కాంగ్రెస్‌ బలహీనతలే భాజపా బలం!

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనతలే అధికార భాజపాకు బలంగా మారుతున్నాయి. ఆ కారణంగానే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ దళం తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది.

Updated : 07 Apr 2024 22:34 IST

ఉత్తర భారతంపై కాషాయ దళానికి గట్టి పట్టు
కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ప్రత్యర్థులు
కోలుకోలేకపోతున్న కాంగ్రెస్‌

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనతలే అధికార భాజపాకు బలంగా మారుతున్నాయి. ఆ కారణంగానే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ దళం తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. మోదీ, అమిత్‌ షాల ద్వయం సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. వాటిని ఛేదించడం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదు. భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోటీ నడిచే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, గోవా, ఉత్తరాఖండ్‌, అస్సాంలలో భాజపా తిరుగులేని ఓట్ల శాతంతో ప్రత్యర్థికి అందనంత దూరంలో ఉంటోంది. ఈ 10 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 133 సీట్లుండగా 2019లో భాజపా 128 సీట్లు సాధించి 96.24% స్థానాలను ఒడిసిపట్టుకుంది. ఉత్తర భారత దేశంలో ముఖ్య రాష్ట్రాలైన ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌లలో భాజపా, కాంగ్రెస్‌లు రెండూ కూటమిగా పోటీ చేస్తున్నాయి.

అయితే ఎన్డీయే కూటమికి భాజపా తలలా వ్యవహరిస్తుంటే.. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ పరిస్థితి తోకలా మారింది. 120 స్థానాలున్న ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా సొంతంగా గత ఎన్నికల్లో 79 స్థానాలను, కూటమి పార్టీలతో కలిసి 103 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి కాంగ్రెస్‌కు వచ్చింది కేవలం రెండు స్థానాలే. భాజపా కూటమి 85.83% స్థానాలను కైవసం చేసుకుంటే.. ప్రత్యర్థి కూటమి కేవలం 14.16% సీట్లనే సొంతంగా చేసుకోగలిగింది. దేశంలోని లోక్‌సభ సీట్లలో 46.59% స్థానాలున్న ఈ 12 రాష్ట్రాల్లో 91.30% స్థానాలను కైవసం చేసుకుని భాజపా ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో క్రితంసారి కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయగా, ఈసారి సమాజ్‌వాదీ పార్టీతో కలిసి రంగంలోకి దిగుతోంది. అదొక్కటే ఆ పార్టీకి కొంత ఊరటనిచ్చే అంశం. అయితే ఇదే సమయంలో కొన్ని ఉప ప్రాంతీయ పార్టీలు సమాజ్‌వాదీ పార్టీని వదిలి భాజపా పంచన చేరాయి.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే హిందీ రాష్ట్రాల్లో బలమైన ప్రభావం చూపగలిగే స్థితిలో ఉండాలి. ఈ సూత్రాన్ని భాజపా వంటబట్టించుకుని పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుంటే కాంగ్రెస్‌ మనుగడ కోసం పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 52 సీట్లు రావడానికి పంజాబ్‌లో వచ్చిన 8 సీట్లు ఎంతో దోహదం చేశాయి. కేరళ, తమిళనాడు తర్వాత ఉత్తర భారత దేశంలో ఆ పార్టీకి దక్కిన అత్యధిక సీట్లు ఇవే. ఇప్పుడు అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అక్కడ కాంగ్రెస్‌ను గతంలో నడిపించిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ భాజపాలో చేరారు. అక్కడ కాంగ్రెస్‌, ఆప్‌, భాజపా, శిరోమణి అకాలీదళ్‌ల మధ్య పోటీ చతుర్ముఖంగా తయారైంది. రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి అధికారం చేపట్టినా గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సున్నాకే పరిమితమైంది.

గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో భాజపా 59% ఓట్లు సాధిస్తే.. కాంగ్రెస్‌ 34%కే పరిమితమైంది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో, న్యాయ యాత్రలు నిర్వహించినా ఉత్తర భారతంలో పెద్దగా ప్రభావం కనిపించనట్లే ఉంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఇండియా కూటమికి తలలా వ్యవహరించే సమాజ్‌వాదీ పార్టీ భాజపా తరహాలో దూకుడుగా లేకపోవడం ప్రతిపక్ష బలాన్ని పెంచలేకపోతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 15 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అస్సలు ఖాతానే తెరవలేకపోయింది. కేరళలో మినహాయించి ఇంకెక్కడా రెండంకెల సంఖ్యను చేరుకోలేకపోయింది.

పుదుచ్చేరిలో మినహా మిగిలిన ఎక్కడా 50% ఓట్లను మించి సాధించలేకపోయింది. భాజపా 8 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క సీటూ సాధించలేకపోయినా మిగిలిన రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో బలమైన ప్రాబల్యాన్ని ప్రదర్శించగలిగింది. మూడు రాష్ట్రాల్లో 60%కిపైగా, 10 రాష్ట్రాల్లో 50%కిపైగా ఓట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించగలిగింది. సీట్లపరంగా అత్యధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో 90%కిపైగా గెలుచుకుని ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణల్లో కొంత సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఉండటం తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే జతకట్టడం కొంత సానుకూలత కావొచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ 3 రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ పరిస్థితుల్లో పెద్ద మార్పేమీ లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. దిల్లీ, ఝార్ఖండ్‌లలో స్థానిక మిత్రపక్షాలైన ఆప్‌, జేఎంఎంలపై ఆధారపడగా.. ప్రస్తుతం ఆ రెండు పార్టీల ముఖ్య నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌ జైల్లో ఉండటం కూటమికి ఇబ్బందికరంగా మారింది. గత ఎన్నికల తర్వాత భాజపా కూటమిపరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నా తర్వాత పరిస్థితులను సరిదిద్దుకుంది. బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌, చిరాగ్‌ పాసవాన్‌, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబులను కూటమిలో చేర్చుకుని పూర్వబలాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ తిరుగుబాటు నేతలను అక్కున చేర్చుకుని అక్కడ కొంతమేర నష్ట నివారణ చేసుకునే ఎత్తులు వేసింది. ప్రస్తుతం ఈ పార్టీకి పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లో అఖిలేశ్‌ యాదవ్‌, బిహార్‌లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తమిళనాడులో ఎంకే స్టాలిన్‌ల నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌ బలంగా ఎదుర్కొనే పరిస్థితి ఒక్క కేరళలో తప్పితే ఎక్కడా కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని