మా ‘పన్నీరు సెల్వం’ ఎవరో?.. మాజీ సీఎంకు పోటీగా నలుగురు ఓపీఎస్‌లు

తమిళనాడులోని రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్డీయే కూటమి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరు సెల్వంకు ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో నలుగురు స్వతంత్రులతో ఇబ్బంది ఏర్పడింది.

Updated : 06 Apr 2024 07:56 IST

 రామనాథపురంలోవిచిత్ర పరిస్థితి

ఈనాడు, చెన్నై: తమిళనాడులోని రామనాథపురం లోక్‌సభ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్డీయే కూటమి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీరు సెల్వంకు ఇప్పుడు అదే పేరుతో ఉన్న మరో నలుగురు స్వతంత్రులతో ఇబ్బంది ఏర్పడింది. ఇప్పుడు ఈ ఐదుగురు ఒ.పన్నీరు సెల్వంలు ప్రచారంలో ఉన్నారు. అందరూ స్వతంత్రులే కావడంతో ఎవరు అసలు ఒ.పన్నీరు సెల్వమో గుర్తించేందుకు ఓటర్లు నానా తంటాలు పడుతున్నారు. ఎన్డీయే కూటమిలో తానే ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా ఓపీఎస్‌ ప్రచారం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకే తనను బహిష్కరించడంతోపాటు తాను రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు న్యాయస్థానాలు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే శ్రేణులు తనవైపు ఉన్నారా.. ఈపీఎస్‌ వైపు ఉన్నారా తేల్చుకునేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇదివరకు ఆయన ప్రకటించారు. ఇదే అతి పెద్ద సమస్యగా మారింది. వాస్తవంగా రామనాథపురం స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది. చివరికి ఓపీఎస్‌కు కేటాయించారు. భాజపా మద్దతుతో బరిలో ఉన్న ఒ.పన్నీరు సెల్వానికి పనసపండు గుర్తు కేటాయించారు. మిగిలిన నలుగురికీ బకెట్‌, చెరకుతో రైతు, ద్రాక్ష, గాజు గ్లాసు గుర్తులు వచ్చాయి. బ్యాలెట్‌ పేపరులో ఈ స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం, వరుస సంఖ్యలోనూ గందరగోళం ఉండటంతో సమస్య ఏర్పడుతోంది. ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నా బ్యాలెట్‌ పేపరుపై పొట్టి అక్షరం ‘ఒ’నే వాడుతుండటంతో అందరి పేర్లూ ఒకేలా ఉండనున్నాయి. కేవలం చిహ్నం చూసి మాత్రమే జనాలు అసలు ఓపీఎస్‌ ఎవరో గుర్తుపట్టాల్సి వస్తోంది. పొరపాటు జరిగితే ఓట్లు అటు ఇటు అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఈ పరిస్థితిపై ఓపీఎస్‌ తల పట్టుకుంటున్నారు. ఇప్పుడాయనకు మరో తలనొప్పి వచ్చిపడింది. ప్రచారంలో అలవాటు ప్రకారం పొరపాటున ‘రెండాకుల గుర్తు’కు ఓటు వేయండని నోరు జారుతున్నారు. అదే స్థానం నుంచి అన్నాడీఎంకే రెండాకులపై జయపెరుమాల్‌ పోటీ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నిక ఆయనకు పెద్ద సవాల్‌గా మారుతోంది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో 25 మంది పోటీలో ఉన్నారు. ఇండియా కూటమి తరఫున ఐయూఎంఎల్‌ అభ్యర్థి నవాజ్‌ కని బరిలో ఉన్నారు.

పనస పండ్లకు గిరాకీ..

మాజీ సీఎం ఓపీఎస్‌కు పనస పండు గుర్తు కేటాయించారు. స్వతంత్రుల్లో ఓపీఎస్‌ల బెడద పెరగడంతో తమ పనస పండు గుర్తును పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలని పన్నీరు సెల్వం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ అనుచరులు పనస పండ్లు కొనుగోలు చేసి ప్రచారాలకు తీసుకెళ్తున్నారు. టన్నులకొద్దీ తమ వెంట తీసుకెళ్తున్నారు. స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు. వాటిని పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రామనాథపురంలోని ప్రముఖ వ్యాపారులు రోజుకు 30, 40 టన్నుల పనస పండ్లు విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఆర్డర్లు మరింతగా వస్తుండటంతో విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని