ఏపీ ఓటర్లపై అక్కడి పార్టీల కన్ను

ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధానపార్టీల అభ్యర్థుల్లో కొందరు హైదరాబాద్‌ నగరానికి క్యూ కడుతున్నారు.

Updated : 10 Apr 2024 07:01 IST

 హైదరాబాద్‌లో స్థిరపడిన వారితో పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు
పోలింగ్‌ నాటికి రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు

ఈనాడు- హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రెండు ప్రధానపార్టీల అభ్యర్థుల్లో కొందరు హైదరాబాద్‌ నగరానికి క్యూ కడుతున్నారు. మహానగరంలో స్థిరపడిన లక్షలమంది ఆంధ్రా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. తెదేపా, వైకాపా అభ్యర్థులు కొందరు ఇప్పటికే సమావేశాలు నిర్వహించగా.. మరికొందరూ ఇదే బాటలో ఉన్నారు. మే 13న పోలింగ్‌ ఉండటంతో అప్పటికి వారిని అక్కడకు తీసుకెళ్లేందుకు బస్సులు, రైళ్లలో టికెట్లు బుక్‌ చేస్తున్నారు. మహానగరంలో కొన్ని లక్షల మంది ఆంధ్రా ఓటర్లు ఉంటున్నారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, మేడ్చల్‌, ఎల్బీ నగర్‌ తదితర నియోజకవర్గాల పరిధిలో వీరు నివాసం ఉంటున్నారు. ఏపీలోని అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించడంలో వీరి ఓట్లు కీలకమని భావిస్తున్నారు.

ప్రసన్నానికి ప్రయత్నాలు..

ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ సంఘాలు, కమిటీలు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం తరఫున సీబీఎన్‌ ఆర్మీ ఓ ప్రణాళిక రూపొందించింది. ఇందులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో ఈ ఆర్మీ నగరంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు అదే సైన్యం తరఫున ఉపసంఘాలను నియమించారు. ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వీరు వెళ్లి చంద్రబాబు పాలన ఆవశ్యకతను వివరిస్తున్నారు. ఓటర్లను ఆయా నియోజకవర్గాలకు తీసుకెళ్లేందుకు బస్సులు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఇటీవల ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి నరసరావుపేట తెదేపా అభ్యర్థి చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. పర్చూరు నియోజకవర్గ ఓటర్ల ఆత్మీయ సమావేశం వారం రోజుల క్రితం జరిగింది. అభ్యర్థి ఏలూరి సాంబశివరావు పాల్గొని రాజధానిలో స్థిరపడిన ఏపీ ఓటర్లతో మాట్లాడారు. ఇదే తరహాలో వైకాపా అభ్యర్థులు కూడా వరుసగా ఆత్మీయ సమావేశాల పేరుతో ఓటర్లను కలుస్తున్నారు. ఇప్పటికే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం వైకాపా అభ్యర్థి పిల్లి సూర్యప్రకాశ్‌, కొత్తపేట వైకాపా అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తమ తమ నియోజకవర్గ ఓటర్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 14న కూకట్‌పల్లి ఎన్‌కేఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఓ సమావేశం నిర్వహించడానికి వైకాపా ఏర్పాట్లు చేస్తోంది. ఒంగోలు లోక్‌సభ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శాసనసభకు పోటీచేస్తున్న ఆ పార్టీకి చెందిన పదిమంది అభ్యర్థులు ఇందులో పాల్గొనబోతున్నారు. తెదేపా సైతం మరో పదిరోజుల్లో భారీ ఆత్మీయ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. జనసేన తరఫున ఈ సమావేశాల నిర్వహణకు ఆ పార్టీ అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని