ని ఆరోపించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు బుధవారం రాజ్యసభలో ఆయన సమాధానమిచ్చారు. దాదాపు గంటన్నరసేపు ప్రసంగించి.. కాంగ్రెస్‌ను తూర్పారబట్టారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాంగ్రెస్‌కు తెలుసని, వాటిని పరిష్కరించేందుకు మాత్రం ఏమి చేయలేదని విమర్శించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

భద్రత గురించి మీరు చెప్పడమేంటి?

‘‘కాంగ్రెస్‌లో వారి నేతకే గ్యారంటీ లేదు. విపక్షాల దుస్థితికి కాంగ్రెస్సే కారణం. ఆ పార్టీవన్నీ పనికిరాని ఆలోచనలు. మనదేశ భూభాగాలను శత్రువులకు అప్పగించింది ఆ పార్టీయే. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ప్రభుత్వాలను పడగొట్టింది. అలాంటి కాంగ్రెస్‌.. జాతీయ భద్రత గురించి మాకు పాఠాలు చెబుతోంది. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలవారికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పనిచేసింది. మాజీ ప్రధాని నెహ్రూ.. రిజర్వేషన్లను వ్యతిరేకించారు. అంబేడ్కర్‌ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లే వచ్చేవి కావు.

ఖర్గేకు ఆ స్వేచ్ఛ ఎలా వచ్చిందో?

ఈసారి ఎన్నికల్లో హస్తం పార్టీ 40 స్థానాలు కూడా సాధించలేదని  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల అన్నారు. కనీసం మీరు ఆ 40 సీట్లైనా గెలవాలని నేను కోరుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో మాకు 400 సీట్ల మెజార్టీ వస్తుందని ఖర్గే (రాజ్యసభలో విపక్ష నేత) అంచనా వేశారు. అది మాకు ఆశీర్వాదంగా భావిస్తున్నా. కచ్చితంగా ఆయన అంచనా నిజమవుతుంది. ఆరోజు ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయనకు అంత స్వేచ్ఛ ఎలా లభించిందని నేను ఆశ్చర్యపోయా. ఈసారి కూడా కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే. కొందరు దానిని మోదీ 3.0 సర్కారు అంటున్నారు. ఆ సర్కారులో ‘వికసిత భారత్‌’ పునాదుల బలోపేతానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. 2047 నాటికి భారత్‌ తిరిగి స్వర్ణయుగంలోకి వెళ్తుంది.

ఆయన దేనినీ స్టార్ట్‌ చేయడు

కాంగ్రెస్‌ పార్టీ పదేపదే ఒకే ఉత్పత్తి (రాహుల్‌ను ఉద్దేశిస్తూ)ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తోంది. అందుకే వారి దుకాణం మూతబడుతోంది. వారు తమ యువరాజును స్టార్టప్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ ఆయన దేనినీ స్టార్ట్‌ చేయడు. కాంగ్రెస్‌ పార్టీ తన పనిని అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించింది. బ్రిటిష్‌వారి నుంచి కాంగ్రెస్‌ స్ఫూర్తి పొందింది. దశాబ్దాలుగా బానిసత్వ చిహ్నాలను కొనసాగించింది.

అసలు అదేం భాష..?

జాతీయ నిధులపై రాష్ట్రాలు రాజకీయం చేయడం సరికాదు. రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై మేం సంకుచిత ఆలోచనలు చేయం. ‘మా పన్నులు.. మా డబ్బులు’ అంటున్నారు. అసలు అదేం భాష..? దేశమంటే మన దేహంలాంటిది. ఒక్క భాగం పనిచేయకపోయినా వైకల్యం వస్తుంది. హిమాలయాల నుంచి వచ్చే నీటిని, తమ రాష్ట్రాల్లో ఉన్న బొగ్గును ఇతరులకు ఇవ్వబోమని ఎవరైనా అంటే దేశం పరిస్థితి ఏమవుతుంది? రాష్ట్రాలపై మాకు వివక్ష ఉండదు. స్వతంత్ర భారత్‌లో జన్మించిన నా ఆలోచనలు కూడా స్వతంత్రంగా ఉంటాయి. మేం పీఎస్‌యూలను విక్రయించామని, వాటిని ధ్వంసం చేశామని కాంగ్రెస్‌ విమర్శించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను ఎవరు నిర్వీర్యం చేశారు? హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఎయిరిండియా పరిస్థితికి కారణం ఎవరు?’’ అని మోదీ ప్రశ్నించారు.


మాపై విమర్శలతోనే సరిపోయింది: కాంగ్రెస్‌

‘‘ప్రస్తుత పార్లమెంటులో ప్రధానిది ఇదే చివరి ప్రసంగంగా భావిస్తున్నారు. ఆయన ప్రసంగమంతా మమ్మల్ని విమర్శించడంతోనే సరిపోయింది. రిజర్వేషన్లను ఇచ్చిందే మా పార్టీ. యూపీఏ గురించి మోదీ చెప్పినవన్నీ అబద్ధాలే’’అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగమంతా అబద్ధాల పుట్ట అని రాహుల్‌ విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని