‘గ్యారంటీ’ల స్ఫూర్తితో మ్యానిఫెస్టో!

కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్యారంటీ హామీలతో మ్యానిఫెస్టోలు విడుదల చేసి విజయం సాధించిన విధానాన్నే పార్లమెంటు ఎన్నికల్లో దేశమంతా అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది.

Updated : 26 Mar 2024 14:17 IST

లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక, తెలంగాణ మోడల్‌ హామీలు..
కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గ్యారంటీ హామీలతో మ్యానిఫెస్టోలు విడుదల చేసి విజయం సాధించిన విధానాన్నే పార్లమెంటు ఎన్నికల్లో దేశమంతా అమలుచేయాలని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాన్ని రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణ మోడల్‌ హామీలపై దృష్టిపెట్టిన అధిష్ఠానం.. ఈ రెండు రాష్ట్రాల్లో విజయవంతమైన గ్యారంటీలతో ‘పాంచ్‌ న్యాయ్‌’ పేరుతో సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళలు, రైతులు, యువత ఓట్లను ఆకట్టుకునేలా ‘ఐదు న్యాయా’లతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో ఉండనుంది. వీటి కింద మొత్తం 25 గ్యారంటీ హామీలు ఉండనున్నాయి.

మహిళలకు బాసట..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన మహాలక్ష్మి పథకం మహిళల సాధికారతకు కొత్త బాటలు వేసిందని పార్టీ అధిష్ఠానానికి పీసీసీ నివేదించింది. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు కొత్త ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఇంటింటికీ ఆర్థిక బాసటనిస్తున్నాయని తెలిపింది. ఇదే స్ఫూర్తితో దేశంలోని ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే హామీని కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల్లో గ్యారంటీ హామీగా ఇవ్వబోతోంది.

తుక్కుగూడ వేదికగా..

తెలంగాణలో బీసీ కులగణనకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ వర్గాల జనాభాను ఆకట్టుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే తరహాలో దేశమంతటా కులగణన కాంగ్రెస్‌ ఈ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఎంచుకుంది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అధికారంలోకి రాగానే దేశమంతా అమలు చేస్తామని పార్టీ హామీ ఇస్తుండటం గమనార్హం. వచ్చే నెల మొదటివారంలో హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో కాంగ్రెస్‌ నిర్వహించనున్న భారీ ప్రచార సభలో జాతీయ స్థాయిలో అమలుచేసే గ్యారంటీ హామీలతో మ్యానిఫెస్టోను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలు విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని