56 పేర్లతో కాంగ్రెస్‌ మూడో జాబితా

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ గురువారం తెలంగాణతోసహా 8 రాష్ట్రాలకు చెందిన 56 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది.

Updated : 22 Mar 2024 06:19 IST

 తెలంగాణ సహా 8 రాష్ట్రాల నుంచి అభ్యర్థులు
కలబురగి బరిలో ఖర్గే అల్లుడు రాధాకృష్ణ

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ గురువారం తెలంగాణతోసహా 8 రాష్ట్రాలకు చెందిన 56 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. తాజా జాబితాలో తెలంగాణ నుంచి 5, అరుణాచల్‌ ప్రదేశ్‌ 2, గుజరాత్‌ 11, కర్ణాటక 17, మహారాష్ట్ర 7, రాజస్థాన్‌ 5, పశ్చిమబెంగాల్‌ 8, పుదుచ్చేరి నుంచి ఒక అభ్యర్థి పేర్లున్నాయి. కర్ణాటక నుంచి అవకాశం పొందినవారిలో అయిదుగురు మంత్రుల వారసులున్నారు. బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి రాష్ట్ర రవాణామంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి, చిక్కోడి స్థానం నుంచి రాష్ట్ర మంత్రి సతీష్‌ జర్కిహోళి కుమార్తె ప్రియాంక జర్కిహోళి, బెళగావి నుంచి మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాల్కర్‌ కుమారుడు మృణాల్‌ రవీంద్ర హెబ్బాల్కర్‌, బాగల్‌కోట్‌ నుంచి వ్యవసాయ మంత్రి శివానందపాటిల్‌ కుమార్తె సంయుక్త పాటిల్‌, బీదర్‌ నుంచి అటవీశాఖ మంత్రి ఈశ్వర్‌ ఖండ్రే కుమారుడు సాగర్‌ ఖండ్రేలను రంగంలోకి దింపారు. దావణగెరె నుంచి పోటీకి నిలబెట్టిన ప్రభా మల్లికార్జున్‌ మాజీ మంత్రి శామనూరు శివశంకరప్ప కోడలు. కలబురగి (గుల్బర్గా) నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణను రంగంలోకి దింపారు. మాజీ స్పీకర్‌ ఎం.వి.వెంకటప్ప కుమారుడు, పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ ఎం.వి.రాజీవ్‌గౌడ బెంగుళూరు ఉత్తర నియోజకవర్గంలో కేంద్ర మంత్రి శోభా కరాంద్లాజేతో తలపడనున్నారు. ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి ఐపీఎస్‌ అధికారి భారత హేమంత్‌ నింబాల్కర్‌ సతీమణి అంజలి నింబాల్కర్‌కు అవకాశం ఇచ్చారు. రాజస్థాన్‌లోని సీకర్‌ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఎంకు విడిచిపెట్టారు.
బీ మహారాష్ట్రలోని సోలాపుర్‌ రిజర్వుడు నియోజకవర్గం నుంచి కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ శిందే కుమార్తె ప్రణీతి శిందేను రంగంలోకి దింపారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి తన సొంత నియోజకవర్గం బహరంపుర్‌ నుంచి పోటీ చేయనున్నారు. దక్షిణాదిలో కర్ణాటకను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ అక్కడున్న 28 స్థానాల్లో తాజాగా ప్రకటించిన 17 స్థానాలతో కలిపి ఇప్పటివరకు 24 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని